కరోనా వైరస్ (Corona Virus) వెలుగుచూసి దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఈ రెండేళ్ల కాలంలో అనేక కొత్త కరోనా వేరియంట్లు (New Variants) ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి. నిన్నమొన్నటిదాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్ ప్రజలను వణికించింది. అయితే ఇప్పుడు డెల్టా వేరియంట్‌ను (Delta Variant) తలదన్నే ఒమిక్రాన్ అనే మరో వేరియంట్ సౌతాఫ్రికాలో (South Africa) వెలుగుచూసింది. కోవిడ్-19 తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న క్రమంలోనే ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) వేగంగా వ్యాప్తి చెందుతూ గుండెల్లో గుబులు రేపుతోంది. ఇది అత్యంత తక్కువ సమయంలోనే ఖండాలు దాటుతూ అనేక మంది ప్రజలకు సంక్రమిస్తోంది. ఇందులో డెల్టా వేరియంట్ కంటే అధిక మొత్తంలో స్పైక్ మ్యుటేషన్లు ఉంటాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
దక్షిణాఫ్రికా గురువారం గుర్తించిన B.1.1.529 కోవిడ్-19 వేరియంట్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ 'ఒమిక్రాన్' అని నామకరణం చేసింది. వేగంగా వ్యాపించే ఒమిక్రాన్ రోగిలో తీవ్ర లక్షణాలకు దారితీయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్న వేళ విమాన రాకపోకలు నిలిపివేసేందుకు దేశాలు శరవేగంగా చర్యలు చేపడుతున్నాయి. మరో పక్క స్టాక్‌మార్కెట్లు ఒక్కసారిగా వేల పాయింట్లలో పతనమయ్యాయి. శాస్త్రవేత్తలు అత్యవసర సమావేశాలు నిర్వహించి ఒమిక్రాన్ వల్ల ఎంత నష్టం వాటిల్లే అవకాశం ఉందో అంచనా వేస్తున్నారు.
corona cases: జర్మనీని హడలెత్తిస్తున్న కరోనా.. ఆ దేశంలో కొత్త వేరియంట్ ప్రవేశించినట్లు అనుమానం
ఒమిక్రాన్ వేరియంట్ 25 ఏళ్లలోపు వ్యక్తులపై కూడా ప్రభావం చూపుతోంది. బుధవారం దక్షిణాఫ్రికా దేశం ఒమిక్రాన్ గురించి డబ్ల్యూహెచ్ఓ సంస్థకు తొలిసారిగా నివేదించింది. ఈ వేరియంట్ దక్షిణాఫ్రికాలో మాత్రమే కాదు బెల్జియం, హాంకాంగ్, బోట్స్వానాతో ఇజ్రాయెల్‌లలో కూడా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించారు. వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంట్లను బాగా అర్థం చేసుకోవడానికి పూర్తి జీనోమ్ సీక్వెన్సులను, అనుబంధిత మెటాడేటాను పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న డేటాబేస్కు సమర్పించాలని.. అందుకుగాను నిఘా, సీక్వెన్సింగ్ ప్రయత్నాలను మెరుగుపరచాలని డబ్ల్యూహెచ్ఓ దేశాలను కోరింది. అయితే బి.1.1.529 వేరియంట్ కేసులు ఏయే దేశాల్లో శాస్త్రవేత్తలు గుర్తించారో ఇప్పుడు చూద్దాం.
* బోట్స్వానా
బోట్స్వానాలో ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్‌ను 'బోట్స్వానా' వేరియంట్‌గా కూడా సూచిస్తారు. ఈ వేరియంట్ అధిక సంఖ్యలో మ్యుటేషన్లు కలిగి ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇటీవలే సడలించిన వీసా పరిమితులు, అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఆ దేశ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
* సౌతాఫ్రికా
దక్షిణాఫ్రికాలోని గౌతెంగ్, నార్త్ వెస్ట్, లింపోపో ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. జోహన్నెస్‌బర్గ్, ష్వానే రెండూ మునుపటి కరోనా వేవ్ లకు హాట్స్పాట్లుగా ఉన్నాయి. కానీ ఒమిక్రాన్ ప్రస్తుతం సౌతాఫ్రికా రాజధానులపై పంజా విసురుతోంది. ప్రిటోరియా వెస్ట్, అటెరిడ్జ్విల్లే, సెంచూరియన్, హాట్ఫీల్డ్, సోషాంగువే వంటి ప్రాంతాల్లో దీని ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. ఈ వేరియంట్‌కు సంబంధించిన 90 శాతం కేసులు గౌతెంగ్ ప్రావిన్స్ లోనే నమోదైనట్టు ప్రొఫెసర్ డి ఒలివేరా వెల్లడించారు. డయాగ్నొస్టిక్ ల్యాబ్ పరీక్షల సూచిస్తున్న సంకేతాల ప్రకారం ఈ వేరియంట్ ఇప్పటికే అనేక ఇతర ప్రావిన్సులలో కూడా వ్యాప్తి చెంది ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
* ఇజ్రాయెల్
తమ దేశంలో ఒక ఒమిక్రాన్ వేరియంట్ కేసును గుర్తించినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. మరో ఇద్దరికి కూడా ఇదే వేరియంట్ సంక్రమించి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీరు ముగ్గురూ రెండో డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినప్పటికీ ఈ వేరియంట్ టీకా శక్తిని దాటుకుని సోకినట్లు తెలుస్తోంది. దాంతో దీని ముందు టీకాలు కూడా దిగదుడుపేనని భయాలు వ్యక్తమవుతున్నాయి.
* హాంకాంగ్
వైద్య నిపుణుల ప్రకారం హాంకాంగ్ లో ఒక కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ కేసును గుర్తించారు.
* బెల్జియం
కరోనా కొత్త వేరియంట్ కన్ఫర్మడ్ కేసును బెల్జియం శుక్రవారం గుర్తించింది. అదే సమయంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఫోర్త్ వేవ్ కరోనావైరస్ ను అరికట్టడానికి బెల్జియం తలమునకలవుతోంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.