MAN BITES AND STABS K9 POLIC DOG IN CALIFORNIA USA MKS
Man Bites Dog: కుక్కను కరిచిన మనిషి.. ఆ ఇంట్లో హైడ్రామా.. అసలేం జరిగిందంటే..
మనిషి కాటుకు గురైన పోలీస్ జాగిలం
వృద్ధ జంట నివసిస్తోన్న ఓ ఇంటిని టార్గెట్ చేసుకొని, దొంగతనానికి దిగిన ఓ వ్యక్తి.. చివరి నిమిషంలో ఎస్కేప్ ప్లాన్ మార్చుకుని.. నాటకీయ ఫక్కీలో పోలీస్ కుక్కను కరిచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వివరాలివే..
మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు.. మనిషే కుక్కను కరిస్తే వార్త అనే నానుడిని నిజం చేశాడో ప్రబుద్ధుడు. వృద్ధ జంట నివసిస్తోన్న ఓ ఇంటిని టార్గెట్ చేసుకొని, దొంగతనానికి దిగిన ఓ వ్యక్తి.. చివరి నిమిషంలో ఎస్కేప్ ప్లాన్ మార్చుకుని.. నాటకీయ ఫక్కీలో పోలీస్ కుక్కను కరిచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఫెయిర్‌ఫీల్డ్ లో చోటుచేసుకుందీ ఘటన. దీనిపై స్థానిక పోలీసులు చెప్పిన వివరాలివి..
కాలిఫోర్నియా రాష్ట్రంలో ఫెయిర్‌ఫీల్డ్ లో తాజాగా ఓ చోరీ ఘటన చోటుచేసుకుంది. వృద్ధులున్న ఓ ఇంటికి కన్నం వేసిన దొంగోడు.. దోచుకున్న సొత్తుతో పారిపోదామనుకునే సమయంలోనే ఆ ఇంటికి అమెజాన్ డెలివరీ బాయ్ వచ్చాడు. సడన్ గా ప్లాన్ మార్చుకున్న దొంగ.. తాను పారిపోయేందుకు అమెజాన్ డెలివరీ ట్రక్కును వాడుకుందామనుకున్నాడు..
దొంగోడు కొరికి, పొడవటంతో గాయపడ్డ పోలీస్ జాగిలం కార్ట్(కే9)
ట్రక్కు తాళాలు ఇవ్వాలని లేకుంటే చంపేస్తానని డెలివరీ బాయ్‌ని దొంగోడు బెదిరించాడు. గొంతుపై కత్తి ఉన్నా డెలివరీ బాయ్ చాకచక్యంగా పోలీసులకు ఫోన్ చేశాడు. నిమిషాల వ్యవధిలోనే పోలీస్ కారు కుయ్ కుయ్ అంటూ అక్కడికి చేరుకుంది. దీంతో బిత్తరపోయిన దొంగ.. డెలివరీ బాయ్ ని వదిలేసి తిరిగి కన్నవేసిన ఇంట్లోకే దూరిపోయాడు..
పోలీసులు ఎంత ప్రయత్నించినా తలుపులు తెరవడం సాధ్యం కాకపోవడంతో దొడ్డిదారి గుండా కార్ట్(కే9) అనే పోలీస్ జాగిలాన్ని లోనికి వదిలారు. నేరస్తులను పట్టుకోవడంలో ఆరితేరిన ఆ కుక్క పరుగున ఇంట్లోకి కి వెళ్లి దొంగను దొరకబుచ్చుకుంది. ఈలోపు పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోనికి ప్రవేశించారు. కానీ అప్పటికే దొగోడు కుక్కను నోటితో కరిచి, కత్తితో పొడిచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు ఒక్కఉదుటన వాడిమీదికి దూకి బేడీలు వేశారు..
మనిషి కాటుకు గురైన కుక్కను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ దొంగను కూడా ఆస్పత్రిలో చేర్పించారు. డ్రగ్స్ మత్తులోనే దొంగోడు పోలీస్ జాగిలాన్ని కొరికినట్లు వెల్లడైంది. వాడిపై పాత కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తాజా దొంగతనంతోపాటు కుక్కను కరిచినందుకు కూడా అతనిపై కేసులు నమోదు చేశారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.