NORTH KOREA KIM JONG UN EXECUTED 7 IN 3 YEARS FOR WATCHING SOUTH KOREAN VIDEOS CLAIMS RIGHTS GROUP SK
North Korea: చిన్న తప్పుకే ఉరిశిక్ష.. ఆ వీడియోలు చూశారని చంపేశారు.. రాక్షస పాలన అంటే ఇదే
కిమ్ జోంగ్ ఉన్ (ఫైల్)
Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ అరాచక పాలనలో జరిగిన దారుణాలను వెలికితీసే ప్రయత్నం చేసింది ట్రాన్సిషనల్ జస్టిస్ వర్కింగ్ గ్రూప్ అనే మానవ హక్కుల సంస్థ. తాజాగా విడుదల చేసిన నివేదికలో సంచలన విషయాలు ప్రచురించింది.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నియంత పాలనతో అక్కడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. చిన్న చిన్న తప్పులకు కూడా పెద్ద శిక్షలు విధించడం, ప్రపంచంలో ఎక్కడా లేని నిబంధనలు పెటడ్డంతో ఉత్తర కొరియా ప్రజల హక్కులు ప్రశ్నార్థకంగా మారాయి. అంతేకాదు, అక్కడ ఏం జరిగినా సరే ప్రపంచ దేశాలకు పొక్కకుండా ప్రభుత్వం జాగ్రత్తపడుతుంది. దీంతో, కిమ్ జోంగ్ ఉన్ అరాచక పాలనలో జరిగిన దారుణాలను వెలికితీసే ప్రయత్నం చేసింది ట్రాన్సిషనల్ జస్టిస్ వర్కింగ్ గ్రూప్ అనే మానవ హక్కుల సంస్థ. తాజాగా విడుదల చేసిన నివేదికలో సంచలన విషయాలు ప్రచురించింది.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడని, కేవలం కొన్ని దక్షిణ కొరియా వీడియోలు చూసినందుకు గత మూడేళ్లలో ఏడుగురు అమాయకులకు ఉరిశిక్ష విధించాడని నివేదికలో పేర్కొంది. ఆ ఏడుగురు దక్షిణ కొరియా సినిమాలు, మ్యూజిక్ వీడియోలను చూడటంతో పాటు వాటిని సీడీలు, యూఎస్బీలలో కాపీ చేసి విక్రయించారని పేర్కొంది. ఇంత చిన్న తప్పుకే కిమ్ జోంగ్ ఉన్ వారికి బహిరంగ మరణ శిక్ష విధించాడని నివేదికలో స్పష్టం చేసింది.
తమ శత్రుదేశమైన దక్షిణ కొరియా పట్ల తమ దేశ ప్రజలెవరికీ సానుభూతి ఉండకూడదంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గతంలోనే పలుమార్లు తన ప్రసంగాల్లో చెప్పారు. అందుకే, దక్షిణ కొరియాకు చెందిన పాప్ సింగర్లు పాడిన పాటలు విన్నా లేక వాటిని ఆదరించినా మరణ శిక్ష తప్పదని ప్రజలకు గుర్తుచేసేందుకే కిమ్ ప్రభుత్వం ఈ దారుణాలకు పాల్పడిందని ట్రాన్సిషనల్ జస్టిస్ వర్కింగ్ గ్రూప్ పేర్కొంది. గత ఆరు సంవత్సరాల్లో ఉత్తర కొరియా నుంచి పారిపోయి వచ్చిన 683 మందిని ఇంటర్వ్యూ చేయగా ఈ సంచలన విషయం బయటపడింది. అక్కడి చట్టాలను ఉల్లంఘించినందుకు గాను మొత్తం 27 మందికి బహిరంగ మరణశిక్ష విధించినట్లు ఇంటర్వ్యూలో పాల్గొన్న వారు చెప్పారు. వాటిలో ఎక్కువ మంది డ్రగ్స్, వ్యభిచారం, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన నేరాలకు పాల్పడ్డారని తెలిపారు.
కాగా, ఉత్తర కొరియాలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ స్థాయిలో ఆరోపణలు రావడంతో ఇటీవల మరణశిక్షలను గోప్యంగా చేపడుతున్నట్లు తమ పరిశీలనలో తేలినట్లు నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ పర్యవేక్షణ పెరగడంతో మానవ హక్కుల సమస్యలపై కిమ్ ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారించినట్లు అధ్యయన రూపకర్త పార్క్ అహ్ యోంగ్ పేర్కొన్నారు. అంటే దీని అర్థం అక్కడ మానవ హక్కుల పరిస్థితులు మెరుగుపడుతున్నట్టు కాదని, ఇది వరకు జరిగినట్లు బహిరంగంగా కాకుండా కనిపించని మార్గాల్లో అధికారిక హత్యలు కొనసాగుతున్నట్లు ఆయన ఆరోపించారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.