ఉత్తర కొరియా (North Korea). ప్రపంచంలో ఎక్కువగా వార్తల్లో నిలిచే దేశం. దేశాధ్యక్షుడిగా కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారు. అమెరికాతో కయ్యానికి కాలు దువ్విన కిమ్.. ఇక సరిహద్దు దేశం దక్షిణ కొరియాకు ఎప్పటికైనా కంటిలో నలుసే. అయితే ఇపుడు ఏకంగా చైనాకే (China) జలక్ ఇచ్చాడు కిమ్ జోంగ్. అదేంటి అంటారా? ఇది చదవండి..
దేశవ్యాప్తంగా లెదర్ కోట్లు, జాకెట్లను నిషేధిస్తూ కిమ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తప్ప ఎవరూ వాటిని ధరించడానికి వీల్లేదని ఆ ఆదేశాల్లో కొరియా పేర్కొంది. ఈ నెల 21న ప్యాంగ్యాంగ్ పర్యటన సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ వేసుకున్న లెదర్ జాకెట్ను పోలినవి.. కొందరు యువకులు వేసుకుని కనిపించారు. ఉత్తర కొరియా పౌరులు అలా ప్రవర్తించడం.. దేశ అధ్యక్షుడి ఫ్యాషన్ ఛాయిస్ (fashion choice)ను అవమానించినట్లే అవుతుందని కొరియా మండిపడింది. అందుకే లెదర్జాకెట్ల (leather jackets)ను కొరియాలో నిషేధించింది. నిషేధ ఆదేశాలు ధిక్కరిస్తే ఆరేళ్లు నిర్బంధ కారాగార శిక్ష విధిస్తామని ప్రభుత్వం హెచ్చరికలు సైతం జారీ చేసింది.
చైనా నుంచి డూప్లికేట్లు..
చైనా (china)కు చెందిన ఓ మీడియా కథనం ప్రకారం.. 2019లో ఓ కార్యక్రమం సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) లెదర్ కోట్ ధరించి కనిపించాడు . అప్పటి నుంచి వాటికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అయితే ఒరిజినల్ లెదర్ ట్రెంచ్ కోట్ల ధర చాలా ఎక్కువ. దీంతో చైనా నుంచి నకిలీ లెదర్ జాకెట్లు ( duplicate leather jackets) ఎక్కువగా ఉత్తర కొరియాకు ఎగుమతి అయ్యాయి. వాటిని కొరియా యువత ఎక్కువగా కొనుగోలు చేస్తూ వస్తోంది. అయితే కిమ్ ఆ జాకెట్లో కనిపించిన తర్వాతే.. వాటి అమ్మకాలు పెరిగాయన్నది అక్కడి లెదర్ వ్యాపారులు అంటున్నారు.
సగం ధరకే చైనా జాకెట్లు..
ఒరిజినల్ లెదర్ కోట్ల ధర కంటే తక్కువ ధరకే నకిలీవి అమ్ముడపోయేవి. అయితే తాజా పరిణామంతో లెదర్ జాకెట్లను నిషేధిస్తూ ఉత్తర కొరియా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un), అతని సోదరి కిమ్ యో జోంగ్ లాంటి అధికారం నడిపించే వాళ్లకు మాత్రమే అలాంటి జాకెట్లు ధరించే అర్హత ఉందని తాజా ప్రభుత్వ ఆదేశాలు పేర్కొన్నాయి. ఇలా తమ దేశ యువతకే కాదు.. చైనాకు జలక్ ఇచ్చాడు కిమ్.
అధ్యక్షుడిని కించపరుస్తున్నారంటూ..
అది వాళ్లకే హుందాతనమని, కానీ డూప్లికేట్ జాకెట్లతో అధ్యక్షుడిని అనుకరిస్తున్నారని.. కించపరుస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ప్రభుత్వం పేర్కొంది.అంతేకాదు ప్యాషన్ పోలీసింగ్ (fashion policing) పేరుతో ప్యోంగ్సాంగ్ సిటీలో పోలీసులు పెట్రోలింగ్ చేపట్టారు. రోడ్ల మీద జనాల నుంచి అలాంటి జాకెట్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు లెదర్ వ్యాపారులకు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు.
మా డబ్బులతో కొనుక్కుంటే మీకేంటి..?
ఉత్తర కొరియా (north korea) ఆంక్షలపై అక్కడి యువత నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ డబ్బుతో కొనుక్కున్న వస్తువులపై ప్రభుత్వ అజమాయిషీ ఏంటని ప్రశ్నిస్తున్నారు వాళ్లు. పైగా 2000 సంవత్సరం నుంచే లెదర్ జాకెట్ ఫ్యాషన్ ట్రెండ్ ఉందని, అలాంటప్పుడు ఇప్పుడు ఎలా నిషేధిస్తారని వాదిస్తున్నారు యువత .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kim jong un, North Korea