IS NEOCOV KILLER VIRUS WHAT WHO SAID ON THIS CORONAVIRUS DISCOVERED BY CHINESE SCIENTISTS HERE IS KEY DETAILS SK
NeoCov: నియో కోవ్ వస్తే చావు ఖాయమా? ఈ డేంజరస్ వైరస్‌పై WHO కీలక వ్యాఖ్యలు
ప్రతీకాత్మక చిత్రం
NeoCov Virus: ప్రస్తుతం ఇది జంతువుల నుంచి జంతువులకు మాత్రమే సోకుతోంది. ఐతే ఇందులోని ఓ మ్యుటేషన్ కారణంగా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని వుహాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.
2019లో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి (Corona pandemic) ఇంకా ప్రపంచాన్ని వదల్లేదు. ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ.. కొత్త కొత్త రూపాల్లో విరుచుకుపడుతూనే ఉంది. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియెంట్ (Omicron Variant) యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ.. మరో కొత్త వైరస్ బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాఫ్రికాలో నియోకోవ్ వైరస్‌ను చైనీస్ శాస్త్రవేత్తలు గుర్తించారు. గబ్బిలాల్లో ఈ ప్రమాదకర వైరస్ ఉన్నట్లు వెల్లడించారు. అది ఇంతకు ముందు వచ్చిన వేరియెంట్స్ కంటే భిన్నమైనది. అది చాలా ప్రమాదకరమైనది. వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలో కొత్త వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందించింది. చైనాలోని వుహాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు (Wuhan scientists) గుర్తించిన ఈ కొత్త రకం కరోనా వైరస్‌పై మరింత అధ్యయనం అవసరమని తెలిపింది. గబ్బిలాల్లో 'నియో కోవ్ (NeoCov) ఉన్నట్టు వుహాన్ పరిశోధకులు గుర్తించిన విషయం తమకు తెలిసిందని.. ఐతే దీని వల్ల మనుషులకు ముప్పు ఉంటుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేమని పేర్కొంది. దీనిపై మరింత లోతైన అధ్యయనం అవసరమని స్పష్టం చేసింది.
మనుషుల్లో వచ్చే 75 శాతం అంటువ్యాధులకు మూలం జంతువులేనని.. అందులోనూ అటవీ జంతువల నుంచే ఎక్కువ వ్యాధులు సంక్రమిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గబ్బిలాల్లో కరోనా వైరస్లు (Corona viruses in Bats) ఎక్కువగా కనిపిస్తున్నాయని.. జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే జునోటిక్ వైరస్‌లను ఎదుర్కొనేందుకు తమ పరిశోధనలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. ఇక సౌతాఫ్రికా గబ్బిలాల్లో నియోకోవ్ వైరస్ (NeoCov virus) ఉన్నట్లు గుర్తించి.. ఆ విషయాన్ని ప్రపంచానికి చెప్పినందుకు గాను చైనా పరిశోధకులకు డబ్ల్యూహెచ్‌వో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
కాగా, దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్తరకం కరోనా వైరస్ "నియోకొవ్"తో పెను ప్రమాదం పొంచి ఉందని చైనాలోని వూహాన్ సైంటిస్టులు హెచ్చరించిన విషయం తెలిసిందే. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్‌తో మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. కోవిడ్ 19తో పోలిస్తే నియో కోవ్ వైరస్ కాస్త భిన్నమైనదని, అదే సమయంలో ప్రమాదకరమైనదని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్‌లో ఉండే పాథోజెన్‌కు భిన్నంగా మరింత ప్రమాదకరంగా ఇది పరిణించే అవకాశాలు లేకపోలేదని అంచనా వేశారు. యాంటీబాడీలు లేదా ప్రొటీన్లను సైతం నియోకోవ్ నుంచి రక్షణ కల్పించలేదని,ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు కూడా ఈ వైరస్ ను ఎదుర్కోలేవని...వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ముప్పు ఉందని అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు "నియో కోవ్" వైరస్ మనుషులకు సోకలేదని తెలిపారు.
ప్రస్తుతం ఇది జంతువుల నుంచి జంతువులకు మాత్రమే సోకుతున్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఇందులోని ఓ మ్యుటేషన్ కారణంగా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని వుహాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోఫిజిక్స్తో కలిసి వుహాన్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం బయోఆర్షివ్లో ప్రచురితమైంది. అయితే ఈ అధ్యయనాన్ని ఇంకా పీర్ రివ్యూ చేయలేదు. నియో కోవ్ వైరస్ కొత్తదేమీ కాదని, 2012, 2015లో పశ్చిమాసియాలో వ్యాపించిన మెర్స్-కోవ్‌కు, నియోకొవ్కు సంబంధం ఉందని వూహాన్ సైంటిస్టులు తెలిపారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.