బాలాకోట్‌లో మీడియాకు నో ఎంట్రీ...పాకిస్తాన్ ఆర్మీ తీరుపై అనుమానాలు

మూడు రోజులుగా వాతావరణం అనుకూలిస్తున్నా...అనుమతి నిరాకరిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా అక్కడికి మీడియాను అనుమతించమని స్పష్టంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాలను తప్పించే ప్రయత్నం చేస్తున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

news18-telugu
Updated: March 8, 2019, 7:07 PM IST
బాలాకోట్‌లో మీడియాకు నో ఎంట్రీ...పాకిస్తాన్ ఆర్మీ తీరుపై అనుమానాలు
జైషేమహ్మద్ ట్రైనింగ్ సెంటర్‌గా భావిస్తున్న ఉపగ్రహ చిత్రం (Image: Reuters)
  • Share this:
బాలాకోట్‌లోని జైషే మహ్మద్ శిక్షణాకేంద్రంపై భారత్ వైమానిక దాడులు జరిపి 10 రోజులు గడిచాయి. ఐతే అక్కడ ఎంత మంది చనిపోయారన్న దానిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐదారు చెట్లు మాత్రమే కూలిపోయాయి తప్ప..ఎలాంటి ధ్వంసం జరగలేదని ముందు నుంచీ పాకిస్తాన్ వాదిస్తోంది. ఇక మన దేశంలోని విపక్షాలు సైతం ఎయిర్‌స్ట్రైక్‌పై అనుమానాలను తెరపైకి తెస్తున్నాయి. అసలు ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. దాంతో విపక్షాల వైఖరిపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. సాయుధ బలగాల నైతిక స్థైర్యం దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఐతే వైమానిక దాడులకు ముందు జైషేమహ్మద్ ఉగ్రవాద శిబిరంలో 300 సెల్‌ఫోన్లు యాక్టివ్‌గా ఉన్నట్లు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. దాన్ని బట్టి ఎయిర్‌ఫోర్స్ దాడుల్లో 300 మంది చనిపోయి ఉంటారని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులు స్పష్టంచేశారు. ఈ గందరగోళం నేపథ్యంలో బాలాకోట్‌లో అసలేం జరిగిందో తెలుసుకోవాలని అంతర్జాతీయ మీడియా ఆసక్తి చూపుతోంది. బాలాకోట్‌లోని జాబా గ్రామంలోని కొండప్రాంతంలో ఉన్న ఉగ్రవాద శిబిరానికి వెళ్లేందుకు ప్రయత్నించాయి. కానీ పాకిస్తాన్ ఆర్మీ మాత్రం అనుమతించడం లేదు.

బాలాకోట్‌లో వైమానికదాడులు జరిగిన రోజే..పాకిస్తాన్ విదేశాంగమంత్రి మీడియాతో మాట్లాడారు. ఘటనా స్థలంలో రెండుమూడు చెట్లు మాత్రమే కూలాయని..కావాలంటే అంతర్జాతీయ మీడియాను తీసుకెళ్లి చూపిస్తామని ప్రకటించారు. కానీ వాతావరణం అనుకూలించడం లేదన్న సాకుతో అక్కడికి తీసుకెళ్లలేదు. మూడు రోజులుగా వాతావరణం అనుకూలిస్తున్నా...అనుమతి నిరాకరిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా అక్కడికి మీడియాను అనుమతించమని స్పష్టంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాలను తప్పించే ప్రయత్నం చేస్తున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

మరోవైపు జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరానికి సంబంధించి శాటిలైట్ చిత్రాలు పలు అంతర్జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రైవేట్ శాటిలైట్ ఆపరేటర్ 'ప్లానెట్ ల్యాబ్స్' సంస్థ (అమెరికా) ఇటీవల ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది. భారత వైమానికదాడులకు ముందు, ఆ తర్వాత హెచ్‌డీ ఫొటోలను వెల్లడించింది. ఐతే ఆ ఉపగ్రహ చిత్రాలను బట్టిచూస్తే అక్కడ ఎలాంటి నష్టం వాటిల్లలేదని రాయిటర్స్ వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ టార్గెట్ గురితప్పి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తంచేసింది. ఆ కథనాలను బీజేపీ వర్గాలు ఖండించాయి.

అటు బాలాకోట్‌లోని స్థానికులు మాత్రం అక్కడ గతంలో జైషే మహ్మద్ ఆధ్వర్యంలో మదర్సా నడిచేదని వెల్లడించారు. కొన్ని రోజులుగా కార్యకలాపాలను నిలిపివేశారని స్పష్టంచేశారు. ఐతే అసలు అక్కడ ఏం జరిగిందనేది తెలియాలంటే..కొండపైకి వెళ్లాలి. ఆధారాలు బయటకురావాలి. మీడియా ఆ ప్రయత్నం చేసినప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ మాత్రం పదే పదే అడ్డుపుతున్నాయి.
First published: March 8, 2019, 3:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading