Nawaz Sharif attacked : లండన్ లో ఉంటున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పై దాడి జరిగింది. ప్రస్తుతం పాక్ లోని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని అధికార పీటీఐ పార్టీకి చెందిన ఓ కార్యకర్త నవాజ్ షరీఫ్ పైదాడిచేశాడు. ఈ దాడిలో నవాజ్ షరీఫ్ బాడీగార్డు తీవ్రంగా గాయపడ్డాడని స్థానిక మీడియా తెలిపింది.నిందితుడికోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారని తెలిపింది. పాకిస్తాన్ లో ఇప్పుడు రాజకీయ అస్థిరత ఏర్పడిన నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణంపై ఇవాళ ఓటింగ్ జరుగనున్న సమయంలో లండన్‌లో ఉన్న నవాజ్ షరీఫ్‌పై ఈ దాడి జరగడం గమనార్హం. ఈ దాడికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖానే కారణమని,రెచ్చగొట్టడం మరియు దేశద్రోహం వంటి సెక్షన్ల కింద ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేయాలని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ ట్వీట్ చేశారు. కాగా, లండన్‌లో కూర్చున్న వ్యక్తి పాక్‌లో ప్రభుత్వాన్ని మార్చడానికి విదేశీ డబ్బును వాడుతున్నారంటూ నవాజ్ షరీఫ్ ను ఉద్దేశించి ఇటీవల ఇస్లామాబాద్ లో నిర్వహించిన ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు,పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఆదివారం ఓటింగ్ జరగనున్నది. 342 మంది సభ్యులున్న పాక్ లోక్‌సభలో ఇమ్రాన్‌కు 172 మంది మద్దతు అవసరం. తమకు 175 మంది మద్దతు ఉందని నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని విపక్ష కూటమి ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఏదైనా అనూహ్యం జరిగితే తప్ప ఇమ్రాన్ ఓడిపోవడం, ప్రధాని పదవి నుంచి దిగిపోవడం దాదాపు ఖాయమే. ఇమ్రాన్ నేతృత్వం వహిస్తున్న పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి మద్దతిస్తున్న రెండు పార్టీలు ఇటీవల విపక్షాల కూటమిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాక్ నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ తదుపరి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి.
ALSO READ Russia Private Jet : రష్యా వ్యాపారవేత్తకు బ్రిటన్ షాక్..టేకాఫ్ కు సిద్ధమైన విమానం నిలిపివేత
అయితే అవిశ్వాస తీర్మానంపై పోరాటాన్ని క్రికెట్ మ్యాచ్‌తో పోల్చుతూ చివరి బంతి వరకు ఆడతానని ఇమ్రాన్ ఖాన్ చెబుతున్నారు. తనను పదవి నుంచి దించడానికి అమెరికా పాలకులు ప్రయత్నిస్తున్నారని తాజాగా ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాను అధికారంలో ఉంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బ తింటాయనే ఉద్దేశంతో ఈ కుట్ర పన్నారని ఆయన అన్నారు. అయితే అమెరికా నేతలు ఇమ్రాన్ ఆరోపణలను ఖండించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Imran khan, London, Nawaz sharif, Pakistan