MAHATMA GANDHI STATUE VANDALISED IN MELBOURNE AUSTRALIA PM SCOTT MORRISON CONDEMNED THE ACT MKS
Australia : భారత జాతిపితకు అవమానం -మెల్బోర్న్లో గాంధీజీ విగ్రహం ధ్వంసం -భారతీయుల పనేనా?
మెల్బోర్న్లో గాంధీజీ విగ్రహం (మెడ భాగంలో కోసి తలను తెంపాలనుకున్నారు)
భారత్ 75వ స్వాతంత్ర్యదినోత్సవం దగ్గరపడుతున్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిత్రదేశాలు సైతం సబురాల్లో పాలుపంచుకుంటున్నాయి. అందులో భాగంగానే ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటైంది. ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్ స్వయంగా ఆవిష్కరించిన ఆ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం తల భాగాన్ని కోసేందుకు ప్రయత్నించారు. దీన్ని అవమానకర ఘటనగా అభివర్ణించిన ఆసీస్ ప్రధాని.. నిందితులను గుర్తించి శిక్షిస్తామన్నారు..
అహింసనే ఆయుధంగా బ్రిటిష్ సామ్రాజ్యంతో పోరాడి భారత్ కు స్వాతంత్ర్యం అందించి, జాతిపితగా నిలిచారు మహాత్మా గాంధీ (Mahatma Gandhi). భారత్ 75వ స్వాతంత్ర్యదినోత్సవం దగ్గరపడుతున్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిత్రదేశాలు సైతం సబురాల్లో పాలుపంచుకుంటున్నాయి. అందులో భాగంగానే పలు దేశాలు తమ భూభాగాల్లో భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలను, స్మారకాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఆస్ట్రేలియా (Australia) లోనూ భారత ప్రభుత్వం సహకారంతో పలు చోట్ల గాంధీజీ విగ్రహాలను ఆవిష్కరించారు. తాజాగా అక్కడి విక్టోరియా రాష్ట్ర రాజధాని మెల్బోర్న్ సిటీ శివారుల్లోనూ గాంధీజీ లైఫ్ సైజ్ విగ్రహమొకటి ఏర్పాటైంది. దేశాధినేతే స్వయంగా ఆవిష్కరించిన విగ్రహాన్ని గంటల వ్యవధిలోనే ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు దుండగులు..
ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర రాజధాని మెల్ బోర్న్ సిటీ శివారుప్రాంతమైన రోలివిల్లేలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. విగ్రహం మెడ భాగాన్ని రంపం లాంటి వస్తువుతో కోశారు. తలను తెగ్గొట్టడానికి ప్రయత్నించడంతో విగ్రహం దెబ్బతినింది. భారత్-ఆస్ట్రేలియా ప్రభుత్వాల సహకారంతో రోవిల్లే కమ్యూనిటీ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్, భారత్ కౌన్సిల్ జనరల్ సహా పలువురు ముఖ్యులు మొన్న శుక్రవారమే ఆవిష్కరించారు. ప్రధాని ఆవిష్కరించిన గాంధీజీ విగ్రహాన్ని రెండో రోజే బద్దలుకొట్టేందుకు జరిగిన ప్రయత్నాన్ని చూసి యావత్ దేశం నివ్వెరపోయింది.
మెల్ బోర్న్ లో గాంధీజీ విగ్రహంపై దాడిని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తీవ్రంగా ఖండించారు. ఇది అవమానకరమని, వివిధ దేశాల సంస్కృతులకు నెలవైన ఆస్ట్రేలియాలో ఇలాంటి దుశ్చర్యలను సహించబోమని ఆయన అన్నారు. విగ్రహం ధ్వంసం చేసినవారిని గుర్తించేందుకు విక్టోరియా పోలీసులు ప్రయత్నాలు ఆరంభించారని, స్థానికంగా పోలీస్ కేసు కూడా నమోదైందని అధికారులు చెప్పారు.
కాగా, ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో భారతీయుల మధ్యే విద్వేషాలు పెరగడం, రైట్ వింగ్ ఐడియాలజీ యువకులు కొందరు బాహాటంగా విద్వేష వ్యాఖ్యలు, చర్యలకు పాల్పడగా వారిని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇండియాకు వెనక్కి పంపేయడం లాంటి ఘటనలు జరిగాయి. గాంధీజీ విగ్రహ ధ్వంసంలోనూ భారతీయుల పాత్ర ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.