Oil Prices Hike In Pakistan : పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి(Pakistan Financial Situation) నానాటికీ దిగజారిపోతుంది. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం కొత్త ప్రభుత్వానికి పెను సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో సామాన్యుడి నెత్తిన భారీగా ఆయిల్ ధరల భారాన్ని మోపేందుకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు పెరగడం,డాలర్ తో పోల్చితే పాక్ రూపాయి విలువ దిగజారడంతో ఇంధన ధరలను(Oil Prices In Pakistan) భారీగా పెంచాల్సిందేనని పాకిస్తాన్ లోని ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ(OGRA)ప్రతిపాదించింది. లీటరు పెట్రోల్ పై రూ. 83.5, డీజిల్‌పై రూ.119 పెంచేందుకు పెట్రోలియం శాఖ అనుమతి కోరింది. దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ఆయిల్ అండ్ గ్యాస్ అథారిటీ (ఓజీఆర్ఏ) సూచనల మేరకు ఇంధన ధరలను పెంచాలని భావిస్తోంది షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం. శనివారం నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయని సమాచారం. ఇక,ఇతర చమురు ఉత్పత్తులపైన కూడా ధరలు భారీగా పెరగనున్నాయి. లైట్ డీజిల్‌పైన రూ.77.31, కిరోసిన్పైన రూ.36.5 పెంచాలని పాక్ ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ధరలు అమలైతే పాక్ ప్రజలకు ఇంధనం మరింత భారంగా మారుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ లో పెట్రోల్, డీజిల్ పై 17 శాతం జీఎస్టీ వసూలు చేస్తుండగా దీనిని 70 శాతానికి శాతానికి పెంచాలని ఓజీఆర్ఏ ప్రతిపాదించింది. ఈ ధరలపై ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను సంప్రదించాక తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. పెట్రో ధరల పెంపు ప్రతిపాదనకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే పాకిస్తాన్ చరిత్రలో తొలిసారి లీటర్ పెట్రోల్,డీజిల్ ధరలు రూ.200 దాటనున్నాయి. కాగా,ఈ పెట్రోల్,డీజిల్ ధరల పెంపు ప్రతిపాదనలపైనే ఇప్పటికే పాక్ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్ ధరలు భారీగా పెరిగితే పాక్ లో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవక తప్పదని తెలుస్తోంది.
ALSO READ Russia-Ukraine War: అష్టదిగ్బంధంలో రష్యా..? జెలెన్స్కీ పిలుపుతో స్పందించిన యూఎస్..
ఇమ్రాన్ ఖాన్ అసమర్థత కారణంగానే దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిందంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్(Shehabaz Sharif) ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. దీంతో కొత్త ప్రభుత్వం తమకు ఊరట కలిగించే నిర్ణయాలను తీసుకుంటుంది అక్కడి ప్రజలు ఆశించారు. అయితే దీనికి భిన్నంగా ప్రధాని పదవి చేపట్టి పది రోజులు కూడా కాకముందే ఆయిల్ ధరలు పెంచే ప్రతిపాదనకు షరీఫ్ జై కొట్టనున్నట్లు వస్తున్న వార్తలు అక్కడి ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు, పాక్ ప్రజలను కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. కరాచీలో లోడ్ షెడ్డింగ్ సమస్య కారణంగా నగరానికి సరిపడా విద్యుత్‌ను సరఫరా చేయలేకపోతున్నారు అధికారులు. ఫలితంగా కరాచీలోని చాలా ప్రాంతాల ప్రజలు అంధకారంలోనే గడుపుతున్నారు. కోరంగీ, లంధీ, రైల్వే కాలనీ, నుస్రత్ భుట్టో కాలనీ, ఖ్వాజా అజ్మేర్ నగ్రీ, పాపోష్ నగర్, లియాకత్ మార్కెట్, మలిర్, గులిస్తాన్-ఇ-జౌహార్ మొదలైన ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. పవిత్ర రంజాన్ మాసంలో ప్రార్థనలు కూడా చీకట్లోనే చేసుకోవాల్సి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Oil prices, Pakistan