NIGERIA EXPLOSION MORE THAN 100 PEOPLE KILLED IN BLAST AT ILLEGAL OIL REFINERY SK
Nigeria Blast: ఆయిల్ రిఫైనరీలో భారీ పేలుడు.. 100 మందికిపైగా మృతి.. చెట్ల కొమ్మలకు వేలాడిన శవాలు
(ప్రతీకాత్మక చిత్రం)
Nigeria Blast: నైజీరియాలో ఈ తరహా అక్రమ చమురు శుద్ధి కర్మాగారాలు చాలానే ఉన్నాయి. పైప్‌లైన్స్‌ని ధ్వంసం చేసి ముడి చమురు దొంగిలించి.. అక్రమ రిఫైనరీల్లో శుద్ధి చేస్తుంటారు. అనంతరం బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తుంటారు
ఆఫ్రికా దేశం నైజీరియాలో ఘోర ప్రమాదం (Nigeria Explosion) జరిగింది. చమురు శుద్ధి కార్మాగారంలో (Oil Refinery Blast) భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో వంద మందికి పైగా మరణించారు. ఎంత మంది మరణించారన్న దానిపై స్పష్టత లేదని స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. భారీగా ప్రాణ నష్టం జరిగిందని.. మృతదేహాలు గుర్తు పట్టలేనంతంగా కాలిపోయాయని వెల్లడించాయి. రివర్స్, ఇమో స్టేట్ మధ్య శుక్రవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. సిబ్బంది అంతా తమ తమ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అక్కడికక్కడే చాలా మంది మరణించారు. కొందరు ప్రాణ భయంలో బయటకు పరుగులు చేశారు. చెట్లు ఎక్కి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. చెట్ల కొమ్మలకు శవాలు వేలాడుతూ కనించాయని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.
ఘటనా స్థలంలో దృశ్యాలు హృదయ విదారకరంగా ఉన్నాయని వెల్లడించాయి. పలువురు మంటల్లో కాలిపోయి బూడిదయ్యారని.. అందువల్ల ఎంత మంది మరణించారన్న దానిపై ఖచ్చితమైన లెక్కలు లేవు. నైజీరియాలో ఈ తరహా అక్రమ చమురు శుద్ధి కర్మాగారాలు చాలానే ఉన్నాయి. పైప్‌లైన్స్‌ని ధ్వంసం చేసి ముడి చమురు దొంగిలించి.. అక్రమ రిఫైనరీల్లో శుద్ధి చేస్తుంటారు. అనంతరం బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. అక్రమ చమురు శుద్ధి కర్మాగారాల్లో సరైన భద్రత ఉండదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు. అందువల్లే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. అంతేకాదు పైప్ లైన్స్ నుంచి మంటలు చెలరేగిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. మెయింటెన్స్ లేకపోవడం, దొంగతనాలు జరగడం వల్ల అక్కడ తరచూ ఇలాంటి పేలుళ్లు జరుగుతాయి.
ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా చమురును ఉత్పత్తి చేసే దేశం నైజీరియా. అక్కడ ప్రతి రోజూ 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఉత్పత్తి అవుతుంది. ఐనప్పటికీ నైజర్ డెల్టా ప్రాంతంలో చాలా మంది ప్రజలు ఇక్కడ పేదరికంలో మగ్గుతున్నారు. ఈ క్రమంలోనే ముడి చమురును దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. పైప్‌లైన్లను ధ్వంసం చేసి.. ముడి చమురును ఎత్తుకెళ్లి..అమ్ముకుంటారు. దొంగలు ఆయిల్ పైప్‌లైన్‌ను పగులగొట్టకుండా చాలా ప్రాంతాల్లో ఆర్మీని మోహరించారు. అలాగే అక్రమ ఆయిల్ రిఫైనరీలపై ప్రభుత్వం తరచూ దాడులు చేస్తుంటుంది. ఐనప్పటికీ చాలా చోట్ల ఇంకా అక్రమ రిఫైనరీలు నడుస్తూనే ఉన్నాయి. వాటిలో పేలుళ్లు జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.