అఫ్గాన్ తాలిబన్ల వశమైన నేపథ్యంలో.. స్థానికంగా పౌరుల జీవనం, వారి హక్కుల విషయంలో ఆయా దేశాలు, ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ ఈ వ్యవహారంపై స్పందించారు. అఫ్గాన్‌లోని మహిళలు, మైనారిటీలు, మానవ హక్కుల న్యాయవాదుల భద్రతపై తాను ఆందోళన చెందుతున్నానని చెప్పారు. ప్రస్తుతం యూకే ఉంటున్న మాలాలా ఈ మేరకు ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. ‘ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ నియంత్రణలోకి తీసుకోవడం పూర్తి షాక్‌లోకి నెట్టేసింది. మహిళలు, మైనారిటీలు, మానవ హక్కుల న్యాయవాదుల గురించి నేను తీవ్ర ఆందోళన చెందుతున్నాను. ప్రపంచ దేశాలు, ప్రాంతీయ, స్థానిక శక్తులు.. తక్షణ కాల్పుల విరమణ కోసం పిలుపునివ్వాలి. తక్షణ మానవతా సాయం అందించాలి. శరణార్థులు మరియు పౌరులను రక్షించాలి’అని మలాలా తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఆదివారం తాలిబన్లు అఫ్గాన్ రాజధాని కాబూల్‌ను నలువైపుల నుంచి చుట్టుముట్టారు. తాలిబన్లు పూర్తిగా రాజధానిలోకి చొచ్చుకురావడంతో ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఏమీ చేయలేక చేతులెత్తేసింది. తాలిబన్లు అద్యక్ష భవనం వైపు కదులుతున్నాన్న సమాచారం రావడంతో.. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. ఘనీ కాబూల్ నుంచి నేరుగా తజికిస్తాన్‌కు వెళ్లినట్టుగా అఫ్గాన్ అంతర్గత మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే అక్కడి నుంచి అష్రఫ్ ఘనీ వేరే దేశానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎక్కడి వెళ్తారన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. భద్రత కారణాల దృష్ట్యా అస్రఫ్ ఘనీ ఎక్కడికి వెళ్తున్నారో తాము చెప్పలేమని కాబూల్‌లోని అధ్యక్ష కార్యాలయం తెలిపింది.
ఇక, మలాలా పాకిస్తాన్లో బాలికల విద్యహక్కు కోసం పోరాడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2012 తాలిబన్ ప్రతినిధి ఎహ్‌షానుల్లా ఎహ్సాన్ మలాలాపై కాల్పులు జరిపిపాడు. బాలికల విద్యాహక్కు పోరాడుతుందన్న అక్కసుతో అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన నుంచి పూర్తిగా కోలుకున్న ఆమె ప్రస్తుతం మహిళల విద్యాహక్కు కోసం ఉద్యమిస్తున్నారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.