అమెరికాకు ఉ.కొరియా ఝలక్...క్షిపణి ప్రయోగ కేంద్రంలో పునర్నిర్మాణ పనులు

అమెరికాకు ఉ.కొరియా ఝలక్...క్షిపణి ప్రయోగ కేంద్రంలో పునర్నిర్మాణ పనులు

వియత్నాంలో జరిగిన రెండో విడత చర్చల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్(ఫైల్ ఫోటో)

అమెరికాకు ఇచ్చిన హామీ మేరకు శాశ్వితంగా మూసివేయాల్సిన టొంగ్‌ఛాంగ్-రి క్షిపణి ప్రయోగ కేంద్రంలో ఉ.కొరియా పాక్షిక పునర్నిర్మాణ పనులు చేపట్టింది. అయితే దీనిపై వెంటనే స్పందించేందుకు అమెరికా నిరాకరిస్తోంది.

 • Share this:
  ఉత్తర కొరియా మళ్లీ అగ్రరాజ్యం అమెరికాతో కయ్యానికి కాలుదువ్వుతోంది. అమెరికాకు ఇచ్చిన హామీ మేరకు శాశ్వితంగా మూసివేయాల్సిన టొంగ్‌ఛాంగ్-రి క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని ఉ.కొరియా పాక్షికంగా పునర్నిర్మించింది. గత ఏడాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మధ్య సింగపూర్ వేదికగా జరిగిన మొదటి విడత శాంతి చర్చల్లో టోంగ్‌ఛాంగ్-రి క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని శాశ్వితంగా మూసివేయడానికి కిమ్ అంగీకరించారు. అంతర్జాతీయ నిపుణుల సమక్షంలో దీన్ని మూసివేస్తామని అప్పట్లో ట్రంప్‌కు కిమ్ మాట ఇచ్చారు. టొంగ్‌చాంగ్-రి క్షిపణి ప్రయోగ కేంద్రం 2012 నుంచి ఉత్తర కొరియా ప్రధానమైన క్షిపణి ప్రయోగం కేంద్రంగా ఉంటోంది. ఉత్తర కొరియా నుంచి అమెరికా వరకు వెళ్లగల క్షిపణుల ప్రయోగం కూడా ఇక్కడి నుంచే జరిగింది.

  ఈ నేపథ్యంలో టొంగ్‌చాంగ్-రి క్షిపణి ప్రయోగ కేంద్రంలో ఉత్తర కొరియా పునర్నిర్మాణ పనులు చేపడుతుండడం సంచలనం రేపుతోంది. దీనికి సంబంధించిన శాటిలైట్ ఫోటోలతో కూడిన ఓ రిపోర్ట్‌ను సెంటర్ ఫర్ స్ట్రాటెజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ విడుదల చేసింది. దీనికి సంబంధించి దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజన్స్ సర్వీస్(ఎన్ఐఎస్)కి కూడా సమాచారం ఉన్నట్లు ఆ దేశానికి చెందిన యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ ఓ కథనంలో వెల్లడించింది. టొంగ్‌చాంగ్-రి క్షిపణి ప్రయోగ కేంద్రం పైకప్పును పునర్నించడంతో పాటు ఆ కేంద్రం ద్వారాన్ని మార్చినట్లు తెలిపింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 2కు మధ్యలో ఈ పునర్నిర్మాణ పనులు జరిగినట్లు శాటిలైట్ ఫోటోల ఆధారంగా నిర్ధారణకు వచ్చారు.

  అణ్వాయుధ నిరాయుధీకరణ దిశగా కూడా ఇప్పటి వరకు ఉత్తర కొరియా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తమ దేశంపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తేనే ఈ దిశగా చర్యలు తీసుకుంటామని వియత్నాం వేదికగా ఫిబ్రవరి 27,28 తేదీల్లో జరిగిన రెండో విడత శాంతి చర్చల సందర్భంగా కిమ్...ట్రంప్‌కి తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వియత్నాం వేదికగా జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగియడం తెలిసిందే. పూర్తిగా చదవండి


  టొంగ్‌చాంగ్-రి క్షిపణి ప్రయోగ కేంద్రంలో ఉత్తర కొరియా పునర్నిర్మాణ పనులు చేపడుతోందన్న కథనాలపై వెంటనే స్పందించేందుకు అమెరికా విదేశాంగ శాఖ నిరాకరించింది. సెంటర్ ఫర్ స్ట్రాటెజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ రిపోర్ట్‌ పట్ల వైట్‌హౌస్ అధికారులు విశ్వాసాన్ని వ్యక్తంచేస్తున్నారు. అయితే ప్రస్తుతం చేపట్టిన పునర్నిర్మాణ పనులు ఆందోళన కలిగించేవి కావని అభిప్రాయపడుతున్నారు. 2017లో ఇక్కడ క్షిపణి ప్రయోగాలను నిలివేయగా...ఇక్కడ తిరిగి క్షపణి ప్రయోగాలను పునరుద్ధరించే స్థాయిలో పునర్నిర్మాణ పనులు జరగడం లేదని అభిప్రాయపడుతున్నారు.

  గ్యాలరీ: వియత్నాంలో ట్రంప్-కిమ్ రెండో విడత శాంతి చర్చలు
  First published: