ప్రపంచంలో తల్లి ప్రేమను(Mothers Love) మించింది మరేది లేదని అంటారు. ఈ మాట చాలా సందర్భాల్లో నిజమైంది. తన పిల్లలను కాపాడుకోవడానికి తల్లి ఎంతటి కష్టాన్ని అయిన భరిస్తోంది. వారి కోసం ఏ త్యాగానికైనా వెనకాడదు. తన జీవితాన్ని పణంగా పెట్టి అయిన సరే పిల్లలు క్షేమంగా ఉండాలని భావిస్తోంది. తాజాగా ఇలాంటి హృదయవిదారక ఘటన ఒకటి దక్షిణ అమెరికాలో(South America) చోటుచేసుకుంది. తన పిల్లలతో సముద్రంలో చిక్కుకున్న తల్లి.. వారిని బతికించాలని బలంగా భావించింది. పిల్లలకు పాలు ఇచ్చే శక్తి కోసం.. తన మూత్రాన్ని తానే తాగింది. అలా మూత్రం తాగి.. పిల్లలకు పాలిచ్చింది. పిల్లలను అయితే కాపాడుకోగలిగింది కానీ.. డీహైడ్రేషన్ కారణంగా పరిస్థితి విషమించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
మనసును కలిచివేస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 40 ఏళ్ల మేరీలీ చాకోన్ తన కుటుంబంతో ఓడలో ప్రయాణిస్తోంది. మేరీలీ చాకోన్తో పాటు ఆమె భర్త, 6 ఏళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె, వారి ఇంటి పనులు చూసుకుంటున్న మరో మహిళ వెరోనికా మార్టినెజ్ ఉన్నారు. ఈ నౌక సెప్టెంబర్ 3 న వెనిజులా(Venezuela) నుంచి టోర్టుగాకు(Tortuga) బయలుదేరింది. కానీ కరేబియన్లో ఘోర ప్రమాదం జరిగింది. అలలు బలంగా తాకడంతో ఆ ఓడ రెండు ముక్కలుగా విరిపోయింది.
ఆ ఓడ కొంత భాగం నీటిలో మునిగిపోయింది. ఓడలోని కొద్ది భాగం మాత్రం సముద్రంలో తెలియాడింది. అయితే మేరీలీ చాకోన్ భర్త నీటిలో మునిగిపోయాడు. మేరీలీ చాకోన్, ఆమె పిల్లలు, వెరోనికా మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డారు. వీరు ఓడ శిథిలాలపై ఉన్నారు. అయితే ప్రాణాలు అయితే దక్కాయి కానీ.. అది జనసంచారం లేని ప్రాంతం కావడంతో ఈ విషయం బయట ప్రపంచానికి వెంటనే తెలియలేదు. అప్పటికే రోజులు గడవడం.. ఆహారం, నీరు లేకపోవడంతో వారి శరీరాలు డీహైడ్రేషన్ చెందడం ప్రారంభమైంది. ఎండ తీవ్రత కూడా వారిని ఇబ్బందికి గురిచేసింది.
ఇక, పిల్లల సంగతి చూసి తల్లి మేరీలీ చలించిపోయింది. వారికి బతికించడానికి ఏదో ఒక రకంగా ఆహారం ఇవ్వాలని చూసింది. అయితే ఆమె పరిస్థితి కూడా ఏ మాత్రం బాగోలేదు. కానీ ఆమె తన పిల్లలకు పాలు ఇవ్వడం కోసం.. తన మూత్రాన్ని తానే తాగింది. అనంతరం పాలు ఇచ్చి వారి కడుపు నింపింది. అయితే శరీరం పూర్తిగా డీహైడ్రేషన్ కావడంతో ఆమె మరణించింది.
షార్ట్స్ వేసుకొని ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన అమ్మాయి.. అనుమతించని సిబ్బంది.. చివరకు అలా..
ఇక, ఓర్చిలా ద్వీపంలో ఓడ భాగాలు తేలుతున్నట్టుగా వెనిజులా అధికారులు సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం గుర్తించారు. మరుటి రోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే మేరీలీ చనిపోయింది. అధికారులు అక్కడికి వెళ్లేసరికి తల్లి మృతదేహం పక్కన ఇద్దరు పిల్లలు కనిపించారు. ఆ పిల్లలను అధికారులు రక్షించారు. అక్కడే ఎలాగోలా తన ప్రాణాలను దక్కించుకున్న వెరోనికాను అధికారులు రక్షించారు. అయితే వారి పరిస్థితి కూడా చాలా దయానీయంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. అయితే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకునే నాలుగు గంటల ముందే మేరీలీ మరణించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 11న మేరీలీ అంత్యక్రియలు నిర్వహించారు. ఇక, బోట్ ప్రమాదంలో మరో ఐదుగురు గల్లంతయ్యారని, వారంతా మృతిచెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అందులో మేరీలీ భర్త కూడా ఉన్నాడు.
ఇక, ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాలా మంది తన బిడ్డల కోసం మేరీలీ చేసిన త్యాగానికి అందరూ నివాళులర్పిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Boat accident, Mother milk