NASA: బృహస్పతి చంద్రుడు ‘గనిమీడ్’పై నీటి ఆవిరి ఆనవాళ్లు.. హబుల్ టెలిస్కోప్​ సాయంతో గుర్తింపు

ప్రతీకాత్మక చిత్రం

భూమి లాంటి మరో గ్రహం ఉందా? అక్కడ మనుషులకు నివాసయోగ్యమైన పరిస్థితులు ఉన్నాయా? వంటి అనేక అంశాలపై నాసా శాస్త్రవేత్తలు సుదీర్ఘకాలంగా పరిశోధన చేస్తున్నారు. ఇందులో భాగంగానే గురుగ్రహం చందమామ అయిన ‘గనిమీడ్​’ వాతావరణంలో నీటి ఆవిరి ఉనికిని గుర్తించారు.

  • Share this:
భూమి లాంటి మరో గ్రహం ఉందా? అక్కడ మనుషులకు నివాసయోగ్యమైన పరిస్థితులు ఉన్నాయా? వంటి అనేక అంశాలపై నాసా శాస్త్రవేత్తలు సుదీర్ఘకాలంగా పరిశోధన చేస్తున్నారు. ఇందులో భాగంగానే గురుగ్రహం చందమామ అయిన ‘గనిమీడ్​’ వాతావరణంలో నీటి ఆవిరి ఉనికిని గుర్తించారు. నాసా శాస్త్రవేత్తలు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) రూపొందించిన హబుల్ టెలిస్కోపు సహాయంతో తాజా డేటాను విశ్లేషించి ఈ మేరకు తేల్చారు. గనిమీడ్ ఉపరితలంపై ఉన్న మంచు ఘన రూపం నుంచి నేరుగా వాయు రూపంలోకి మారినప్పుడు నీటి ఆవిరి ఏర్పడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. స్వీడన్​లోని స్టాక్ హోమ్​కు చెందిన కెటిహెచ్​ రాయల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ పరిశోధకులు లోరెంజ్​ రోత్ నాయకత్వలో ఈ పరిశోధన చేశారు.

సౌర కుటుంబంలోని చందమామలన్నింటిలోకెల్లా గనిమీడ్​ అతి పెద్దది. దీని ఉపరితలానికి సుమారు 160 కిలోమీటర్ల కింద మహా సముద్రం ఉంటుంది. అయితే, తీవ్ర శీతల పరిస్థితుల వల్ల అక్కడి ఉపరితలం మీద ఉన్న నీరు ఘనీభవించి ఉండవచ్చని నాసా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

నాసా హబుల్ టెలిస్కోప్​ సహాయంతో..

తాజా అన్వేషణకు మూలం 1998 నాటిది. అప్పట్లో హబుల్​ టెలిస్కోపులోని ఇమేజింగ్ స్పెక్ట్రోగ్రాఫ్, కాస్మిక్​ ఆరిజిన్స్​ స్పెక్ట్రోగ్రాఫ్ సాధనాలు తీసిన పాత చిత్రాలను, ఇప్పుడు కొత్తగా తీసిన చిత్రాలను పోల్చి పరిశీలించినప్పుడు.. విద్యుదావేశంతో కూడిన కలర్​ ఆరల్​ బ్యాండ్లు కనిపించాయి. దీన్ని బట్టి అరోరాస్ లేదా ధ్రువ లైట్ల మాదిరిగానే గనిమీడ్​పై కూడా బలహీనమైన అయస్కాంత క్షేత్రం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అలాగే, రోజు మొత్తంలో ఈ చందమామ ఉపరితల ఉష్ణోగ్రతల్లో భారీగా వైరుధ్యాలు ఉన్నట్లు పరిశోధకులు గమణించారు. మధ్యాహ్న సమయంలో అక్కడి మధ్య రేఖ ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉంటోందని, ఫలితంగా ఉపరితలం మీదున్న మంచు స్వల్ప పరిమాణంలో నీటి అణువులను ఆవిరి రూపంలో విడుదల చేస్తున్నట్లు గుర్తించారు.

గనిమీడ్​ వాతావరణంలో అటామిక్​ ఆక్సిజన్​ పెద్దగా లేదని, మాలిక్యులర్​ ఆక్సిజన్​ మాత్రమే ఉన్నట్లు వారు గుర్తించారు. కాగా, వారి అధ్యయన ఫలితాలను జూలై 26 న నేచర్ ఆస్ట్రానమీ జర్నల్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టబోయే మిషన్ జ్యూస్​ జూపిటర్​ ఐసీ మూన్స్​ ఎక్స్​ఫ్లోరర్​కు ఉపయోగపడనుంది.
Published by:Krishna Adithya
First published: