news18-telugu
Updated: January 13, 2021, 9:49 PM IST
ప్రతీకాత్మకచిత్రం
దురదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో తెలియదు. కానీ, ఆ దురదృష్టం వచ్చిందంటే ఎంతటి వాడైనా బొక్క బోర్లా పడాల్సిందే. విధి ఎంత విచిత్రమైనదో స్టీఫన్ థామస్ అనే వ్యక్తిని చూస్తే తెలుస్తుంది. అకౌంట్లో రూ.1800 కోట్లు ఉన్నాయి. కానీ ఒక్క రూపాయి తీసుకోలేడు. కారణం.. దానికి అవసరమైన పాస్వర్డ్ మరచిపోయాడు. అసలు ఎవరీ థామస్.. అంత డబ్బును ఎలా కోల్పోతున్నాడో చూడండి. క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ ఇప్పుడు ఆకాశమే హద్దుగా ఎలా దూసుకుపోతోందో చూస్తూనే ఉన్నాం. అయితే అసలు ఎవరూ దీనిని నమ్మని కాలంలోనే థామస్ అందులో ఇన్వెస్ట్ చేశాడు. అది కాస్తా మెల్లగా ఇప్పుడతని బిట్కాయిన్ల సంఖ్య 7002కు చేరింది. ప్రస్తుతం బిట్‌కాయిన్‌కు ఉన్న విలువ ప్రకారం చూస్తే.. ఈ మొత్తం 24.5 కోట్ల డాలర్లు (సుమారు రూ.1800 కోట్లు)కు సమానం. ఇంత డబ్బు సేఫ్‌గా ఉండాలన్న ఉద్దేశంతో తన బిట్కాయిన్ల కీస్ అన్నింటినీ ఐరన్‌కీ అనే ఎన్క్రిప్టెడ్ హార్డ్ డ్రైవ్‌లో పెట్టుకున్నాడు. దీనిని ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్‌వర్డ్‌నే థామస్ మరచిపోయాడు. గరిష్ఠంగా పది సార్లు మాత్రమే ప్రయత్నించే వీలుంది. అందులో ఇప్పటికే 8సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. పదిసార్లూ అయ్యిందంటే ఇక ఎప్పటికీ ఆ డ్రైవ్ ఓపెన్ కాదు. అంటే ఆ డబ్బంతా పోయినట్లే.
బిట్‌కాయిన్ అనేది క్రిప్టోకరెన్సీ చట్టాల ప్రకారం నడుస్తుంది. అంటే ప్రతి ఒక్క బిట్‌కాయిన్‌కు ఒక క్రిప్టోగ్రాఫిక్ కీ ఉంటుంది. ఇది సదరు బిట్‌కాయిన్ ఓనర్‌కు మాత్రమే తెలుస్తుంది. దీనిని మేనేజ్ చేయడానికి సంస్థలు కానీ, ఓ కేంద్రీకృత కార్యాలయం కానీ మాస్టర్ కీ కానీ ఏదీ ఉండదు. ఈ కీని ఆ వ్యక్తే మరొకరికి చెబితే తప్ప ఎవరికీ తెలియదు. అంటే ఆ క్రిప్టో వాలెట్ పాస్వర్డ్ మరచిపోయారంటే దానిని ఇక ఎవరూ ఓపెన్ చేయలేరు.
ఇలా పాస్వర్డ్లు మరచిపోవడం వల్ల ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మన కరెన్సీలో రూ.9.5 లక్షల కోట్లు ఇలాంటి క్రిప్టో వాలెట్లలో ఉండిపోయాయని టైమ్స్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ డబ్బు విలువ ప్రపంచంలోని ఎన్నో దేశాల జీడీపీ కంటే కూడా ఎక్కువ కావడం విశేషం. పాస్వర్డ్ మరచిపోవడం వల్ల నష్టపోయిన మొత్తంలో థామస్ వాటా 0.2 శాతంగా ఉంది.
Published by:
Sridhar Reddy
First published:
January 13, 2021, 9:49 PM IST