NIRAV MODI OFFERED ONE MILLION POUND DEPOSIT AND WEAR ELECTRONIC TAG FOR BAIL NK
బెయిల్ కావాలంటే మెడకు ఎలక్ట్రానిక్ ట్యాగ్ వేసుకోవాలి... నీరవ్ మోదీకి లండన్ కోర్టు కండీషన్
నీరవ్ మోదీ
Nirav Modi Case : రెండోసారి బెయిల్ తిరస్కరించిన లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు... బెయిల్ కావాలంటే ఇలా చెయ్యాలంటూ... నీరవ్ మోదీకి షాకిచ్చే కండీషన్లు పెట్టింది.
మార్చి 19న లండన్‌లో అరెస్టైన నీరవ్ మోదీ... తప్పించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాల్నీ వెతుక్కుంటున్నాడు. 10 లక్షల పౌండ్లు ( రూ.9,05,77,605) సెక్యూరిటీ డిపాజిట్ చేస్తాననీ, తనకు బెయిల్ ఇవ్వాలనీ తన లాయర్ల ద్వారా వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో రెండోసారి కోరాడు. ఈ ఆఫర్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. బెయిల్ కావాలంటే... కఠినమైన షరతుల్ని పాటించాలని తెలిపింది. ఓ ఎలక్ట్రానిక్ ట్యాగ్‌ను మెడ చుట్టూ ధరించాలనీ... అది నిరంతరం GPS టెక్నాలజీతో పనిచేస్తూ... పోలీసులు ట్రాక్ చేసేలా ఉండాలని కండీషన్ పెట్టింది. అలాగే... ఏ టైంలోనైనా ఫుల్లుగా ఛార్జింగ్ అయి ఉన్న మొబైల్‌ను నిరంతరం వెంట తీసుకెళ్లాలని మరో కండీషన్ పెట్టింది. అంతేకాదు... నీరవ్ మోదీ దగ్గరున్న అన్ని వీసాలూ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
కేసును ఏప్రిల్ 26కు వాయిదా వేసిన చీఫ్ జడ్జి ఎమ్మా అర్బత్నాట్... అప్పటివరకూ బెయిల్ ఇవ్వవద్దని ఆదేశించారు. నీరవ్ మోదీ దగ్గర ఓ కుక్క ఉందన్న ఆయన తరపు లాయర్... క్లేర్ మాంట్గోమెరీ... బ్రిటన్‌లో పౌరులకు బెయిల్ ఇచ్చినట్లే... ఆయనకూ బెయిల్ ఇచ్చేందుకు వీలవుతుందని వీలవుతుందని వాదించారు. నీరవ్ మోదీకి అండర్ వరల్డ్‌తో ఏ లింకులూ లేవనీ, ఏ క్రిమినల్ కేసులూ ఆయనపై బ్రిటన్‌లో లేవని వాదించారు.
క్లేర్ వాదనను కొట్టిపారేసిన... జడ్జి ఎమ్మా... భారత్‌తో బ్రిటన్‌కు ఉన్న సంబంధాల రీత్యా... భారత్‌లో నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 13 వేల కోట్లు మోసం చేసిన ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో... మిగతా వారికి ఇచ్చినట్లు బెయిల్ ఇవ్వలేమని తెలిపారు.
ఒకవేళ విజయ్ మాల్యాను, నీరవ్ మోదీని ఇద్దరినీ భారత్‌కు అప్పగిస్తే ఎక్కడ ఉంచుతారు అని ప్రశ్నించిన ఎమ్మాకు... భారత ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ న్యాయవాది స్పందిస్తూ.. విజయ్ మాల్యా కోసం సిద్ధం చేసిన ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో నీరవ్‌ను ఉంచవచ్చంటే ఉంచుతామన్నారు. దీంతో వెంటనే జడ్జి స్పందిస్తూ.. ఒకే గదిలో కూడా ఉంచొచ్చు. మీరు ఇచ్చిన వీడియోలో ఉన్న గదిలో స్థలం కూడా ఎక్కువగానే ఉంది అన్నా్రు. విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించే కేసును కూడా జడ్జి ఎమ్మానే విచారిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.