ప్రపంచంలో ప్రజల ఆచార వ్యవహారాలు(Ritual affairs) ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటాయి. అయితే కొన్ని ఆచారాల గురించి తెలుసుకుంటే నివ్వెరపోవాల్సిందే. ఎందుకంటే అవి చాలా వింతగా విడ్డూరంగా అనిపిస్తాయి. ఫ్రాన్స్‌లో (France) కూడా ఒక వింత ఆచారం ఉంది. ఇక్కడి ప్రజలు నూతన సంవత్సరం సందర్భంగా (New year celebrations) కార్లను దహనం (Cars on fire) చేయడం సంప్రదాయంగా వస్తోంది. దశాబ్దాల నాటి ఈ సంప్రదాయంలో భాగంగా ఈ కొత్త సంవత్సరం వేళ ఫ్రాన్స్ అంతటా ఏకంగా 874 కార్లకు నిప్పు పెట్టారు. అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి ఆకతాయిలు తక్కువ కార్లను తగలబెట్టారని అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి గెరాల్డ్ డార్మానిన్ చెప్పడం విశేషం. గతేడాది ఫ్రాన్స్‌లో కరోనావైరస్ రీత్యా లాక్‌డౌన్(Lockdown) విధించారు. దీంతో ఎన్ని కార్లు దహనం చేశారో కచ్చితమైన డేటా లభించలేదు. ఏదేమైనా దాదాపు 900 కార్లను ఒకేరోజు కాల్చేయడంతో ఈ విషయం తెలిసి మిగతా దేశస్తులు నివ్వెరపోతున్నారు.
తొలిసారిగా 2005లో అనేక నగరాల్లో జరిగిన అల్లర్ల కారణంగా అక్కడ యువత పెద్ద ఎత్తున కార్లను దహనం చేశారు. అప్పటి నుంచి ఇది ఒక న్యూ ఇయర్ ట్రెడిషన్ గా కొనసాగుతోంది. ఇది ఇప్పటికీ ఒక సంప్రదాయంగా కొనసాగడానికి చాలా కారణాలు ఉన్నాయి. నేరపూరితమైన చర్యలను కప్పిపుచ్చడానికి లేదా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఇలా కార్లను తగలబెట్టేవారు. ఆ విధంగా ఈ పని ఒక ఆచారంగా మారిపోయింది. ఐతే కరోనావైరస్ సంబంధిత ఆంక్షలు అమలులో ఉన్నందున, గత ఏడాదితో పాటు ఈ ఏడాది కూడా కార్ల సంఖ్య మునుపటి సంవత్సరాల కంటే తక్కువగా ఉందని అంతర్గత మంత్రి తెలిపారు.
2019లో మొత్తం 1,316 కార్లకు నిప్పుపెట్టినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. అత్యధికంగా 2005లో 9,000 కార్లను దహనం చేశారు స్థానికులు. ఈసారి కార్ల సంఖ్య తగ్గినప్పటికీ మునుపటి సంవత్సరాల కంటే ఎక్కువ మందిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. 2019లో 376 మందిని విచారణ కోసం అరెస్టు చేస్తే.. ఈ ఏడాది 441 మందిని పట్టుకుని విచారిస్తున్నారు.
ఈశాన్య ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో కార్లు, చెత్తబుట్టలకు నిప్పు పెట్టిన తర్వాత 31 మందిని విచారణ కోసం తీసుకెళ్లారు. ప్రశ్నించిన వారిలో ఆరుగురు కర్ఫ్యూను ఉల్లంఘించిన మైనర్లు కాగా మిగిలిన వారు నిప్పంటించిన అనుమానితులుగా ఉన్నారని అక్కడ అధికారులు వెల్లడించారు. స్ట్రాస్‌బర్గ్‌లోని అధికారుల ప్రకారం, కొత్త సంవత్సరం సందర్భంగా జరిగిన కార్ల దహనం వల్ల నలుగురు పోలీసు అధికారులకు స్వల్ప గాయాలు అయ్యాయట.
కరోనావైరస్ ఆంక్షలు ఉన్నప్పటికీ, సెంట్రల్ ఫ్రాన్స్‌లోని యోన్నే డిపార్ట్‌మెంట్‌లో శనివారం మధ్యాహ్నం నాటికి 1,500 మంది వ్యక్తులతో అక్రమ పార్టీ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. పరిస్థితిని నియంత్రించడానికి సైట్‌లోని పోలీసు బలగాలు ప్రయత్నిస్తున్నాయని అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇతర దేశాల వ్యక్తులకు ఇది విడ్డూరంగా అనిపించినా ఫ్రాన్స్‌లో నూతన సంవత్సరం సందర్భంగా ఓవైపు కార్ల దహనం మరోవైపు ఇల్లీగల్ గా పార్టీలు నిర్వహించడం సర్వసాధారణమే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.