ఐసీస్ ఉగ్రవాద సంస్థ బాంబు పేలుళ్లకు నిరసనగా శ్రీలంక వ్యాప్తంగా ముస్లింలపై దాడులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 21న ఈస్టర్ వేడుకల్లో ఐసీస్ ఉగ్రవాదులు ఆత్మహుతి దాడుల్లో దాదాపు 250 మంది చనిపోగా, వందలాది మంది తీవ్రగాయాలపాలయ్యారు. దీంతో శ్రీలంకలో మత ఘర్షణలు ప్రారంభమయ్యాయి. శ్రీలంకలోని నివాసముంటున్న మైనారిటీల్లో ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. అయితే బాంబు దాడులు జరిగినప్పటి నుంచి ముస్లింల ఆస్తులు, నివాసాలు, ప్రార్థనా స్థలాలే టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా శ్రీలంకలోని నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్ లో ఈ దాడులు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవలే అల్లరి మూకలు శ్రీలంకలోని కినియామా ప్రాంతంలోని అబ్రార్ మసీదుపై దాడి చేసి లోపల ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అలాగే వందలాది మంది అల్లరి మూకలు ఇప్పటికే ముస్లిల నివాస సముదాయాలే టార్గెట్ గా దాడులు చేస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు వలసలు ప్రారంభమైనట్లు కొట్టంపిటియాలో నివాసముంటున్న ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యాపారి ఒకరు తెలిపారు.
ఇదిలా ఉంటే అల్లర్లు మరిన్ని ప్రాంతాలకు వ్యాపించకుండా ఇప్పటికే శ్రీలంకలో సోషల్ మీడియాపై బ్యాన్ విధించారు. అంతే కాదు పోలీసులు సైతం అల్లరి మూకలను అదుపులో తెచ్చేంుదకు నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్‌లో భాష్పవాయు గోళాలను సైతం ప్రయోగించారు. మరోవైపు మదుల్లా టౌన్ లో డజన్ల సంఖ్యలో అల్లరి మూకలు రాడ్లు, కర్రలతో ముస్లింల వ్యాపార సముదాయాలపై దాడులు చేస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉంటే శ్రీలంక దేశ ప్రధాని రనీల్ విక్రమసింఘే ఒక ప్రకటనలో మత హింసను రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఇరు వర్గాలు సంయమనం పాటించాలని కోరారు. అలాగే భద్రతా దళాలు సైతం దేశ రక్షణలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్నాయని పౌరులు వారికి సహకరించాలని కోరారు. ఇదిలా ఉంటే మొత్తం 2.2 కోట్ల జనాభా ఉన్న శ్రీలంకలో దాదాపు 10 శాతం ముస్లింలు నివాసముంటున్నారు. కాగా శ్రీలంకలో సింహళీ బౌద్ధులు మెజారిటీ వర్గంగా ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sri Lanka, Sri Lanka Blasts