H1B Visa: హెచ్1బీ వీసాల విషయంలో జో బైడెన్ కీలక నిర్ణయం.. గతంలో జీతాలపై ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను..

జో బైడెన్ (ఫైల్ ఫొటో)

హెచ్ 1బీ వీసాల విషయంలో జో బైడెన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ట్రంప్ సర్కారు తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టీమ్ కీలక ఉత్తర్వులను జారీ చేసింది.

  • Share this:
    హెచ్ 1బీ వీసాల విషయంలో జో బైడెన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ట్రంప్ సర్కారు తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టీమ్ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. అమెరికాకు హెచ్ 1బీ వీసాతో వచ్చే విదేశీయుల కనీస జీతాలను అమాంతం పెంచుతూ గతంలో ట్రంప్ సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీని వల్ల కంపెనీలు అంత పెద్ద మొత్తం వెచ్చించి విదేశీ నిపుణులను రప్పించే బదులుగా, అమెరికాలోని స్థానిక పౌరులకే ఉద్యోగాలిస్తాయన్నది ట్రంప్ ఉద్దేశం. అయితే ఈ ఉత్తర్వుల అమలు తేదీని పొడిగిస్తూ తాజాగా జో బైడెన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా ఈ ఉత్తర్వులను అసలు అమలు చేయాలా ? వద్దా? ఏమైనా మార్పులు చేయాలా? అన్న దానిపై అమెరికన్ పౌరులను, ప్రముఖ కంపెనీల నుంచి అభిప్రాయాలను సేకరించాలన్న నిర్ణయానికి వచ్చింది.

    దీనికి సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం జో బైడెన్ సర్కారు విడుదల చేసింది. మే 14వ తారీఖు వరకు గత సర్కారు తీసుకున్న నిర్ణయాలను పెండింగ్ లో పెడుతున్నట్టు ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. దాదాపు 60 రోజుల పాటు ఈ పొడిగింపు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని జో బైడెన్ టీమ్ చెబుతోంది. కాగా, ట్రంప్ గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికన్ కంపెనీలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయనీ, నిపుణులైన విదేశీయులను హెచ్1బీ వీసాతో అమెరికాకు రప్పించలేకపోతున్నామని సిలికాన్ వ్యాలీ కంపెనీలు చెబుతున్నాయి.

    ఇదిలా ఉండగా, జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్1బీ వీసా విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. హెచ్1బీ వీసాను కలిగిన వారి భాగస్వాములు కూడా అమెరికాలో ఉద్యోగం చేసేందుకు అంగీకరిస్తూ ఇటీవలే ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల అమెరికాలోని లక్షలాది మంది భారతీయ పౌరులకు ప్రత్యక్షంగా మేలు చేకూరుతోంది. అమెరికాలో హెచ్1బీ వీసాను పొందుతున్న వారి జాబితాలో చైనా తర్వాత భారతీయులదే రెండో స్థానం కావడం గమనార్హం.
    Published by:Hasaan Kandula
    First published: