ప్రమాదకర తీవ్రవాదులుగా ముద్రపడ్డ తాలిబన్ల పాలనలోనూ అఫ్గానిస్తాన్ తలరాత మారలేదు. తాలిబన్లను మించిన తలతిక్క ముష్కరులు పిల్లల్ని టార్గెట్ చేసుకుని పైశాచిక దాడులకు పాల్పడ్డారు. అప్గానిస్తాన్ రాజధాని కాబూల్ సిటీలోని వేర్వేరు స్కూళ్ల వద్ద మంగళవారం వరుస పేలుడు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ హింసలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులు కొందరైతే, తీవ్రంగా గాయపడ్డవారు మరికొందరు. వివరాలివే..
అఫ్గాన్ రాజధాని కాబూల్ సిటీ పశ్చిమ ప్రాంతంలోని పలు స్కూళ్ల వద్ద పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. డజన్ల కొద్దీ జనం గాయపడ్డారని స్థానిక అధికారులు చెప్పారు. పశ్చిమ కాబూల్‌లోని ముంతాజ్ పాఠశాల భూభాగంలో మొదటి పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పలువురు గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. రాజధానిలోని దష్త్-ఎ-బర్చి జిల్లాలోని మరో పాఠశాల సమీపంలో రెండో పేలుడు సంభవించింది. ఇక్కడ ఆరుగురు మరణించారని, డజన్ల కొద్దీ జనం గాయపడ్డారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ పాఠశాలకు పరిసరాల్లో కొందరు షియా హజరా తెగకు చెందినవారు ఉన్నారు. వీరు మతపరమైన అల్పసంఖ్యాకులు. వీరిపై సున్నీ ఉగ్రవాద సంస్థలు తరచూ దాడులు చేస్తూ ఉంటాయి. మంగళవారం నాటి దాడి మాత్రం స్కూల్ పిల్లల్ని లక్ష్యంగా చేసుకొని పాల్పడినట్లు తెలుస్తోంది. కాబూల్ కమాండర్ అధికార ప్రతినిధి ఖలీద్ జడ్రాన్ మాట్లాడుతూ, ఓ హైస్కూలులో మూడు పేలుళ్ళు జరిగాయని చెప్పారు. షియా ప్రజలు కొందరు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
క్షతగాత్రులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రి నర్సింగ్ డిపార్ట్‌మెంట్ అధిపతి మాట్లాడుతూ, ఈ పేలుళ్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 14 మంది గాయపడ్డారని తెలిపారు. ఈ దాడికి తమదే బాధ్యత అని ఇప్పటి వరకు ఏ సంస్థా ప్రకటించలేదు. అయితే తాము అధికారం చేపట్టినప్పటి నుంచి ఆఫ్ఘనిస్థాన్ భద్రతను పరిరక్షిస్తున్నామని తాలిబన్లు చెప్తున్నారు. కానీ అంతర్జాతీయ సంస్థలు, విశ్లేషకులు మాత్రం ఉగ్రవాద సంస్థల్లో తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. మరోవైపు అనేక దాడులకు తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Kabul, Kabul blast, Taliban