పాక్‌లో టెన్షన్..టెన్షన్..! నవాజ్ అరెస్ట్‌కు రంగం సిద్ధం

సాయంత్ర 06.15 గంటలకు నవాజ్, ఆయన కూతురు లాహోర్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో ఛైర్మన్ జావెద్ ఇక్బాల్ ఆదేశాల మేరకు ఎయిర్‌పోర్టులోనే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. అక్కడి నుంచి వారిని ప్రత్యేక హెలికాప్టర్‌లో పాక్ రాజధాని ఇస్లామాబాద్ తరలిస్తారని సమాచారం

news18-telugu
Updated: July 13, 2018, 12:09 PM IST
పాక్‌లో టెన్షన్..టెన్షన్..! నవాజ్ అరెస్ట్‌కు రంగం సిద్ధం
అబుదాబి ఎయిర్‌పోర్టులో నవాజ్, ఆయన కూతురు మర్యమ్
  • Share this:
మరో 12 రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ..పాకిస్తాన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.  ఎలక్షన్స్‌కు బదులు మాజీ ప్రధాని నవాజ్ వ్యవహారమే ఇప్పుడు సంచలనంగా మారింది. అవినీతి కేసులో దోషిగా తేలిన నవాజ్, ఆయన కూతురు మర్యమ్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. కోర్టు శిక్ష విధించిన వారం రోజుల తర్వాత  లండన్ నుంచి ఇవాళ సాయంత్రం తండ్రీకూతుళ్లకు లాహోర్‌కు చేరుకోనున్నారు.  ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టగానే వారిని అరెస్ట్ చేసేందుకు అన్నిఏర్పాట్లు చేశారు పోలీసులు.

మరోవైపు నవాజ్ షరీఫ్‌కు మద్దతుగా లాహోర్‌ భారీ ర్యాలీ చేపట్టేందుకు 'పాకిస్తాన్ ముస్లిం లీగ్ -నవాజ్' (PML-N) పార్టీ సిద్ధమైంది. ఈ క్రమంలో అల్లర్లు చెలరేగే అవకాశమున్నందున భద్రతా దళాలు పెద్ద ఎత్తున రంగంలోకి దిగాయి. లాహోర్ నగరాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఎయిర్‌పోర్టుకు నిరసనకారులు వెళ్లకుండా.. అన్ని దారుల్లో భారీ షిప్పింగ్ కంటైనర్లు అడ్డుపెట్టి రోడ్లను బ్లాక్ చేస్తున్నారు. 10వేల మంది పోలీసులను మోహరించి అధికారులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

సాయంత్ర 06.15 గంటలకు  నవాజ్, ఆయన కూతురు లాహోర్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో ఛైర్మన్ జావెద్ ఇక్బాల్ ఆదేశాల మేరకు ఎయిర్‌పోర్టులోనే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. అక్కడి నుంచి వారిని ప్రత్యేక హెలికాప్టర్‌లో పాక్ రాజధాని ఇస్లామాబాద్ తరలిస్తారని సమాచారం. ఆ క్రమంలో అల్లర్లు జరగకుండా  ముందస్తుగా వందలాది మంది PML-N కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.


లండన్‌లో నవాజ్ భార్య కుల్సుంకు క్యాన్సర్ చికిత్స జరుగుతోంది. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు. అదే సమయంలో పనామా పేపర్ల కేసుతో పాటు లండన్‌లో అక్రమాస్తుల కేసులో ఆయనతో పాటు కూతురు మర్యమ్‌ను యాంటీ కరప్షన్ కోర్టు దోషులుగా తేల్చింది. బ్రిటన్‌లో అత్యంతక ఖరీదైన అపార్ట్‌మెంట్లు ఎలా వచ్చాయనే ప్రశ్నకు నవాజ్ షరీఫ్ వివరణ ఇవ్వకపోవడంతో జైలు శిక్ష విధించింది. నవాజ్‌కు పదేళ్లు, ఆయన కూతురు మర్యమ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది.నవాజ్ అరెస్ట్ నేపథ్యంలో నేతల రెచ్చగొట్టే ప్రసంగాలను ప్రసారం చేయకూడదని  మీడియాను పాకిస్తాన్ మీడియా రెగ్యులేటర్ ఆదేశించింది. మరోవైపు మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ)కి పాకిస్తాన్ ఆర్మీ , ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) సహకరిస్తున్నాయని.. ఆ క్రమంలోనే తనకు వ్యతిరేకంగా కుట్ర చేశారని నవాజ్ ఆరోపిస్తున్నారు. ఇక, ఈ ఎన్నికల్లో నవాజ్ పార్టీ చిత్తుగా ఓడడం ఖాయమని.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రిపోల్ సర్వేలు చెబుతున్నాయి.
First published: July 13, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>