Crocodile Attack: మనిషిని చంపి మింగేసిన పొడవాటి మొసలి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడు. అతడు ఏమైపోయాడో కనుక్కోండంటూ అతడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే పోలీసులు రంగంలోకి దిగారు. తీరా ఆ పోలీసులు విచారణ మొదలు పెడితే..

  • Share this:
చేపలు పట్టడానికి నదిలోకి వెళ్లిన వ్యక్తిపై ఒక మొసలి దాడిచేసి చంపేసిన ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఆ దేశంలోని క్వీన్స్‌లాండ్‌లో 69 ఏళ్ల ఆండ్రూ హియర్డ్ అనే జాలరి గత వారం కనిపించకుండా పోయాడు. హించిన్‌ బ్రూక్ అనే ఐలాండ్ వద్ద బాధితుడు చేపల వేటకు వెళ్లాడు. కానీ ఆ తర్వాత అతడు తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఈ కేసు విచారణలో భాగంగా అధికారులు రెండు మొసళ్లను చంపి పరీక్షించారు. 13.8 అడుగుల పొడవైన ఒక పెద్ద మొసలి కడుపులో బాధితుడి శరీర భాగాలు ఉన్నట్లు వారు గుర్తించారు. 10 అడుగుల పొడవైన మరో మొసలిని కూడా క్వీన్స్‌లాండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ (DES) విభాగం చంపిందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు సోమవారం అధికారికంగా వెల్లడించారు.

హియర్డ్ చేపల వేటకు వెళ్లిన ప్రాంతంలోని నీటిలో గాలించినప్పుడు ఈ రెండు మొసళ్లు కనిపించాయని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా వాటిని చంపాల్సి వచ్చిందని వివరించారు. పెద్ద మొసలి కడుపులో మానవ అవశేషాలను కనుగొన్నామని క్వీన్స్‌లాండ్ పోలీస్ యాక్టింగ్ ఇన్‌స్పెక్టర్ ఆండ్రూ కోవీ చెప్పారు. ఈ రెండు మొసళ్లు కలిసే హియర్డ్‌పై దాడి చేసి చంపాయని తెలుస్తోందన్నారు. రెండో మొసలిని పూర్తిగా పరీక్షించాల్సి ఉందన్నారు.

ఇంతకుముందు కూడా..
బాధితుడు చేపల వేట కోసం ఉపయోగించిన పడవను కూడా పోలీసులు కనుగొన్నారు. అది తీవ్రంగా దెబ్బతిన్న స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. ఈ సంఘటన తరువాత స్థానికులు చేపలు పట్టడానికి వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. హియర్డ్ తప్పిపోయిన అదే ప్రాంతంలో గతంలో ఒక పెద్ద మొసలి తనపై దాడికి ప్రయత్నించిందని మరో జాలరి తెలిపారు. 15 అడుగుల పొడవైన ఆ పెద్ద మొసలి తన పడవంత పొడవుగా ఉందన్నారు. పడవ వెనుక భాగంపై దాడి చేయగానే అక్కడి నుంచి వేగంగా తప్పించుకొని వెనక్కు వచ్చానని వివరించారు.

కేసులు పెరుగుతున్నాయి
ఈ నెలలో క్వీన్స్‌లాండ్‌లో ఇప్పటికే రెండు మొసలి దాడి కేసులు నమోదయ్యాయి. తాజా కేసు మూడోది. ఆస్ట్రేలియాలో మొసళ్ల దాడులు చాలా అరుదుగా జరుగుతాయి. కానీ వాటి నివాస ప్రాంతాల వద్దకు వెళ్లడం, వాటికి ఆహారం లభించకపోవడం వల్ల ఒక్కోసారి పెద్ద మొసళ్లు మనుషులపై దాడి చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ విషయంపై స్థానికులను అప్రమత్తం చేయడానికి క్వీన్స్‌లాండ్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

పెద్దవి ఉన్నాయి
క్వీన్స్‌లాండ్‌లో 2019లోనూ ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. చేపల వేటకు వెళ్లిన వ్యక్తిపై ఒక మొసలి దాడి చేసింది. కానీ బాధితుడు దాని కంటిలో గట్టిగా పొడిచి, ప్రాణాలతో తప్పించుకున్నాడు. 2020 సెప్టె౦బరులో స్థానికంగా ఉన్న ఒక పర్యాటక ప్రాంతంలో 14 అడుగుల భారీ మొసలిని అధికారులు పట్టుకున్నారు. తాజా ఘటన తరువాత పెద్ద మొసళ్లు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
Published by:Hasaan Kandula
First published: