NEPAL BUSS ACCIDENT 32 KILLED SEVERAL INJURED AFTER BUS FALLEN INTO RIVER FORM HILL AREA IN NEPAL SK
Nepal Bus Accident: కొండపై నుంచి నదిలో పడిన బస్సు.. పండక్కి ఊరెళ్తూ 32 మంది మృతి
గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యాలు
Nepal Road accident: బస్సు ఛాయానాథ్ రారా పట్టణాన్ని దాటగానే, అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. దాదాపు 300 అడుగుల లోతుకు వెళ్లి దిగవన ఉన్న పినా ఝ్యారీ నదిలో పడిపోయింది.
నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Nepal road accident) జరిగింది. ఓ కొండ ప్రాంతం నుంచి అదుపుతప్పి లోయలో పడిన బస్సు.. అనంతరం నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనో 32 మంది ప్రయాణికులు మరణించారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఛాయానాథ్ రారా మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. విజయదశమి పండగ కోసం వలస కార్మికులు, విద్యార్థులు నేపాల్ గంజ్ నుంచి ముగు జిల్లా గామ్‌గధికి బయలుదేరారు. బస్సు ఛాయానాథ్ రారా పట్టణాన్ని దాటగానే, అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. దాదాపు 300 అడుగుల లోతుకు వెళ్లి దిగవన ఉన్న పినా ఝ్యారీ నదిలో పడిపోయింది. అంత ఎత్తు నుంచి పడిపోవడంతో బస్సు తునాతునకలయింది. ప్రయాణికుల్లో చాలా మంది స్పాట్‌లోనే మరణించారు.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని హెలికాప్టర్లతో ఎయిర్ లిఫ్ట్ చేసి ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 32 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఐతే బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారన్న దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో మరికొందరు కూడా మరణించి ఉండొచ్చన్న అనుమానంతో ఘటనా స్థలంలో సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు అధికారులు.
నేపాల్‌లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో రోడ్ కనెక్టివిటీ సరిగా ఉండదు. చాలా చోట్ల రోడ్లు రాళ్లురప్పలతో నిండి ఉంటాయి. గుంతలు ఎక్కువగా కనిపిస్తాయి. కొండలపై మలుపుల వద్ద అదుపు తప్పి .. వాహనాలను లోయల్లో పడిపోతూ ఉంటాయి. అంతేకాదు ఫిట్‌నెస్ లేని వాహనాలు కూడా ఎక్కువగా తిరుగుతాయి. ఈ కారణాల వల్లే నేపాల్‌లో రోడ్డు ప్రమాదాలు జరిగి.. ఏటా వేలాది ప్రజలు మరణిస్తున్నారు. ప్రభుత్వం లెక్కల ప్రకారం.. 2019లో నేపాల్ వ్యాప్తంగా 13వేల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆ ప్రమాదాల్లో 2,500 మంది ప్రాణాలు కోల్పోయారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.