India in UN Session: ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాక్‌కు కౌంటర్ ఇచ్చిన భారత్.. తన స్పీచ్‌తో ‌పాక్‌ను నిలదీసిన స్నేహ..

యూఎన్ సమావేశాల్లో మాట్లాడుతున్న స్నేహఆ దూబే(Image-ANI)

పాకిస్థాన్ ఉగ్రవాదులకు మద్దతిస్తూ, సహాయం చేస్తూ, ఆశ్రయం కల్పించే సుదీర్ఘ చరిత్రను కలిగి ఉందని భారత ప్రతినిధి, ఐక్యరాజ్యసమితిలో భారత ఫస్ట్ సెక్రటరీ స్నేహా దూబే ( First Secretary Sneha Dubey) వ్యాఖ్యానించారు.

  • Share this:
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (UNGA) వార్షిక సమావేశాల్లో భారత్.. పాకిస్థాన్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఈ సమావేశాల్లో కశ్మీర్ సమస్యను లేవనెత్తిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు తాజాగా భారత్ ఘాటుగా సమాధానం ఇచ్చింది. సెప్టెంబర్ 21 నుంచి ప్రపంచ దేశాల అగ్రనేతలు ఈ ఉన్నతస్థాయి వర్చువల్ మీటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 24న ఇమ్రాన్‌ ఖాన్ (Imran Khan) వర్చువల్ ప్రసంగం చేస్తూ.. కశ్మీర్, లడఖ్ విషయంలో భారత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. అయితే ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రకటనలకు సమాధానం ఇచ్చే హక్కును భారత్ తాజాగా వినియోగించుకుంది. పాక్ ప్రధాని ప్రసంగానికి భారత్ ధీటుగా బదులిచ్చింది.

పాకిస్థాన్ ఉగ్రవాదులకు మద్దతిస్తూ, సహాయం చేస్తూ, ఆశ్రయం కల్పించే సుదీర్ఘ చరిత్రను కలిగి ఉందని భారత ప్రతినిధి, ఐక్యరాజ్యసమితిలో భారత ఫస్ట్ సెక్రటరీ స్నేహా దూబే ( First Secretary Sneha Dubey) వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులకు అండగా నిలిచే విధానాన్ని పాటిస్తోందని ఇమ్రాన్ ఖాన్‌ని ఆమె దుయ్యబట్టారు. పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలతో సహా, మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్(Jammu and Kashmir) , లడఖ్ (Ladakh).. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కూడా విడదీయరాని భారత భూభాగాలని చెబుతూ ఇండియా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.

"ఒకవైపు మంటలు రగిలిస్తూనే మరోవైపు అగ్నిమాపక సిబ్బంది వలె పాకిస్తాన్ (Pakistan) మంచి దేశంలా నటిస్తుంది. పాకిస్థాన్ మైనారిటీలు నిరంతర ప్రాణభయంతో జీవిస్తున్నారు. వారి హక్కులను అణచివేయడానికి పాక్ ప్రభుత్వం నిధులు అందజేస్తుంది." అని స్నేహా దూబే వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులకు బాహాటంగానే మద్దతు ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం, ఆర్థిక సహాయం చేయడం, ఆయుధాలు అందించడాన్ని విధానంగా పెట్టుకున్న దేశంగా పాకిస్థాన్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని ఆమె అన్నారు.

"పాకిస్తాన్ ‘ఉగ్రవాద బాధిత దేశం' అని మనం తరచూ వింటూనే ఉంటాం. ఉగ్రవాదులు తమ పొరుగువారికి మాత్రమే హాని చేస్తారనే ఆశతో పాకిస్థాన్ వారిని తమ బ్యాక్‌యార్డ్‌ లో పెంచి పోషిస్తోంది. వారి విధానాల వల్ల భారత్ తో సహా ప్రపంచ దేశాలు బాగా నష్టపోయాయి. దీనికితోడు వారు తమ దేశంలో పెట్రేగిపోతున్న మతపరమైన హింసను ఉగ్రవాద చర్యలుగా కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు" అని దూబే భారత్ తరఫున గట్టిగా స్పందించారు.

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ రికార్డ్ చేసిన సందేశం ప్లే చేసిన తర్వాత భారత్ పైన పేర్కొన్నటువంటి సమాధానం ఇచ్చింది. ఈ సందేశం లో ఇమ్రాన్ ఖాన్ 13 సార్లు కశ్మీర్ గురించి ప్రస్తావించారు. హురియత్ నాయకుడు సయ్యద్ అలీ షా గీలాని అంత్యక్రియల గురించి అబద్ధాలు వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారు. అంతేకాదు, శాంతి కోసం భారతదేశానికి పిలుపునిచ్చారు. దక్షిణాసియాలో శాశ్వతమైన శాంతి అనేది జమ్మూ కశ్మీర్ వివాదం పరిష్కారంపై ఆధారపడి ఉంటుందన్నారు.

సమస్యల పరిష్కారం కోసం పాకిస్థాన్‌కి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే బాధ్యత భారతదేశంపై ఉందని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ఇతర పాకిస్థానీ నేతలు, దౌత్యవేత్తలు సైతం కశ్మీర్ అంశం గురించి లేవనెత్తారు. యూఎన్ జనరల్ అసెంబ్లీ ప్రసంగాలలో భారతదేశంలోని ఇతర అంతర్గత విషయాలు గురించి ప్రస్తావించారు. అయితే పాకిస్తాన్ కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమస్యగా మార్చేందుకు ప్రయత్నించింది కానీ అంతర్జాతీయ సమాజం కశ్మీర్ కేవలం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక విషయమేనని జోక్యం చేసుకోవడానికి ముందుకు రావడం లేదు.
Published by:Sumanth Kanukula
First published: