పాకిస్థాన్‌లో(Pakistan) దారుణం జరిగింది. దైవదూషణ పేరుతో మరోసారి ఒక వ్యక్తిని కొందరు వ్యక్తులు కొట్టి చంపారు. మానసిక సమస్యలు ఉన్న వ్యక్తిపై మూక దాడి చేసి, రాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు (Police) వెల్లడించారు. ఈ ఘటనను పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఖండించారు. ఈ దారుణానికి పాల్పడిన 80 మందిని పోలీసులు అరెస్ట్(Arrest) చేశారు. ఫిబ్రవరి 12న పంజాబ్ ప్రావిన్స్‌లోని ఖనేవాల్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధితుడిని బారా చక్ గ్రామానికి చెందిన మానసిక వికలాంగుడు ముస్తాక్ అహ్మద్‌గా గుర్తించారు. అతడు 15 ఏళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నారని అధికారులు వెల్లడించారు. ఈ విషయంలో నిందితులతో పాటు దాడికి ఉసిగొల్పిన వారిలో ఎవరైనా పోలీసులు ఉంటే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఇమ్రాన్ ఖాన్ ఆదేశించారు. మానవ హక్కుల మంత్రి(Minister) షిరీన్ మజారీ కూడా ఘటనను ఖండించారు. బాధితులను శిక్షించాల్సిందేనని చెప్పారు. ఈ విషాదం దేశాన్ని మరోసారి అవమానపర్చిందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ పేర్కొన్నారు.
నివేదికల ప్రకారం, ఖురాన్ పేజీలను తగలబెట్టిన వ్యక్తిని తాను గుర్తించినట్లు స్థానిక మతపెద్ద కొడుకు చెప్పగానే, స్థానికులు గుమిగూడారు. "నా కొడుకు మసీదులోకి వచ్చాడు. ఖురాన్ మంటల్లో కాలిపోతుండటాన్ని గుర్తించాడు. అక్కడే కూర్చున్న వ్యక్తిని చూసి పట్టుకున్నాడు. అతన్ని బయటకు తీసుకువచ్చి పోలీసులకు ఫోన్ చేశాడు. వెంటనే పోలీసు అధికారి వచ్చాడు." అని మసీదు సంరక్షకుడు
మియాన్ ముహమ్మద్ రంజాన్ తెలిపారు.
అల్లరి మూక బాధితుడిని లాక్కెళ్లక ముందు, అతడిని పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు తెలిపాయి. ఆ వ్యక్తిని మసీదు నుంచి బయటకు లాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాధితుడిని చుట్టుముట్టిన అల్లరిమూక, చనిపోయే వరకు కర్రలు, రాళ్లతో కొట్టినట్లు వీడియోలో కనిపించింది. బాధితుడిని చెట్టుకు కట్టేసి, చిత్రహింసలకు గురి చేశారు. బాధితుడి మృతదేహాన్ని చెట్టుపై నుండి కిందకు తీసుకురావడానికి ప్రయత్నించిన పోలీసులపై కూడా అల్లరిమూక రాళ్ల దాడి చేసింది.
‘‘గాయపడిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించాం. కానీ అల్లరిమూక కంటే తక్కువ సంఖ్యలో పోలీసులు ఘటనా స్థలంలో ఉన్నారు. వారు బాధితుడిని చంపారు. మతపరమైన నినాదాలు చేశారు. బాధితుడి మృతదేహాన్ని విడిపించడానికి ప్రయత్నించిన ఇద్దరు పోలీసులపై దాడి చేశారు. అదనపు బలగాలు వచ్చి ఆకతాయిలను చెదరగొట్టారు. తర్వాత మృతదేహాన్ని మార్చురీకి తరలించాం’’ అని పోలీసు అధికారి ముహమ్మద్ అమీన్ చెప్పారు. అయితే బాధితుడిని పోలీసులు రక్షించే ప్రయత్నం చేయలేదని బాధిత కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు.
పాకిస్థాన్‌లో అవమానకరంగా దైవదూషణ హింస..
గార్మెంట్ ఫ్యాక్టరీకి చెందిన శ్రీలంక ఎగ్జిక్యూటివ్‌ను కొట్టి చంపిన రెండు నెలల తర్వాత జరిగిన మరో క్రూరమైన సంఘటన ఇది. దైవదూషణ ఆరోపణలపై సియాల్కోట్లో బాధితుడిపై దాడి చేసి, అతని మృతదేహాన్ని తగలబెట్టారు. అప్పటి ఘటనను ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. శ్రీలంక వ్యక్తిని కొట్టి చంపడం దేశానికి అవమానకరంగా మారిందని వ్యాఖ్యానించారు. ఇటీవల దైవదూషణకు పాల్పడిన ఓ మహిళకు పాకిస్థాన్ కోర్టు మరణశిక్ష విధించింది. 1990 నుంచి పాక్‌లో దైవదూషణ ఆరోపణలకు సంబంధించి 80 మందికి పైగా మరణించారని నివేదికలు చెబుతున్నాయి.
Whatsapp Features: వాట్సప్‌లో క్రేజీ అప్డేట్.. కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
పాక్‌లో దైవదూషణ చట్టాలు ఎలా ఉన్నాయి?
ఇస్లాంను అవమానించే ఎవరికైనా మరణశిక్ష విధించవచ్చని పాకిస్థాన్ దైవదూషణ చట్టాలు చెబుతున్నాయి. మైనారిటీలను హింసించడానికి, వారిని అన్యాయంగా లక్ష్యంగా చేసుకోవడానికి ఈ చట్టాన్ని కొందరు ఉపయోగిస్తున్నారని విమర్శకులు వాదిస్తున్నారు. అయితే పాకిస్థాన్ ముస్లింలు కూడా దైవదూషణ ఆరోపణలను ఎదుర్కోవడం గమనార్హం. దైవదూషణకు పాల్పడినట్లు అనుమానిస్తున్న పౌరులను గుర్తించడంలో సహాయపడాలని ఇటీవల Facebook, Twitterలను పాకిస్థాన్ కోరింది. వ్యక్తిగతంగా కొందరిని లక్ష్యంగా చేసుకోవడానికి కూడా ఈ చట్టాలను ఉపయోగించుకుంటున్నట్లు మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. చట్టాలను సవరించాలని పాక్ రాజకీయ పార్టీలు చెబుతున్నా ఈ విషయంలో పురోగతి కనిపించట్లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, International news, Pakistan