Home /News /international /

JOE BIDEN WINS MORE VOTES THAN ANY OTHER PRESIDENTIAL CANDIDATE IN US HISTORY REPORT BA

US Elections 2020: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన జో బైడెన్

డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్

డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్

ఇప్పటి వరకు అమెరికాలో ఏ పార్టీ అభ్యర్థికి కూడా రానన్ని ఓట్లు జో బైడెన్‌కు వచ్చినట్టు నేషనల్ పబ్లిక్ రిపోర్ట్ తెలిపింది.

    అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు అమెరికాలో ఏ పార్టీ అభ్యర్థికి కూడా రానన్ని ఓట్లు జో బైడెన్‌కు వచ్చినట్టు నేషనల్ పబ్లిక్ రిపోర్ట్ తెలిపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈనెల 3న జరిగాయి. ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. నవంబర్ 4వ తేదీ పూర్తయ్యే సరికి జో బైడెన్‌కు 70.7 మిలియన్ల ఓట్లు వచ్చినట్టు ఎన్పీఆర్ తెలిపింది. గతంలో 2008 సంవత్సరంలో అప్పటి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి బరాక్ ఒబామాకు వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు జో బైడెన్ 3,00,000 ఓట్లు ఎక్కువగా సాధించారు. 2008లో ఒబామాకు 69,498,516 పాపులర్ ఓట్లు వచ్చాయి. ఇక తన ప్రత్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే జో బైడెన్ 2.7 మిలియన్ పాపులర్ ఓట్ల మెజారిటీలో ఉన్నారు. ఇక ఎలక్టోరల్ ఓట్ల విషయానికి వస్తే జో బైడెన్‌కు 264 ఓట్లు వచ్చాయి. 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న అమెరికాలో మెజారిటీ మార్క్‌ (270)కు కేవలం ఆరు ఓట్ల దూరంలో ఉన్నారు. ముఖ్యమైన రాష్ట్రాల్లో బైడెన్ ముందంజలో ఉన్నారు.

    ఎన్పీఆర్ రిపోర్టు ప్రకారం ఇంకా చాలా చోట్ల ఓట్లను పూర్తిగా లెక్కించాల్సి ఉంది. కాలిఫోర్నియాలో 64 శాతం ఓట్లను మాత్రమే లెక్కించారు. ఇంకా 34 శాతం ఓట్ల కౌంటింగ్ పూర్తి కావాల్సి ఉంది. ఇక ట్రంప్ విషయానికి వస్తే ఆయన గతంలో ఒబామాకు వచ్చిన ఓట్లకు (67.32 మిలియన్) దగ్గర్లో ఉన్నారు. మరోవైపు ముందస్తు పోలింగ్, మెయిల్ ఇన్ బ్యాలెట్స్ పద్ధతిలో మరో 100 మిలియన్ ఓట్లు వచ్చాయని అంచనా వేశారు. అందులో ఇంకా 23 మిలియన్ల ఓట్లు లెక్కించాల్సి ఉందని ఎన్బీసీ తెలిపింది.

    మరోవైపు సుదీర్ఘకాలం ఓట్ల కౌంటింగ్ జరపడంపై డొనాల్డ్ ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై తాను న్యాయపోరాటం చేస్తాననే సంకేతాలను పంపారు. నార్త్ కరోలినాలో ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల రోజు రాత్రే తాను గెలిచినట్టు ప్రకటించుకోవడానికి సిద్ధం అయినట్టు ప్రశ్నించగా దానిపై స్పందించారు. ‘కాదు. కాదు. అది తప్పుడు రిపోర్ట్.’ అని అన్నారు. తన టీమ్ న్యాయపోరాటానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు హింట్ ఇచ్చారు. నార్త్ కరోలినా, పెన్సుల్వేనియాలో ఆలస్యంగా వచ్చిన ఓట్లను కూడా లెక్కించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ మీద ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అది సరికాదు. ఎన్నికలు ముగిసిన తర్వాత బ్యాలెట్స్ ఎలా తీసుకుంటారు.’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీని వల్ల చాలా ప్రమాదం జరుగుతుందని అన్నారు. అమెరికా అధ్యక్షుడి భవితను తేల్చగల నిర్ణయాత్మక రాష్ట్రాల్లో ఇలా చివరి నిమిషం ఓట్లను స్వీకరించడం మీద ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కంప్యూటర్ యుగంలో కూడా ఇంకా లేట్ ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. అలాగే, మెయిల్ ఇన్ బ్యాలెట్లలో ఫ్రాడ్ జరిగి ఉంటుందని ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు.

    అమెరికాలో కరోనా కావడంతో చాలా మంది ఎన్నికల రోజు కంటే ముందస్తు ఓటింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మెయిన్ ఇన్ బ్యాటెట్లు కూడా చాలా వచ్చాయి. వాటిని లెక్కించడం ఆలస్యం అవుతోంది. కొన్నిసార్లు రోజులు, వారాల తరబడి కూడా పట్టొచ్చని చెబుతున్నారు. దీన్ని బట్టి ఎన్నికలు జరిగిన రోజు రాత్రే విజేతను ప్రకటించడం సాధ్యం కాదు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Donald trump, Joe Biden, US Elections 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు