Home /News /international /

MEHUL CHOKSI APPREHENDED IN DOMINICA WHERE ON EARTH IS DOMINICA SU GH

Dominica: డొమినికాలో పట్టుబడ్డ మెహుల్ చోక్సీ.. అసలు ఈ దేశం ఎక్కడ ఉంది?

మెహుల్ చోక్సీ(ఫైల్ ఫొటో)

మెహుల్ చోక్సీ(ఫైల్ ఫొటో)

భారత్‌ నుంచి పారిపోయిన వ్యాపారవేత్త మెహుల్ చోక్సీ రెండు రోజుల క్రితం ఆంటిగ్వాలో కనిపించకుండా పోయాడు. అయితే మరుసటి రోజే ఆయన డొమినికా పోలీసులకు చిక్కాడు.

ప్రపంచంలో ఉన్న మొత్తం దేశాల్లో మనకు తెలిసిన వాటి కంటే తెలియనివే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ఒక దేశం పేరు ఇప్పుడు భారత్‌లో వార్తల్లో నిలుస్తోంది. అదే డొమినికా. భారత్‌ నుంచి పారిపోయిన వ్యాపారవేత్త మెహుల్ చోక్సీ రెండు రోజుల క్రితం ఆంటిగ్వాలో కనిపించకుండా పోయాడు. అయితే మరుసటి రోజే ఆయన డొమినికా పోలీసులకు చిక్కాడు. రూ.13,500 కోట్ల రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో కీలక సూత్రదారిగా ఉన్నాడు మెహుల్ చోక్సీ. డొమినికాలోకి అతడు అక్రమంగా ప్రవేశించించాడని అక్కడి అధికారులు చెబుతున్నారు. 2018 జనవరి నుంచి చోక్సీ ఆంటిగ్వా అండ్ బార్బుడా దేశంలో ఉంటున్నాడు. ఇటీవల అక్కడ నుంచి అదృశ్యమయ్యాడు.

* డొమినికా ఎక్కడ ఉంది?
డొమినికా అనే ద్వీప దేశం, తూర్పు కరేబియన్ సముద్రంలో ఉంది. ఇది లెస్సర్ యాంటిల్లెస్ సమూహంలోని విండ్‌వార్డ్ దీవుల్లో ఒక భాగంగా ఉంటుంది. లెస్సర్ యాంటిల్లెస్, గ్రేటర్ యాంటిల్లెస్, లుకాయన్ ద్వీప సమూహాలను కలిపి వెస్టిండీస్‌ అంటారు. ఫ్రెంచ్ ద్వీపాలైన గ్వాడెలోప్, మేరీ గలాంటే, మార్టినిక్‌ల మధ్య డొమినికా ఉంది. ఈ దేశ విస్తీర్ణం 47 కిలోమీటర్ల పొడవు, 26 కిలోమీటర్ల వెడల్పుగా ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, అక్కడి జనాభా 70,000 కన్నా తక్కువ. డొమినికా రాజధాని రోజౌ (Roseau). ఇక్కడే ఆ దేశంలోని ప్రధాన ఓడరేవు ఉంది. 1978లో స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి కామన్వెల్త్‌ దేశాల్లో డొమినికాకు సభ్యత్వం ఉంది.

* డొమినికా రిపబ్లిక్ వేరే దేశమా?
డొమినికా, డొమినికన్ రిపబ్లిక్.. రెండూ ఒకటి కాదు. ఇవి కరేబియన్ సముద్రంలో ఉన్న రెండు వేర్వేరు దేశాలు. వెస్టిండీస్ దేశం అయిన డొమినికన్ రిపబ్లిక్, గ్రేటర్ యాంటిల్లెస్ సమూహంలో రెండవ అతిపెద్ద ద్వీపం. ఈ దేశ రాజధాని శాంటో డొమింగో. డొమినికా రిపబ్లిక్‌కు దక్షిణాన కరేబియన్ సముద్రం, ఉత్తరాన అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. దీని విస్తీర్ణం 48,671 చదరపు కిలోమీటర్లు. యాంటిల్లెస్ సమూహాల్లో రెండవ అతిపెద్ద దేశం ఇది. జనాభా ప్రకారం ఇది మూడవ అతిపెద్ద దేశం. డొమినికా రిపబ్లిక్ జనాభా సుమారు 10.77 మిలియన్లు. ఇది కరేబియన్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశం కావడం విశేషం. విహార యాత్రకు ఇక్కడికి ఎక్కువ మంది వెళ్తుంటారు.

* ఆంటిగ్వా అండ్ బార్బుడా
మోహుల్ చోక్సీ గత రెండు సంవత్సరాలుగా ఈ దేశంలో ఉంటున్నాడు. ఇది కూడా వెస్టిండీస్‌లోని ఒక ద్వీప దేశం. కరేబియన్ సముద్రంలో ఉన్న ఆంటిగ్వా, బార్బుడా అనే రెండు ప్రధాన ద్వీపాలు, ఇతర చిన్న ద్వీపాలు కలిసి ఒక దేశంగా ఏర్పడ్డాయి. లెస్సర్ యాంటిల్లెస్‌లో భాగమైన లీవార్డ్ దీవుల మధ్యలో ఈ దేశం ఉంది. దీని రాజధాని సెయింట్ జాన్స్. ఈ దేశ జనాభా సుమారు 97,000.

మెహుల్ చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.13,500 కోట్లు అప్పుగా తీసుకొని, చెల్లించకుండా దేశం విడిచి పారిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. నీరవ్ మోడీ ప్రస్తుతం లండన్ జైలులో ఉన్నాడు. అతడిని భారతదేశానికి రప్పించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెహుల్ చోక్సి 2018 జనవరిలో భారత్‌ నుంచి పారిపోయాడు. అయితే 2017లోనే సిటిజన్‌షిప్ బై ఇన్వెస్ట్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా అతడు ఆంటిగ్వా అండ్ బార్బుడా పౌరసత్వం తీసుకున్నాడు. చోక్సీ, నీరవ్‌లపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఆంటిగ్వా అండ్ బార్బుడాలో కూడా చోక్సీపై రెండు కేసులు ఉన్నాయి. అతడిని భారతదేశానికి అప్పగించడం, పౌరసత్వాన్ని రద్దు చేయడం.. ఈ రెండు కేసుల్లో చోక్సీ విచారణను ఎదుర్కొంటున్నాడు.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Mehul Choksi, PNB Scam

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు