హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Nobel Prize 2020: హెపటైటిస్ సీ వైరస్‌ను కనుగొన్న వైద్యులకు నోబెల్, అసలేంటీ వైరస్

Nobel Prize 2020: హెపటైటిస్ సీ వైరస్‌ను కనుగొన్న వైద్యులకు నోబెల్, అసలేంటీ వైరస్

వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ (Image:twitter/The Nobel Prize

వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ (Image:twitter/The Nobel Prize

Hepatitis C Virus: హెపటైటిస్ సీ లేదా HCVవైరస్ దీర్ఘకాలిక హెపటైటిస్‌కు కారణమవుతుందని ఆల్టర్ కనుగొన్నారు. ఆయన అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థలో పనిచేస్తున్నారు.

వైద్య రంగంలో విశేష సేవ చేసిన ముగ్గురు వైద్య నిపుణులను ప్రఖ్యాత నోబెల్ బహుమతి వరించింది. కొన్ని సంవత్సరాలుగా వారు హెపటైటిస్ వ్యాధిపై పరిశోధనలు చేస్తున్నారు. వీరిలో ఇద్దరు అమెరికన్లు కాగా, ఒకరు బ్రిటీష్ వైద్యుడు. హెపటైటిస్ సీ వైరస్‌ను కనుగొనడంతో పాటు దాని జన్యుక్రమాన్ని విశ్లేషించడంలో వీరు సఫలీకృతులయ్యారు. వారి పట్టుదల, కృషికి గుర్తింపుగా ఈ సంవత్సరం మెడిసిన్ విభాగంలో నోబెల్ ప్రైజ్‌తో సత్కరించనున్నట్టు నోబెల్ కమిటీ ప్రకటించింది.

సేవలకు గుర్తింపు

నోబెల్ అందుకున్న వారిలో హార్వే జె ఆల్టర్, చార్లెస్ ఎమ్ రైస్, మైఖేల్ హౌగ్టన్ ఉన్నారు. ప్రాణాంతక హెపటైటిస్-సి వైరస్‌ను గుర్తించే పరీక్షలు, దాన్ని నిరోధించడానికి అవసరమైన మార్గాలను ఈ బృందం కనుగొంది. దశాబ్దాలుగా వీరు చేసిన కృషికి ఫలితంగానే హెపటైటిస్ సీ వ్యాధిని నిర్మూలించగలుగుతున్నామని నోబెల్ అసెంబ్లీ ఒక ప్రకటనలో పేర్కొంది. హెప్-సీ వైరస్‌ను ఏదో ఒక రోజు ప్రపంచం నుంచి పూర్తిగా నిర్మూలించగలమని నమ్ముతున్నట్టు నోబెల్ తెలిపింది. నోబెల్ అవార్డుతో పాటు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనోర్ (సుమారు రూ.8,19,42,081)లను ఈ బృందం అందుకోనుంది. ఈ మొత్తాన్ని ముగ్గురికీ సమానంగా పంచుతారు.

ముగ్గురి కృషి ఉంది

హెపటైటిస్ సీ లేదా HCVవైరస్ దీర్ఘకాలిక హెపటైటిస్‌కు కారణమవుతుందని ఆల్టర్ కనుగొన్నారు. ఆయన అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థలో పనిచేస్తున్నారు. 1970 ల నుంచి ఈ వ్యాధిపై అధ్యయనం చేస్తున్నారు. మరో వైద్యుడు హౌగ్టన్ ప్రస్తుతం ఒక ఔషధ సంస్థలో పనిచేస్తున్నారు. హెచ్‌సీవీ అనే కొత్త వైరస్ జన్యువును వేరుచేయడంలో ఆయన విజయవంతమయ్యారు. ఈ బృందంలో మరో సభ్యుడు డాక్టర్ రైస్. వీరంతా కలిసి వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో హెపటైటిస్ వ్యాధిపై పరిశోధనలు చేశారు. హెచ్‌సీవీ మాత్రమే హెపటైటిస్‌కు కారణమవుతుందని వీరు కనుగొన్నారు. ఈ పరిశోధన 1986 నుంచి 2000 వరకు కొనసాగింది. అప్పటి నుంచి డాక్టర్ రైస్ న్యూయార్క్‌లోని రాక్‌ ఫెల్లర్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. ఈ ప్రాణాంతక వ్యాధిపై అవగాహన పెంచడానికి పరిశోధకులు, వైద్యులు, రోగులు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు.

అనారోగ్యాలకు మూలం హెచ్‌సీవీ

హెపటైటిస్ కుటుంబానికి సంబంధించిన హెచ్‌సీవీ వైరస్ బాధితుల కాలేయంపై ప్రభావం చూపుతుంది. ఇది కాలేయం పనిచేయకపోవడం, మంటగా అనిపించడం వంటి అనారోగ్యాలకు దారితీస్తుంది. ఇప్పటి వరకు ఐదు హెపటైటిస్ వైరస్‌లను గుర్తించారు. హెపటైటిస్ A వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా ఇది మనుషులకు సోకుతుంది. దీన్ని కామెర్ల వ్యాధి అని కూడా అంటారు. ప్రమాదకరమైన మూడు హెపటైటిస్ వైరస్‌లో దీన్ని సులభంగా నయం చేయవచ్చు. హెపటైటిస్ B కూడా కాలేయ రుగ్మతలకు కారణమవుతుంది. కాలేయ సంబంధ వ్యాధులు సోకిన వారికి హెపటైటిస్ A కారణమా, హెపటైటిస్ B కారణమా అనేది ఇప్పటికీ చాలామంది గుర్తించలేరు. అందుకే నిపుణులు HCV వైరస్‌పై ఎన్నో పరిశోధనలు చేశారు. హెచ్‌సీవీ వైరస్‌ను, దాని జన్యుక్రమాన్ని ఆవిష్కరించిన తరువాత ఇలాంటి వ్యాధులను నయం చేయగలుగుతున్నారు.

డబ్ల్యూహెచ్ఓ ఏమంటుంది?

హెపటైటిస్ B, C రెండూ రక్తంతో సంక్రమించగలవని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. HIV వైరస్‌తో పాటు HCVని కూడా ప్రమాదకరమైన వైరస్‌ల జాబితాలో చేర్చింది. ఈ వైరస్ సోకినవారు దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. ఇది సిరోసిస్, లివర్ క్యాన్సర్‌కు దారి తీస్తుంది. ఈ వైరస్ రక్తం, ఇతర శారీరక ద్రవాల ద్వారా ఇతరులకు సోకుతుంది. 70లు, 80లలో రక్త మార్పిడి చేయించుకున్న చాలామందిలో ఈ వైరస్ బయటపడింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాపంగా 71 మిలియన్ల మంది ప్రజలు హెపటైటిస్ సి బారిన పడ్డారని అంచనా. వైరస్‌ను గుర్తించడంతోనే దాని నివారణకు నోబెల్ విజేతల బృందం బాటలు వేసిందని నోబెల్ కమిటీ ప్రశంసించింది.

First published:

Tags: Nobel Prize

ఉత్తమ కథలు