ప్రముఖ పారిశ్రామికవేత్త, టెస్లా(Tesla) సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారు. ఆయన గతంలో తీసుకున్న అసాధారణ నిర్ణయాల వల్లే ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత ధనికుడు, గొప్ప వ్యాపారవేత్త అయ్యారు. స్పేస్ఎక్స్ సీఈఓ మస్క్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంటుంది. అయితే అతను ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనతో పాటు తన కంపెనీల కార్యకలాపాల కోసం ఒక ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్ (Private Airport) కట్టించేందుకు సిద్ధమయ్యారు. అమెరికాలోని టెక్సాస్ (Texas) రాజధాని ఆస్టిన్ (Austin) సమీపాన తన సొంత విమానాశ్రయాన్ని నిర్మించడానికి మస్క్ ప్లాన్ చేస్తున్నట్టు తాజాగా మీడియా నివేదికలు చెబుతున్నాయి.
మస్క్ కొత్త ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్ కోసం ప్లాన్స్ అభివృద్ధి చేస్తున్నారని ఓ మీడియా నివేదించింది. ఈ ఎయిర్‌పోర్ట్‌ను ఏ సమయం, ఏ ప్రదేశంలో నిర్మించనున్నారనేది ఇంకా తెలియరాలేదు. మస్క్ ఓన్ ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్ టెక్సాస్‌లోని బాస్ట్రాప్ సమీపంలో ఆస్టిన్‌కు తూర్పున ఉండొచ్చని తెలుస్తోంది. బాస్ట్రాప్ నుంచి ఆస్టిన్‌కు కేవలం 30 మైళ్ల దూరం ఉంటుంది. మస్క్‌కి సంబంధించిన మూడు కంపెనీల గ్లోబల్ హెడ్‌క్వార్టర్స్ ఆస్టిన్‌లోనే ఉన్నాయి. ఇటీవల టెస్లా, ది బోరింగ్ కంపెనీలు తమ గ్లోబల్ హెడ్‌క్వార్టర్స్‌ను ఆస్టిన్‌కి మార్చాయి. దాంతో తన కంపెనీల కార్యకలాపాలు మరింత వేగవంతం చేసేందుకు మస్క్ ఆస్టిన్, టెక్సాస్‌లకు కాస్త దగ్గరగా ప్రైవేట్ విమానాశ్రయం నిర్మించాలని చూస్తున్నారని సమాచారం.
ప్రైవేట్ విమానాశ్రయం కోసం మస్క్ ఎంత స్థలం ఉపయోగిస్తారు తెలియాల్సి ఉంది. అయితే పబ్లిక్ కోసం గతంలోనే కట్టించిన ఆస్టిన్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్ట్ 1,30,000 చదరపు అడుగుల కమ్యూనిటీ హ్యాంగర్ స్థలాన్ని కలిగి ఉంది. దీనికి 6,025 అడుగుల రన్‌వే కూడా ఉంది. మస్క్ అదే విస్తీర్ణంలో విమానాశ్రయాన్ని పెడతారా లేదా అనేది కొద్దిరోజుల్లో తెలుస్తుంది. నిజానికి విమానాశ్రయాన్ని నిర్మించడం మామూలు విషయం కాదు. దీన్ని నిర్మించడం కష్టంతో పాటు సమయంతో కూడుకున్న పని. విమానాశ్రయాలకు పర్యావరణ రక్షణ సంస్థ (EPA), ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఆమోదాలు రెండూ తీసుకోవాల్సి ఉంటుంది.
మస్క్ కొత్త విమానాశ్రయంపై నిర్మించడానికి ప్రధాన కారణం తనకు, అతని ఎగ్జిక్యూటివ్‌లకు ప్రైవేట్ జెట్ ప్రయాణాన్ని అందించడమేనని ఒక రిపోర్ట్ పేర్కొంది! ముందుగా చెప్పుకున్నట్లు టెస్లా హెచ్‌క్యూ, స్పేస్‌ఎక్స్, ది బోరింగ్ కంపెనీతో సహా మస్క్ అనేక కంపెనీలు కొత్త విమానాశ్రయం నిర్మించే ప్రాంతంలోనే ఉన్నాయి. అలా ఈ ఎయిర్‌ఫీల్డ్ వ్యూహాత్మక స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు.
మస్క్, అతని కంపెనీలకు యూఎస్ రెండో అతిపెద్ద రాష్ట్రమైన టెక్సాస్‌లో చాలా భూములు ఉన్నాయి. అతనికి చెందిన అత్యంత విశాలమైన స్థలం సెంట్రల్ టెక్సాస్‌లోని కొలరాడో నది వెంబడి ఉంది. మస్క్ కి బాగా ముఖ్యమైన ప్రాంతం ఆగ్నేయ ట్రావిస్ కౌంటీలోని గిగా టెక్సాస్‌లో 2,500 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. డిసెంబర్ 2021లో మస్క్ టెస్లా హెచ్‌క్యూని సిలికాన్ వ్యాలీ నుంచి టెక్సాస్‌లోని ఈ ప్రాంతానికి మార్చారు. బోరింగ్ కంపెనీ హెడ్‌క్వార్టర్స్ కూడా ఆస్టిన్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్ట్ నుంచి మూడు మైళ్ల దూరంలో ఉన్న టెక్సాస్‌కు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.