కోవిడ్ మహమ్మారి (Covid-19) సృష్టించిన విలయం నుంచి ఇంకా బయట పడలేదు. ఇంతలోనే మరో వైరస్ కలకలం రేపుతోంది. కరోనా తర్వాత అంతగా భయపెడుతున్న వ్యాధి మంకీ పాక్స్ (Monkey Pox). ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు బయటపడుతూ అందరినీ కలవరపెడుతున్నాయి. ఇండియాలోనూ మంకీ పాక్స్ కేసులు వెలుగు చూశాయి. ఇక, లేటెస్ట్ గా మంకీపాక్స్ వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి (గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ)గా ప్రకటించింది. 75 దేశాల్లో 16,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. అలాగే.. ఈ వ్యాధితో ఐదుగురు మరణించినట్లు తెలిపారు. సాధారణంగా ఈ వ్యాధి కనిపించని బ్రిటన్‌లో కూడా ఈ కేసులు నమోదయ్యాయి. జూన్ చివరి వారం నుంచి జులై మొదటివారం వరకు ఈ వైరస్ విస్తరణ వేగం 77 శాతానికి పెరిగింది.
గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించడం ద్వారా గణనీయస్థాయిలో ప్రభావం కలిగించే ముప్పుగా మంకీపాక్స్ ను డబ్ల్యూహెచ్ఓ పరిగణిస్తుంది. తద్వారా అంతర్జాతీయ సమాజం నుంచి సహకారం కోరే వీలుంటుంది. యూరప్ దేశాలను ఈ కొత్త వైరస్ కు జన్మస్థానంగా భావిస్తున్నారు. స్వలింగ సంపర్కుల్లో ఇది అత్యంత ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు.
' అయితే మంకీపాక్స్ ఇన్ని దేశాల్లో ఇన్ని కేసులు నమోదవటం అసాధారణమైన విషయం. మునుపెన్నడూ ఇలా జరగలేదు. ఈ వైరస్, వ్యాధి గురించిన నిపుణులైన శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అందుకే అన్ని దేశాలను అలర్ట్ చేస్తున్నాం. మంకీపాక్స్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటిస్తున్నాం ' అంటూ డాక్టర్ టెడ్రోస్ తెలిపారు.
ఏదైనా ఒక వైరస్ ప్రవర్తన మారిందంటే అది ఆందోళన రేకెత్తించే విషయమే.పశ్చిమ, మధ్య ఆఫ్రికాలోని వర్షాధార అడవుల్లో ఈ వైరస్ సోకివున్న జంతువుతో ఎవరో మనిషి కాంటాక్ట్‌లోకి రాగా.. ఆ జంతువులోని వైరస్ మ్యుటేట్ అయి మనిషికి సోకింది. మంకీ పాక్స్ వైరస్ సోకితే శరీరంపై భిన్నమైన దద్దుర్లు, తీవ్ర జ్వరం ఉంటాయి. సాధారణంగానే చాలా మంది దీని నుంచి కోలుకోగలరని.. కొందరిలో మాత్రం ప్రాణాపాయ పరిస్థితి తలెత్తుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మంకీ పాక్స్ వైరస్ గాలి ద్వారా వ్యాపించదు. కానీ సోకినవారికి బాగా సన్నిహితంగా మెలిగినా, తాకినా, వారి వస్తువులు, దుస్తులు ఉపయోగించినా.. వైరస్ సోకే అవకాశం ఉంటుంది. మంకీ పాక్స్ లో రెండు రకాలు ఉన్నాయని ఇంతకుముందే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
అందులో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు మొదటి రకానివని, అది మరీ ప్రమాదకరం కాదని పేర్కొంది.అయితే ఆఫ్రికాలోని కాంగోలో బయటపడిన మరో రకం మంకీ పాక్స్ వైరస్ మాత్రం ప్రమాదకరమని.. దానివల్ల 10 శాతం మేర మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించింది. మంకీ పాక్స్ సాధారణంగా రెండు నుండి 4 వారాల వరకు ఉంటాయి. పిల్లల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మంకీపాక్స్ సోకిన పిల్లల్లో మరణాల రేటు ఎక్కువగా ఉందని వైద్య శాఖాధికారులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: COVID-19 cases, Monkeypox, WHO