North Korea: కార్మికులను పట్టిస్తే పరిహారం.. రష్యా ఏజెంట్లకు ఉత్తర కొరియా భారీ ఆఫర్

ప్రతీకాత్మక చిత్రం

రష్యా (Russia)లో పారిపోయిన ఉత్తర కొరియా (North Korea) కార్మికులను అరెస్టు చేసేందుకు సరైన సమాచారం అందించిన వారికి ఆ దేశం ఏజెంట్లు 10,000 అమెరికన్ డాలర్ల వరకు రివార్డును ప్రకటించాయని వార్తలు వస్తున్నాయి.

  • News18
  • Last Updated :
  • Share this:
రష్యాలో నిర్మాణరంగ పనుల కోసమని వచ్చి.. కనిపించకుండా పోయిన కార్మికులపై ఉత్తర కొరియా 10,000 డాలర్ల రివార్డును ప్రకటించింది. పారిపోయిన ఉత్తర కొరియా కార్మికులను అరెస్టు చేసేందుకు సరైన సమాచారం అందించిన వారికి ఉత్తర కొరియా ఏజెంట్లు 10,000 అమెరికన్ డాలర్ల వరకు రివార్డును ప్రకటించాయని వార్తలు వస్తున్నాయి. రష్యాలో ఉత్తర కొరియా కార్మికులు ఐక్యరాజ్యసమితి ఆంక్షలను ఉల్లంఘిస్తున్నారు. దీంతో రష్యా ఉత్తర కొరియన్లకు కొత్త వర్కింగ్ వీసాలను జారీ చేయట్లేదు. 2019 చివరి నాటికి విదేశాల్లో పనిచేస్తున్న ఉత్తర కొరియా జాతీయులను పూర్తిగా స్వదేశానికి పంపడాన్ని ఆ దేశం తప్పనిసరి చేసింది.

ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో నిషేధిత అణ్వాయుధాలు, క్షిపణి కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి కార్మికుల డబ్బును ఆ దేశం వాడుకుంటోందని వార్తలు వచ్చాయి. దీంతో వీసా గడువు ముగియడానికి ముందే పదుల సంఖ్యలో ఉత్తర కొరియన్లు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. అయితే గత ఏడాది కాలంగా చాలామంది విద్యార్థుల వీసాలపై రష్యాకు వెళ్తున్నారు. ఆ దేశ నిఘా నుంచి తప్పించుకోవడానికి కొందరు పనిప్రదేశాల నుండి పారిపోతున్నారు. ఉత్తర కొరియా వేధింపుల నుంచి తప్పించుకోవటానికి వారు ఇలా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఉత్తర కొరియా ప్రభుత్వానికి వలస కార్మికుల నుంచి భారీగా ఆదాయం వస్తోంది. ఈ డబ్బును అణ్వస్త ప్రయోగాల కోసం ఆ దేశం ఉపయోగిస్తుందని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. కొంతమంది రష్యన్ ఏజెంట్లు కూడా ఉత్తర కొరియా కార్మికులు తప్పించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పారిపోవడానికి ప్రయత్నించే ఉత్తర కొరియా కార్మికులను తిరిగి స్వదేశానికి పంపితే రివార్డులు అందిస్తోంది ఆ దేశ ప్రభుత్వం.

తమ దేశ కార్మికుల సమాచారం అందించిన వారికి భారీ మొత్తంలో పరిహారం అందించేందుకు ఉత్తర కొరియా ముందుకు వచ్చింది. తప్పించుకున్న తమ దేశీయుల సమాచారం చెప్పిన ఏజెంట్లకు 10,000 డాలర్ల వరకు ఇస్తామని తెలిపింది. రష్యాలోని ఖబరోవ్స్క్ లో ఒక నిర్మాణ సంస్థ నుంచి దాదాపు 10 మంది ఉత్తర కొరియా కార్మికులు కనిపించకుండా పోయారు. వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. ఇలాంటి వారి ఆచూకీ చెబితే పెద్ద మొత్తంలో పరిహారం ఇస్తామని ఉత్తర కొరియా చెబుతోంది. తమ పౌరులపై ఆ దేశం పూర్తి స్థాయిలో నిషేధాజ్ఞలు విధిస్తోంది. ఇందులో భాగంగానే ఆ దేశం పరిహారాన్ని తెరపైకి తీసుకువచ్చింది.

ఉత్తర కొరియా కార్మికులను ఆ దేశం దోచుకుంటోందని ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నాయి. రష్యాలో నిర్మాణ కార్మికులకు సంవత్సరానికి సుమారు 10,000 డాలర్ల ఆదాయం వస్తోంది. దీన్ని ఈ మొత్తాన్ని వారి నుంచి ఉత్తర కొరియా బలవంతంగా తీసుకుంటోందని వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ఉత్తర కొరియా కార్మికులు కనిపించకుండా పోతున్నారు. ఒకవేళ కార్మికులు కనిపించకుండా పోతే.. కంపెనీనే కఠినంగా శిక్షిస్తారు. అందువల్ల సంబంధిత కంపెనీలు పారిపోయిన కార్మికులను అరెస్టు చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.

