కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా కొత్తగా కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుందనే విషయంలో క్లారిటీ రావడంతో.. గతంలో మాదిరిగా కరోనా సృష్టించిన ప్రళయాన్ని తట్టుకునేందుకు అనేక దేశాలు సిద్ధమవుతున్నాయి. మన దేశంలోనూ జనవరి నుంచి పిల్లలకు కరోనా టీకాలు ఇవ్వడంతో పాటు 60 ఏళ్లు దాటిన వారిని ముందు జాగ్రత్త టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేస్తోంది. అయితే ప్రపంచంలోని పలు దేశాలు ఇప్పటికే కరోనా టీకా రెండో డోసులతో పాటు మూడో డోసుగా బూస్టర్ డోసు కూడా ఇస్తున్నాయి. వాటిని తీసుకునేందుకు ప్రజలు కూడా క్యూ కడుతున్నారు. ఈ రకంగా చాలా దేశాలు తమ ప్రజలకు మూడో డోసు ఇవ్వడానికి కసరత్తు చేస్తుంటే.. ఇజ్రాయిల్ ఈ విషయంలో మరింత ముందడుగు వేసింది. ఆ దేశం నిన్న తన పౌరులకు నాలుగో బూస్టర్ డోసు ఇవ్వడం ప్రారంభించింది. ఒమిక్రాన్ వేరియంట్ నుండి పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో నాలుగో బూస్టర్ డోసుకు ఆమోదం తెలిపిన ప్రపంచంలోనే మొదటి దేశంగా ఇజ్రాయెల్ అవతరించింది.
బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి వ్యాక్సిన నాలుగో డోసు ఇచ్చే అంశాన్ని ఆమోదించినట్టు అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ నాచ్మన్ ఐష్ తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తితో చాలామంది ప్రమాదంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. నిన్న ఇజ్రాయిల్‌లో కొత్తగా 4,000 కంటే ఎక్కువ కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇజ్రాయెల్‌లో కరోనా ఐదో వేవ్ మొదలైందని అక్కడి ఆరోగ్య మంత్రి నిట్జెన్ హోరోవిట్జ్ అన్నారు.
కరోనా టీకా మూడవ డోస్‌ను సాధారణ ప్రజలకు అందించిన మొదటి దేశం ఇజ్రాయెల్ అని ప్రధాన మంత్రి నఫ్తాలీ బెన్నెట్ అన్నారు. తాజాగా నాలుగో డోసు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. పౌరులకు నాలుగో వ్యాక్సిన్ డోసు ఇచ్చే దేశాల్లో ఇజ్రాయెల్ ముందంజలో ఉంటుందని చెప్పారు. ఇజ్రాయెల్ జనాభాలో దాదాపు 42 లక్షల మంది ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ మూడో డోసు కూడా తీసుకున్నారు.
Omicron Deaths: దేశంలో రెండో ఒమిక్రాన్ మరణం.. ఏం జరుగుతోంది? పూర్తి వివరాలు
Omicron: ఒమిక్రాన్‌తో అంతటా కల్లోలం.. కానీ అది పుట్టిన దక్షిణాఫ్రికాలో మాత్రం సీన్ రివర్స్
ఇదిలా ఉంటే మన దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. మొన్న 13,154 కేసులు నమోదుకాగా, నిన్న 16,764 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 7,585 మంది కోలుకున్నారు. మరోపక్క, కరోనా కారణంగా నిన్న 220 మరణాలు సంభవించాయి.
ప్రస్తుతం 91,361 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు. రికవరీ రేటు 98.36 శాతంగా ఉంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 1,270 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో 62, ఆంధ్రప్రదేశ్‌లో 16 కరోనా కేసులు నమోదయ్యాయని వివరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona Vaccine