గవర్నర్‌గా ముత్తయ్య కొత్త ఇన్నింగ్స్..? శ్రీలంక తమిళుల నుంచి వ్యతిరేకత..

గొటబయ సన్నిహిత వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. మురళీధరన్‌కు తగిన రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. అయితే నార్తర్న్ ప్రావిన్స్‌కు ఆయన్ను గవర్నర్‌గా నియమిస్తారా? లేక మరో పదవి ఇస్తారా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

news18-telugu
Updated: November 27, 2019, 6:34 PM IST
గవర్నర్‌గా ముత్తయ్య కొత్త ఇన్నింగ్స్..? శ్రీలంక తమిళుల నుంచి వ్యతిరేకత..
ముత్తయ్య మురళీధరన్(File Photo)
  • Share this:
(DP Satish,South Head,News18)

శ్రీలంక క్రికెట్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ మరోసారి వార్తల్లో నిలిచారు. 'దూస్రా' మాస్టర్‌గా, 1996లో శ్రీలంక ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన జట్టు సభ్యుడైన ముత్తయ్య.. తాజాగా నార్తర్న్ ప్రావిన్స్‌కి గవర్నర్‌గా నియమితమవబోతున్నాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమిళ ఆధిపత్యం ఎక్కువగా ఉండే నార్తర్న్ ప్రావిన్స్‌కు ముత్తయ్యను గవర్నర్‌గా నియమించబోతున్నారన్న ప్రచారంపై అక్కడి ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారతీయ సంతతికి చెందిన,శ్రీలంక తమిళుడైన ముత్తయ్య మురళీధరన్ తాజా అధ్యక్ష ఎన్నికల్లో గొటబాయ రాజపక్సేకు బహిరంగంగా మద్దతు పలికారు. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన గొటబయ రాజపక్సేతో మురళీ చేతులు కలబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే శ్రీలంక తమిళులు అత్యధికంగా ఉండే నార్తర్న్ ప్రావిన్స్‌కు ఆయన్ను గవర్నర్‌గా నియమించబోతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మురళీని గవర్నర్‌గా నియమించడంపై ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. నార్తర్న్ ప్రావిన్స్ తమిళులు ఇప్పటికే ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. శ్రీలంక అంతర్యుద్దం సమయంలో తమిళులపై జరిగిన ఊచకోత పట్ల మురళీధరన్ అనుసరించిన తీరు వారి ఆగ్రహానికి గురైంది. 2005,2015లో మహీంద్ర రాజపక్సే అధ్యక్ష హయాంలో గొటబయ రక్షణ కార్యదర్శిగా ఉన్న కాలంలోనే తమిళులపై ఊచకోత జరిగింది. శ్రీలంక మొత్తం జనాభాలో 12శాతం ఉండే శ్రీలంక తమిళులు,భారతీయ తమిళులు ఇప్పుడు మురళిపై ఆగ్రహంతో ఉన్నారు.స్థానికులైన శ్రీలంక తమిళులు నార్త్&ఈస్ట్ శ్రీలంకలో నివసిస్తుంటారు. బ్రిటీష్ కాలంలో అక్కడి టీ ఎస్టేట్స్‌లో పనిచేయడానికి వలస వెళ్లినవారు భారతీయ తమిళులు. అలాంటి కుటుంబానికి చెందినవాడే మురళీధర్. అతను తమిళ భారతీయుడు. యుద్ద నేరాలపై మురళీ అనుసరించిన తీరు తమిళుల్లో ఆగ్రహం గూడు కట్టుకునేలా చేసింది. అసలు యుద్ద నేరాలే జరగలేదన్నట్టుగా ఆయన వ్యవహరించారన్నది వారి ఆగ్రహానికి కారణం.

అసలు యుద్ద నేరాలే జరగలేదు.. ఎలాంటి మారణహోమం చోటు చేసుకోలేదనేది మురళీధరన్ దృక్పథం. ఒక తమిళుడై ఉండి అతనెలా ఇలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటాడు? ఆయన వ్యవహార శైలితో తీవ్రంగా బాధపడ్డాం. రాజపక్సేతో సత్సంబంధాల కోసమే మురళీ అలా చేశాడు. ఇది సహించలేనిది.
శ్రీలంక తమిళ జర్నలిస్టు
పాత గాయాలకు ఇదో అవమానం అలాంటిది. గొటబయ రక్షణ కార్యదర్శిగా ఉన్న కాలంలో తమిళులు తీవ్రంగా నష్టపోయారు.అందుకే 80శాతానికి పైగా తమిళులు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. వాళ్లందరికీ మురళీ అంటే వ్యతిరేకత.
శ్రీలంక తమిళుడు(పేరు చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు.)


గొటబయ సన్నిహిత వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. మురళీధరన్‌కు తగిన రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. అయితే నార్తర్న్ ప్రావిన్స్‌కు ఆయన్ను గవర్నర్‌గా నియమిస్తారా? లేక మరో పదవి ఇస్తారా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవిధంగా ప్రభుత్వమే లీకులు ఇచ్చి.. ప్రజల్లో మురళీధరన్ పట్ల ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకుంటోందని తమిళ నేషనల్ అలియెన్స్‌కు చెందిన ఓ నాయకుడు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద మురళీ 'దూస్రా' ఈసారి అంతగా కలిసిరాలేదనే వాదన వినిపిస్తోంది.
ఇది కూడా చదవండి : శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు : రాజపక్సే Vs సాజిత్, గెలుపెవరిది..?
First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు