ప్రపంచంలో అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశానికి కొత్త అధ్యక్షుడుగా జోబైడెన్ ప్రమాణస్వీకారం చేస్తున్నారు. అమెరికా 46 వ అధ్యక్షుడిగా జో బైడెన్.. ఉపాధ్యకురాలిగా కమలా హారిస్.. తమ పీఠాలను అదిరోహించే సమయం ఆసన్నమైంది. అధ్యక్షుడు కావాలన్న ఆయన ఐదు దశాబ్దాల కల నేడు సాకారం కాబోతున్నది. ఇందుకు వాషింగ్టన్ లోని క్యాపిటల్ హాల్ బిల్డింగ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కొద్దిరోజుల క్రితం ఇక్కడ గత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు ఈ భవనం మీద దాడులకు పాల్పడిన నేపథ్యంలో అలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం.. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
గతేడాది నవంబర్ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల తరఫున పోటీ చేసిన బైడెన్.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ మాత్రం ఆయన అపజయాన్ని ససేమిరా ఒప్పుకోలేదు. తనకు ఉన్న అన్నీ అస్త్రాలను వాడి.. చివరికంటా బైడెన్ ను అడ్డుకోవాలని చూశారు. కోర్టు మెట్లు కూడా ఎక్కారు. చివరికి తన అనుయాయులతో కలిసి చారిత్రాత్మక క్యాపిటల్ హాల్ భవనం మీద దాడులకు కూడా పాల్పడి.. అమెరికా ప్రతిష్టను మంటగలిపారు. అయితే ఎన్ని కుయుక్తులు పన్నినా బైడెన్ మాత్రం ఎక్కడా సహనం కోల్పోలేదు. ట్రంప్ కు ఆయన రీతిలోనే సమాధానం చెప్పి.. శభాష్ అనిపించుకున్నారు.
కాగా.. పాలనలో ఆయన ముద్ర కనిపించేందుకు బైడెన్ ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేశారు. ఈ మేరకు ట్రంప్ పాలనలో జరిగిన తప్పులను సరిదిద్దడానికి ఆయన యత్నిస్తున్నారు. ముందుగా ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణయాలను వెనక్కు తీసుకునేలా.. బైడెన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేయనున్నట్టు తెలుస్తున్నది. ఇందులో పారిస్ ఒప్పందం మొదలు.. అమెరికాను మళ్లీ ప్రపంచ ఆరోగ్య సంస్థతో చేర్చడం.. ప్రభుత్వ సంస్థల్లో మాస్కులను తప్పనిసరి చేయడం.. విద్యార్థులపై అప్పుల భారాన్ని తగ్గించడం.. ముస్లిం దేశాలపై నిషేధాన్ని ఎత్తివేయడం, వివక్షకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఉన్నాయి.

ప్రమాణ స్వీకారం చేస్తున్న కమలా హారిస్
ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు అమెరికన్ పాప్ సింగర్ లేడి గాగా తన గీతాలతో ఆహుతులను అలరించారు. కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో అధ్యక్షుడు బైెెడెన్ కూడా ఆమె పక్కనే ఉండటం గమనార్హం. హారిస్ ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత మరో గాయకురాలు జెన్నిఫర్ లోఫెజ్ కూడా తన గేయాలతో ప్రజలను అలరించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:January 20, 2021, 22:15 IST