హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

అదృశ్యం కాదు హత్య: సౌదీ జర్నలిస్ట్ ఖషోగ్జీ మిస్సింగ్ విషాదాంతం!

అదృశ్యం కాదు హత్య: సౌదీ జర్నలిస్ట్ ఖషోగ్జీ మిస్సింగ్ విషాదాంతం!

జమాల్ ఖషోగ్జీ మిస్సింగ్‌పై మద్దతుదారుల నిరసన..(File)

జమాల్ ఖషోగ్జీ మిస్సింగ్‌పై మద్దతుదారుల నిరసన..(File)

జమాల్ ఖషోగ్జీ అక్టోబర్ 2న ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయంలోకి వెళుతూ చివరిసారిగా కనిపించారు. ఆ తర్వాత ఆయన అదృశ్యం కావడంతో సౌదీ రాయబార వర్గాల పైనే అనుమానాలు మొదలయ్యాయి.

  గత రెండు వారాలుగా అదృశ్యమైన సౌదీ జర్నలిస్టు జమాల్ ఖషోగ్జీ గురించి సంచలన వార్త వెలుగుచూసింది. అంతా అనుమానించినట్టే ఆయన హత్యకు గురయ్యారు. ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయంలో ఆయన హత్యకు గురైనట్టు సౌదీ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించాయి. సౌదీ ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేసిన జర్నలిస్టుగా జమాల్ ఖషోగ్జీకి పేరుంది. దీంతో ఆయన హత్య వెనుక సౌదీ అరేబియా పాలక వర్గాలు ఉన్నాయా? అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

  ఖషోగ్జీ హత్య నేపథ్యంలో ఇస్తాంబుల్‌లోని సౌదీ ఇంటలిజెన్స్ చీఫ్ అహ్మద్ అల్ అసిరి, రాయల్ కోర్టు మీడియా సలహాదారు సౌద్ అల్ కహ్తానీలపై సౌదీ అరేబియా ప్రభుత్వం వేటు వేసింది. ఖషోగ్జీ వ్యవహారంతో తమకేమి సంబంధం లేదని ఇన్నాళ్లు చెబుతూ వచ్చిన సౌదీపై.. ఇప్పుడాయన హత్యకు గురైనట్టు తేలడంతో ఒత్తిడి మరింత తీవ్రమైంది.

  జమాల్ ఖషోగ్జీ అక్టోబర్ 2న ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయంలోకి వెళుతూ చివరిసారిగా కనిపించారు. ఆ తర్వాత ఆయన అదృశ్యం కావడంతో సౌదీ రాయబార వర్గాల పైనే అనుమానాలు మొదలయ్యాయి. ఖషోగ్జీ అక్కడే హత్యకు గురయ్యాడని తేలడంతో ఆ అనుమానాలు బలపడుతున్నాయి. ఇస్తాంబుల్ రాయబార కార్యాలయంలో ఖషోగ్జీకి మరికొంతమందికి మధ్య జరిగిన చర్చల్లో.. వారి మధ్య వాగ్వాదం తలెత్తి హత్యకు దారి తీసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఇప్పటికైతే ఖషోగ్జీ హత్యకు సంబంధించి స్పష్టమైన కారణాలేవి వెల్లడవలేదు. ప్రస్తుతం దీనిపై టర్కీ ప్రభుత్వం విచారణ జరుపుతోంది.

  అమెరికా-సౌదీ మైత్రిపై ఎఫెక్ట్!..

  జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ హత్య అమెరికా-సౌదీ దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. సౌదీ అరేబియాతో ఉన్న దౌత్య సంబంధాల రీత్యా.. ఇన్నాళ్లు అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై అమెరికా నోరు మెదపలేదు. కానీ జర్నలిస్ట్ ఖషోగ్జీ విషయాన్ని మాత్రం అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ వ్యవహారంలో సౌదీ ప్రభుత్వం దోషిగా తేలితే గనుక.. ఆ దేశంపై ఆంక్షలకు అమెరికా వెనుకాడదనే చెప్పాలి. అయితే  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సౌదీ అరేబియా వివరణ కోసం ఎదురుచూస్తున్నారు. సౌదీ వివరణపై ట్రంప్ సంతృప్తి చెందకపోతే పరిణామాలు ఎటు దారితీస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది.

  Published by:Srinivas Mittapalli
  First published:

  Tags: Saudi Arabia

  ఉత్తమ కథలు