Ex-Pakistan Cricketer Mohammad Hafeez : పాకిస్తాన్(Pakistan)లో దారుణ పరిస్థితుల గురించి ఆ దేశ మాజీ క్రికెటర్ మహమ్మద్ హఫీజ్(Mohammad Hafeez)ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం మహమ్మద్ హఫీజ్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాక్ లో ప్రస్తుతం నెలకొన్న వాస్తవ పరిస్థితులకు ఈ ట్వీట్ అద్దం పడుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బుధవారం మహమ్మద్ హఫీజ్ చేసిన ట్వీట్ లో..."లాహోర్‌లోని ఏ బంకులోనూ పెట్రోలు లభించడం లేదు. ఏటీఎం మెషిన్లలో నగదు దొరకడం లేదు. రాజకీయ నిర్ణయాల కారణంగా సామాన్యులు ఎందుకు బాధపడాలి?" అని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగా ప్రశ్నించారు. తన ట్వీట్ కు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ప్రస్తుత ప్రధాని షాబాజ్ షరీఫ్‌తోపాటు మరియం షరీఫ్, భుట్టో జర్దారీలను ట్యాగ్ చేశాడు.
ఇంతకముందు క్రికెటర్‌గా ఉన్నకాలంలో కూడా పలు సందర్భాల్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ని కూడా ప్రశ్నిస్తూ వచ్చాడు మహమ్మద్ హఫీజ్. పీసీబీకి ఎన్నోసార్లు ఎదురెళ్లి రెబల్‌గా పేరు పొందినప్పటికి తనదైన ఆటతీరుతో జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా కొనసాగాడు. మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన మహ్మద్ హఫీజ్ అన్ని ఫార్మాట్లలో పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా పనిచేశాడు. అతని కెప్టెన్సీలోనే పాకిస్తాన్ 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్లో టీమిండియాపై హఫీజ్ సేన విజయం సాధించి కప్ ఎగురేసుకుపోయింది. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్తాన్ తరపున 218 వన్డేలు, 55 టెస్టులు, 119 టి20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లు కలిపి 12వేలకు పైగా పరుగులు చేసిన హఫీజ్ 250కి పైగా వికెట్లు తీశాడు.
No Petrol available in any petrol station in Lahore??? No cash available in ATM machines?? Why a common man have to suffer from political decisions. @ImranKhanPTI @CMShehbaz @MaryamNSharif @BBhuttoZardari
— Mohammad Hafeez (@MHafeez22) May 24, 2022
ఇక,గత కొంతకాలంగా పాకిస్తాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దేశంలో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని పేర్కొంటూ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో నాటకీయ పరిణామాల మధ్య ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ గద్దెదిగిపోవడం, ఆ తర్వాత ఏడాది ఏప్రిల్ 23న PML(N)అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా ఎన్నికవడం, ఆపై ఇమ్రాన్ తిరుగుబాటు ప్రకటించడం వంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయి. షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. నిత్యావసరాల ధరలు పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. . దీంతో పాకిస్తానీయుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.