గడిచిన రెండేళ్లుగా మానవాళిని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్ ఎప్పటికప్పుడు మ్యూటేషన్ చెందుతూ సరికొత్త రూపాల్లో విరుచుకుపడుతున్నది. సెకండ్ వేవ్ లో డెల్టా వేరియంట్ లక్షల మందిని బలితీసుకోగా, మూడో వేవ్ లో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్నది. ఈ రెండిటినీ ప్రమాదకర వేరియంట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. అయితే, ఇప్పుడు మరింత ఆదోళన కలిగించే రీతిలో డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు కలిసున్న కొత్త వేరియంట్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. యూరప్ దేశమైన సైప్రస్‌లోని సైంటిస్టులు గుర్తించిన ఈ వేరియంట్ ఇప్పటికే 25 మందికి వ్యాపించినట్లు నిర్ధారణ అయింది. ల్యాబ్ లో పొరపాటు వల్లే ఇలా జరిగిందనే ఆరోపణలను సైప్రస్ సైంటిస్టులు ఖండిచారు. నిజంగానే తాము కొత్త వేరియంట్ గుర్తించామన్నారు. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ధృవీకరించాల్సి ఉంది. డెల్టాక్రాన్ వివరాలివి..
ప్రమాదకర డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్లు కలిసున్న సరికొత్త కరోనా వేరియంట్ 'డెల్టాక్రాన్' సైప్రస్‌లో బయటపడింది. డెల్టా+ఒమిక్రాన్= డెల్టాక్రాన్ అనే అర్థంలో దీనికి పేరు పెట్టారు. కొందరు దీనిని 'డెల్మైక్రోన్' అని కూడా పిలుస్తున్నారు. కొత్తగా గుర్తించిన డెల్టాక్రాన్.. పాత వేరియంట్ల కంటే ప్రమాదకరమా? కాదా? అనే విషయం నిర్ధారణ కావాల్సి ఉంది. సైప్రస్ లోనే టాప్ వర్సిటీగా పేరుపొందిన సైప్రస్ యూనివర్సిటీలోని బయాలజికల్ సైన్సెస్, లెబోరేటరీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మాలిక్యులర్ వైరాలజీ విభాగం శాస్త్రవేత్తలు తొలిసారి డెల్టాక్రాన్ ను గుర్తించారు.
సైప్రస్ యూనివర్సిటీకి చెందిన బయాలజికల్ సైన్సెస్ ప్రొఫెసర్, లెబోరేటరీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మాలిక్యులర్ వైరాలజీ అధిపతి లియోండియోస్ కోస్ట్రికిస్.. డెల్టాక్రాన్ కు సంబంధించిన విషయాలను వెల్లడించారు. డెల్టా, ఒమిక్రాన్ రెండింటి కాంబినేషన్ ఉన్నకొత్త స్ట్రెయిన్‌ను కనుగొన్నామని, ఇది డెల్టాకు సమానమైన జన్యు నేపథ్యాన్ని కలిగి ఉందని, అలాగే కొన్ని ఒమిక్రాన్ మ్యుటేషన్లూ దీనిలో ఉన్నాయని ఆయన తెలిపారు.
సైప్రస్‌లో ఇప్పటివరకు డెల్టాక్రాన్ రకం కేసులు 25 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరిన రోగుల్లో ఈ స్ట్రెయిన్ మ్యుటేషన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉందని కోస్ట్రికిస్ బృందం అధ్యయనంలో వెల్లడైంది. దీంతో ఈ కేసుల నమూనాలను.. వైరస్ మార్పులను ట్రాక్ చేసే అంతర్జాతీయ డేటాబేస్ 'జీఐఎస్ఏఐడీ'కి పంపారు. కాగా,
డెల్టా, ఒమిక్రాన్‌తో పోలిస్తే ఇది మరింత ప్రమాదకరమా? వ్యాప్తి వేగం తదితర వివరాలు తెలియాల్సి ఉందని సైప్రస్ సైంటిస్టులు చెబుతున్నారు. అధిక వ్యాప్తి కలిగిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే దీన్ని అధిగమించినట్లు భావిస్తున్నామన్నారు. కాగా, కొత్త స్ట్రెయిన్‌తో ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సైప్రస్ ఆరోగ్యశాఖ మంత్రి మిచాలిస్ హడ్జిపాండేలాస్ అన్నారు. కాగా, డెట్లాక్రాన్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో, ఇది ల్యాబ్ లో పొరపాటు వల్ల జరిగింది కాదని, నిజంగానే తాము కొత్త వేరియంట్ గుర్తించామని సైప్రస్ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మాత్రం ఇప్పటిదాకా డెల్టాక్రాన్ రకంపై స్పందించాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid, Delta Variant, Omicron corona variant