తాలిబన్ పాలనలోని అఫ్గానిస్థాన్ లో సిక్కు మైనార్టీలపై మరో భయానక దాడి జరిగింది. రాజధాని కాబూల్ నగరంలోని ప్రఖ్యాత కార్తే పర్వాన్ గురుద్వారాపై ఉగ్రవాదులు భీకర దాడికి పాల్పడ్డారు. గురుద్వారా మొత్తాన్ని కూల్చేందుకు విఫలయత్నం చేశారు. అయితే పేలుడులో ప్రార్థనామందిరం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఇప్పటిదాకా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా, గురుద్వారాపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది.
కాబూల్ సిటీలోని కార్తే పర్వాన్ గురుద్వారా అక్కడి సిక్కుల ప్రధాన ప్రార్థనాలయాల్లో ఒకటి. శనివారం ఉదయం గురుద్వారాలో శక్తిమంతమైన పేలుళ్లు సంభవించాయి. తుపాకి పేలుడు కూడా వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. గురుద్వారాను ధ్వంసం చేయడమే లక్ష్యంగా సాగిన దాడిలో ఇద్దరు సిక్కులు ప్రాణాలు కోల్పోయారు.
గురుద్వారా తగలబడుతూ భారీ ఎత్తున పొగ బయటకు వస్తున్న దృశ్యాలు వైరలయ్యాయి. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితిని దగ్గరి నుంచి గమనిస్తున్నట్లు తెలిపింది. అక్కడి తాజా పరిస్థితిపై సమాచారం కోసం వేచి చూస్తున్నామని పేర్కొంది.
''ఉదయం 6 గంటల సమయంలో కార్తే పర్వాన్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పేలుడు శబ్దం వినిపించింది. అరగంట తర్వాత మరో పేలుడు సంభవించింది. ప్రస్తుతం ఘటనా స్థలాన్ని పూర్తిగా భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి'' అని ప్రత్యక్షసాక్షి ఒకరు పేర్కొన్నారు.
ఘటన జరిగిన సమయంలో గురుద్వారాలో కనీసం 30 మంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే, ఇప్పటిదాకా రెండు మరణాలను మాత్రమే నిర్ధారించగా, మొత్తం ఎందరు ప్రాణాలు కోల్పోయారనేది స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం అఫ్గాన్ భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని, అనుమానితుల కోసం గాలిస్తున్నది. కాగా,
గురుద్వారాలో పేలుడును ఆత్మాహుతి దాడిగానూ అనుమానిస్తున్నారు. ఇది ఐసిస్ ఉగ్రమూకల దుశ్చర్య కావొచ్చని స్థానిక మీడియాలో రిపోర్టులు వస్తున్నాయి. పేలుళ్లు జరిగిన సమయంలో గురుద్వారాలో భక్తులు ఉన్నట్లు చెబుతున్నారు. అఫ్గాన్ పాలన తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత అక్కడ ఉగ్రకార్యకలాపాలు పెరుగుతూ వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Kabul, Kabul blast