నేపాల్ (Nepal)లో మరో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పొఖారా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఆదివారం ఉదయం ప్యాసింజర్ విమానం కుప్పకూలిపోయింది. ఖాట్మండు నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయలుదేరిన విమానం నది ఒడ్డున కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనలో దాదాపు 69 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు ఐదేళ్లలో నేపాల్‌లో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంగా పేర్కొంటున్నారు.
* ఐదుగురు భారతీయులు
సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ నేపాల్ (CAAN) ప్రకారం.. యతి ఎయిర్‌లైన్స్(Yeti Airlines) 9N-ANC ATR-72 విమానం ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం 10:33 గంటలకు బయలుదేరింది. పొఖారా విమానాశ్రయంలో దిగుతుండగా పాత విమానాశ్రయం, కొత్త విమానాశ్రయం మధ్య ఉన్న సేతీ నది ఒడ్డున విమానం కూలిపోయింది.
విమానంలో 10 మంది విదేశీయులు, నలుగురు సిబ్బంది సహా మొత్తం 68 మంది ప్రయాణికులు ఉన్నారని రిపబ్లికా వార్తాపత్రిక తెలిపింది. విమానంలో ఉన్న మొత్తం 15 మంది విదేశీయుల్లో ఐదుగురు భారతీయులు ఉన్నారని తెలిపింది. ఇతర విదేశీయులలో నలుగురు రష్యన్లు, ఇద్దరు కొరియన్లు, ఒక ఆస్ట్రేలియన్, ఒక ఐరిష్, ఒక అర్జెంటీనా, ఒక ఫ్రెంచ్ వ్యక్తి ఉన్నారు.
* కాక్‌పిట్ నుంచి డిస్ట్రెస్ కాల్ రాలేదు
ఎయిర్‌లైన్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా బ్లూమ్‌బెర్గ్‌తో మాట్లాడుతూ.. విమానం ల్యాండింగ్‌కు 10 నుంచి 20 సెకన్ల ముందు క్రాష్ అయిందన్నారు. విపత్తుకు ముందు కాక్‌పిట్ నుంచి ఎటువంటి డిస్ట్రెస్ కాల్ రాలేదని చెప్పారు. నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ జ్ఞానేంద్ర భుల్ మాట్లాడుతూ.. వాతావరణం సమస్య లేదని, సాంకేతిక కారణాల వల్లే విమానం కూలిపోయిందని ప్రాథమిక సమాచారం అందిందని తెలిపారు. విమానం గాలిలో ఉండగానే మంటలు కనిపించాయని సమాచారం అందిందని చెప్పారు. విమానం 10 సెకన్లలో రన్‌వేకి చేరుకునేదని, మార్గమధ్యలో ప్రమాదానికి గురైందని విమానాశ్రయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ మై రిపబ్లికా వార్తాపత్రికతో చెప్పారు.
* నేపాల్ విచారణ కమిషన్ ఏర్పాటు
నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ.. మంత్రి మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సమర్థవంతమైన రెస్క్యూ కార్యకలాపాలను నిర్వహించాలని భద్రతా సిబ్బందిని, అన్ని ప్రభుత్వ సంస్థలను ఆదేశించారు. విమాన ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు నేపాల్ ప్రభుత్వం ఐదుగురు సభ్యుల విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
ఇది కూడా చదవండి : నిప్పు లాంటి నిజాలు .. ఆశ్చర్యపరిచే అంశాలు
* ప్రమాదానికి గురైంది ఏ ఎయిర్‌క్రాఫ్ట్?
ప్రమాదంలో చిక్కుకున్న యతి ఎయిర్‌లైన్స్ విమానం ట్విన్-ఇంజిన్ ATR 72 విమానం. వివిధ నివేదికల ప్రకారం.. ఈ విమానం ఓల్డ్ ట్రాన్స్‌పాండర్ అమర్చిన 15 సంవత్సరాల నాటిది. ఎయిర్‌బస్, ఇటలీకి చెందిన లియోనార్డో కంపెనీలు జాయింట్ వెంచర్ ద్వారా తయారు దీన్ని తయారు చేశాయి. ATR 72 అనేది విస్తృతంగా ఉపయోగించే ట్విన్-ఇంజిన్ టర్బోప్రాప్ విమానం.
యతి ఎయిర్‌లైల్స్‌లో ఇలాంటి ఆరు విమానాలు ఉన్నాయి. హిందుస్థాన్ టైమ్స్ తెలిపిన వివరాల మేరకు.. యతి ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 9N-ANC ATR-72 ఆదివారం ఉదయం మూడో ప్రయాణంలో ప్రమాదానికి గురైంది. అంతకుముందు ఇది మొదట ఖాట్మండు నుంచి పొఖారాకు, తిరిగి ఖాట్మండుకు తెల్లవారుజామున ప్రయాణించింది.
* విమానం ఎలా కూలిపోయింది?
ఖాట్మండు నుంచి ఉదయం 10:33 గంటలకు విమానం బయలుదేరింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో పొఖారా విమానాశ్రయంలో దిగుతుండగా పాత విమానాశ్రయం, కొత్త విమానాశ్రయం మధ్య ఉన్న సేతీ నది ఒడ్డున విమానం కూలిపోయింది. యతి ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదం తర్వాత.. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్ విమానాల రాకపోకలను నిలిపివేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: International news, Nepal, Plane Crash