ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. ఏది చేసిన సంచలనమే. అతడు తీసుకునే నిర్ణయాలు కూడా అలానే ఉంటాయి. ఆయనకు సంబంధించిన ఏ వార్త అయినా కూడా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే కిమ్ ఆరోగ్యంపై ఇప్పటికే పలు రకాల వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కిమ్‌కు సంబంధించిన ఓ ఫొటో మరోసారి వార్తలో నిలిచాయి. ఆ ఫొటోల్లో కిమ్ తలపై ఆకుపచ్చ రంగులో ఉన్న గుర్తు, బ్యాండేజ్ కనిపించాయి. జూలై 24 నుంచి 27 వరకు ఆయన కొరియన్ పీపుల్స్ ఆర్మీ కార్యక్రమాల్లో పాల్గొన్నారని.. ఆ సమయంలో కిమ్ తలపై కుడి భాగంలో మచ్చ, బ్యాండేజ్ కనిపించాయని ఎన్కే న్యూస్ పేర్కొన్నట్టు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.
జూలై 27 నుంచి 29 మధ్య జరిగిన ఇతర కార్యక్రమాల్లో కూడా కిమ్ జోంగ్ ఉన్ తలపై మచ్చ, బ్యాండేజ్ కనిపించాయని ఎన్కే న్యూస్ తెలిపింది. 37 ఏళ్ల కిమ్.. అనారోగ్యంతో బాధపడుతున్నారని పలుమార్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
గతేడాది కొన్ని నెలలపాటు కిమ్ అజ్ఞాతంలోకి వెళ్లడం.. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారనే వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. అలాగే తన తాత, ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ సంగ్ జయంతి వేడుకలకు ఏప్రిల్ 15న(గతేడాది) కిమ్ హాజరు కాలేదు. ఆయన ఆరోగ్యం రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఒకానొక సమయంలో కిమ్ మృతి చెందారనే వార్తలూ అంతర్జాతీయ మీడియాలో వచ్చాయి.
ఆ తర్వాత వివిధ అధికారిక కార్యక్రమాల్లో కిమ్ పాల్గొన్న ఫోటోలను మీడియా విడుదల చేయడంతో అలాంటి వార్తలకు ముగింపు పలికారు. ఇదిలాఉండగా, ఈ మధ్యే జరిగిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశానికి సంబంధించిన ఫోటోలను ఉత్తర కొరియా అధికారిక మీడియా విడుదల చేసింది. అందులో కిమ్ చాలా బరువు తగ్గినట్లు కనిపించారు. అయితే కిమ్ కావాలనే బరువు తగ్గారా? లేదా అనారోగ్య కారణాల వల్ల సన్నబడిపోయారా? అన్న విషయంపై స్పష్టత లేదు. తాజాగా ఆయన తలపై బ్యాండేజ్‌తో కనిపించడం మరోసారి ఆయన ఆరోగ్యంపై చర్చకు తావిచ్చింది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.