Kim Jong Un Sister Warning To South Korea : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తర్వాత ఆ దేశ పాలనా విధానపరమైన నిర్ణయాల్లో ఆయన సోదరి కిమ్ యో జోంగ్ కీలక పాత్ర పోషిస్తుంటారన్న విషయం తెలిసిందే. కిమ్ యో జోంగ్ కూడా అన్నకు తగ్గ చెల్లెలు అనడంలో ఎటువంటి సందేహం లేదు. . కొరియన్ సెంట్రల్ కమిటీ వర్కర్స్ పార్టీకి డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న కిమ్ యో జోంగ్.. తన అన్న కిమ్ జో ఉన్‌కు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. తన ప్రత్యర్థులను బెదిరించడంలో అన్న కిమ్ కంటే ఆమె ఒక అడుగు ముందే ఉంటారు. తాజాగా, పొరుగుదేశం దక్షిణ కొరియాకు కిమ్ సోదరి ఘాటైన హెచ్చరికలు చేశారు. అణ్వాయుధాల పేరుతో భయపెట్టే ప్రయత్నం చేశారు. దక్షిణ కొరియా సైనిక ఘర్షణకు దిగితే తమ దేశం నేరుగా అణ్వాయుధాలనే ఉపయోగిస్తుందని,అణ్వాయుధాలతో దాడిచేసి దక్షిణ కొరియా సైన్యాన్ని సమూలంగా నాశనం చేస్తామని హెచ్చరించారు.
48 గంటల్లో ఆమె ఇటువంటి బెదిరింపులకు పాల్పడం ఇది రెండోసారి గమనార్హం. కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపన ప్రకారం కిమ్ యో జోంగ్ మాట్లాడుతూ.." ఉత్తర కొరియాపై రక్షణాత్మక దాడుల గురించి దక్షిణ కొరియా రక్షణ మంత్రి వ్యాఖ్యానించడం చాలా పెద్ద తప్పు. దక్షిణ కొరియా సైనిక సంఘర్షణ ప్రారంభిస్తే ప్రతిగా ఉత్తర కొరియా ఒక్క బుల్లెట్ కూడా కాల్చదు. షెల్లింగుల జోలికి వెళ్లదు. ఎందుకంటే మా సాయుధ దళాల సామర్థ్యానికి అవి సరితూగవు. మా అణ్వాయుధ దళాలే తమ పని చేసుకుపోతాయి" అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. రెండు రోజుల కిందట కూడా కిమ్ యో జోంగ్ ఇటువంటి హెచ్చరికలే చేశారు.
ALSO READ Biden On Putin : పుతిన్ యుద్ధనేరస్తుడే..విచారణ చేపట్టాల్సిందేన్న బైడెన్
కిమ్ సోదరి ఆగ్రహానికి గతవారం దక్షిణ కొరియా రక్షణ మంత్రి సు వూక్ చేసిన వ్యాఖ్యలే కారణం. తమ అమ్ములపొదిలో అనేక క్షిపణులు ఉన్నాయని, ఉత్తర కొరియాలో ఏ మూలకైనా అవి చేరుకోగలవని పరోక్షంగా వూక్..నార్త్ కొరియాకు వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, వాటి గురితప్పే ప్రశ్నే ఉండబోదన్నారు. దక్షిణ కొరియా మంత్రి చేసి ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కిమ్ యో జోంగ్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని కిమ్ యో జోంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ కొరియా ఆ సాహసం చేస్తే అదో పెద్ద తప్పు అవుతుందని, రక్షణ చీఫ్ ఉన్మాదిగా మారి దాడులు గురించి మాట్లాడుతున్నట్లు ఆమె ఆరోపించారు. సాహసాలు చేయాలన్న ఆలోచనను దక్షిణ కొరియా కట్టిబెడితే మంచిదని హితవు పలికారు. ఇలాంటి దుందుడుకు వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీస్తాయని స్పష్టం చేశారు. ఏదేమైనా ఇలాంటి ప్రకటనలు చేసేముందు ఓసారి ఆలోచించుకోవాలని సూచించారు.
దక్షిణ కొరియా సైన్యాన్ని పనికిరాని ఆర్మీగా అభివర్ణించిన కిమ్ సోదరి...తమపై దాడి చేస్తే తప్ప దక్షిణ కొరియా సైన్యాన్ని తమ లక్ష్యంగా పరిగణించమని అన్నారు. అయితే, ఇరుదేశాల్లో వినాశకర పరిస్థితులకు దారితీసే యుద్ధాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. 1950 నాటి పరిస్థితులను తాము కోరుకోవడం లేదని అన్నారు. దక్షిణ కొరియా తదుపరి చర్యల ఆధారంగా పరిస్థితుల్లో మార్పు ఉంటుందన్నారు. గతంలో అమెరికాని కూడా కిమ్ సోదరి తీవ్రంగా హెచ్చరించిన విషయం తెలిసిందే. మరోవైపు, ఉత్తర కొరియా.. ఈ ఏడాది జనవరి నుంచి మళ్లీ మిసైల్స్ పరీక్షలు మొదలుపెట్టింది. అంతేకాదు, మూడేళ్ల తర్వాత మరోసారి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి అమెరికా, దాని మిత్రదేశాలకు హెచ్చరికలు కూడా పంపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kim jong un, North Korea, South korea