రష్యాకు వచ్చిన ఉత్తర కొరియా కార్మికులు తమ వీసాల గడువు ముగిసిన తరువాత కూడా రష్యాలో పనిచేస్తున్నారు. కరోనావైరస్ కారణంగా వారు తిరిగి తమ దేశానికి రాలేకపోయారు. ఉత్తర కొరియా సిబ్బంది కంపెనీలు, కార్మికులు తాము కరోనావైరస్ కారణంగా ఉత్తర కొరియాకు తిరిగిరాకపోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నారు. పనిలో పనిగా విదేశీ కరెన్సీని కూడా సంపాదిస్తున్నారు. గత మార్చిలో కరోనా నేపథ్యంలో ఉత్తరకొరియా సరిహద్దులను మూసివేసింది. దీంతో రష్యాలోని దాదాపు 500 మంది ఉత్తర కొరియా కార్మికులు స్వదేశానికి తిరిగి రాలేక పోయారని నిఘా వర్గాలు తెలిపాయి.

తప్పించుకున్న కార్మికులకు వాంటెడ్ ఆర్డర్లు జారీ చేయాలని ఉత్తర కొరియా అధికారులు రష్యన్ పోలీసులను కోరుతున్నారు. సమాచారం తెలిపిన వారికి 10,000 డాలర్లు పరిహారంగా ఇస్తామని చెప్పారు. ఒకవేళ తప్పిపోయినవారు ఉత్తర కొరియా దేశం పట్ల విధేయతను ప్రకటిస్తే.. వారిని అరెస్టు నుంచి మినహాయిస్తామని తెలిపారు. కాగా మాస్కో సమీపంలోని ఒక నిర్మాణ సంస్థలో గతవారం విద్యార్థి వీసాలపై పనిచేసినందుకు వచ్చిన ఏడుగురు ఉత్తర కొరియన్లను పోలీసులు అరెస్టు చేశారు. తనిఖీ కోసం పోలీసులు వచ్చినప్పుడు ఏడుగురు ఉత్తర కొరియన్లు పట్టుబడ్డారని కొరియన్ సంతతికి చెందిన ఒక వ్యక్తి తెలిపాడు.

రష్యన్ పోలీసులు చట్టవిరుద్ధంగా ఆ దేశంలో ఉంటున్న విదేశీయులను విచారిస్తున్నారు. ఇందులో భాగంగానే స్టూడెంట్ వీసాలతో రష్యాకు వచ్చి.. నిర్మాణ సంస్థల్లో పనిచేస్తున్న వారిని అరెస్టు చేశారు. ఉత్తర కొరియా కార్మికులు, వారికి పని కల్పిస్తున్న యాజమాన్య సంస్థలను తనిఖీ చేసినప్పుడు అసలు విషయాలు బయట పడుతున్నాయి. రష్యన్ పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో ఉత్తర కొరియా కార్మికులు తాము విద్యార్థులని పేర్కొన్నారు. కానీ వారు చదువుతున్న కళాశాల, ఇతర వివరాలు అడిగినప్పుడు మాత్రం సరైన సమాధానం ఇవ్వలేకపోయారని కొంతమంది వ్యక్తులు వెల్లడించారు.

అక్రమ వలసదారుల గురించి ఉత్తర కొరియా దౌత్య కార్యాలయం నుంచి రష్యన్ పోలీసులకు సమాచారం అందుతోంది. తప్పించుకొని పోయిన కొంతమంది ఉత్తర కొరియన్లు మళ్లీ సొంత ప్రాంతాలకు తిరిగి వస్తున్నారని రష్యా అధికారి ఒకరు వెల్లడించారు. గతంలో ఉత్తర కొరియా రష్యాకు సైనికులను కార్మికులుగా పంపిందని కొన్ని దేశాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. విదేశీ కరెన్సీ సంపాదించడానికి ఉత్తర కొరియా అధికారులు ఈ ఏర్పాట్లు చేశారని ఆరోపణలు వచ్చాయి.

విదేశీ కరెన్సీ కోసమేనా..?

గత సంవత్సరం చివరి నుంచి చాలా మంది ఉత్తర కొరియా కార్మికులు ఎయిర్ కొరియా ద్వారా రష్యాలోని వ్లాడివోస్తోక్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత, వారు స్థానిక నగరాల్లో నిర్మాణ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. విదేశీ కరెన్సీని సంపాదించడానికి చిన్నపాటి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. 2017 డిసెంబర్లో ఐరాస భద్రతా మండలి తీర్మానం ప్రకారం రష్యాలో ఉన్న వేలాది మంది ఉత్తర కొరియా కార్మికులను 2019 చివరి నాటికి స్వదేశానికి పంపారు. 2018 జనవరి నాటికి 50,000 మంది ఉత్తర కొరియన్లు రష్యాలో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది నిర్మాణరంగంలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం రష్యాలో 2,000 నుంచి 3,000 మంది ఉత్తర కొరియన్లు ఆంక్షలను ఉల్లంఘించి నివసిస్తున్నారని.. వీరంతా ప్యాంగ్యాంగ్ కోసం విదేశీ నగదు సంపాదించడానికి పనిచేస్తున్నారని చెప్పారు. వీరందరిపై నిఘా ఉంచేందుకే ఉత్తర కొరియా తాజాగా రష్యా సాయం కోరిందని దౌత్యవేత్తలు చెబుతున్నారు.
Published by:Srinivas Munigala
First published: