KUWAIT WONT RENEW WORK AND RESIDENCY PERMITS FOR EXPATS AGED ABOVE 60 YEARS DETAILS HERE MKS
Kuwait : ప్రవాస కార్మికులకు షాకిచ్చిన కువైట్.. 60 ఏళ్లు దాటినవారిపై ఇదీ తాజా నిర్ణయం
కువైట్
ప్రవాస కార్మికుల విషయంలో గల్ఫ్ దేశం కువైట్ కఠినంగా ఉండాలని భావిస్తున్నట్లుంది. 60 ఏళ్లు పైబడి, హైస్కూల్ సర్టిఫికేట్ కలిగిన ప్రవాసుల విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వివరాలివే..
కరోనా మహమ్మారి దేశాల ఆర్థిక వ్యవస్థలను, ప్రవాసుల ఉపాధిని దెబ్బతీస్తోన్న వైనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా సమయంలో తమ దేశ పౌరులకు ఉపాధి కల్పించేందుకు గానూ కువైట్ ప్రభుత్వం 60 ఏళ్లు దాటిన ప్రవాసులను వెళ్లిపోవాలని సూచించింది. అయితే కొవిడ్ పూర్తిగా తగ్గుముఖం పట్టి, వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యాపార, వాణిజ్యాలు పుంజుకోవడంతో పరిస్థితులు యథాస్థితికి రావొచ్చనే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ 60 ఏళ్లు దాటిన ప్రవాసుల విషయంలో కువైట్ సర్కారు కాఠినంగానే ఉండాలని నిర్ణయించుకుంది.
60 ఏళ్లు పైబడి, హైస్కూల్ సర్టిఫికేట్ కలిగిన ప్రవాసుల విషయంలో తాజాగా కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖకు చెందిన రెసిడెన్సీ అఫైర్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేటగిరీ ప్రవాసులు తప్పనిసరిగా వర్క్ పర్మిట్లను రెన్యువల్ చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఇకపై ఎలాంటి తాత్కాలిక పొడిగింపులు ఉండబోవని స్పష్టం చేసింది.
కరోనా అనంతర కాలంలో వలస కార్మికుల నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బును కువైట్, ఇతర గల్ఫ్ దేశాలు వసూలు చేస్తుండటం తెలిసిందే. కువైట్ లో ఇటీవల అమలులోకి వచ్చిన 250 కువైటీ దినార్ల(రూ.61వేలు) రెన్యువల్ రుసుము, 503 దినార్ల(రూ.1.23లక్షలు) హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజులు చెల్లించి వర్క్ పర్మిట్లను పునరుద్ధరించుకోవాలని ప్రభుత్వం సూచించింది.
కరోనా పరిస్థితు చక్కబడటంతో మధ్యలో కొన్నాళ్లు ఈ కేటగిరీ ప్రవాసుల వర్క్ పర్మిట్ల రెన్యువల్ విషయంలో సందిగ్ధం ఏర్పడింది. 30 నుంచి 90 రోజుల వ్యవధితో తాత్కాలిక పొడిగింపుకు కువైట్ రెసిడెన్సీ అఫైర్స్ అధికారులు అనుమతి ఇచ్చారు. దీనికి గాను రోజుకు రెండు కువైటీ దినార్లు వసూలు చేశారు. కానీ ఇకపై ఈ తాత్కాలిక పొడిగింపులు ఉండవని ప్రకటించింది. దీంతో ప్రవాసులు తప్పనిసరిగా డబ్బులు చెల్లించి పర్మిట్లు పొందాల్సిన పరిస్థితి.
నిబంధనలకు లోబడి వర్క్ పర్మిట్లను రెన్యువల్ చేసుకోవడం లేదా ఫ్యామిలీ వీసాకు బదిలీ చేసుకోవడానికి అవకాశం ఉంటేనే పనిచేసుకునే అవకాశం ఉంది. లేనిపక్షంలో 60 ఏళ్లు దాటినవారు కువైట్ ను వీడాల్సి ఉంటుంది. తాజా గణాంకాల ప్రకారం 60 ఏళ్లు దాటిన, యూనివర్శిటీ డిగ్రీలేని 62,948 మంది ప్రవాసులు కువైట్ ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కువైట్ లో ఉపాధి పొందుతోన్న 80 వేల మంది తెలంగాణ కార్మికుల్లో 60 ఏళ్లు దాటినవారి సంఖ్య 8వేల వరకు ఉంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.