news18
Updated: November 9, 2020, 6:27 AM IST
డొనాల్డ్ ట్రంప్, మెలానియా (ఫైల్)
- News18
- Last Updated:
November 9, 2020, 6:27 AM IST
అమెరికన్లు ఇచ్చిన షాక్ నుంచి కోలుకునే లోపే ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మరో భారీ షాక్ తగలనుంది. మొదటి షాక్ ఓటర్లు ఇస్తే.. రెండో షాక్ ఇంటి నుంచే రానుంది. ఆయన భార్య, అమెరికా ప్రథమ మహిళ.. మెలానియా ట్రంప్ ఆయనకు విడాకులివ్వనున్నారని అమెరికా మీడియా కోడై కూస్తున్నది. ఇందుకు సంబంధించి మెలానియా, ట్రంప్ రాజకీయ సహాయకులు చేసిన వ్యాఖ్యలు కూడా ఈ వార్తలకు ఆజ్యం పోస్తున్నాయి. శ్వేతసౌధంలో ఈ దంపతులిరువురూ వేర్వేరుగా.. ఎవరి గదుల్లో వారే ఉంటున్నారని ఆయన వ్యాఖ్యానించడంతో ఈ వార్తలలకు మరింత బలం చేకూరింది. చాలాకాలంగా వారిద్దరి మధ్య సఖ్యత కరువైందని.. ఏదో ఉన్నామా అంటే ఉన్నామనే ధోరణిలో వారిద్దరూ వ్యవహరిస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే... అమెరికా అధ్యక్ష పీఠం దక్కించుకోవడానికి ట్రంప్ తన సొంత ఊళ్లో ఉంటూ లెక్కలేసుకుంటున్న సమయంలో.. మరోవైపు మెలానియా ట్రంప్ కూడా లెక్కలేసుకున్నారట. మెలానియా లెక్కలేసింది ట్రంప్ విజయం గురించి కాదండోయ్.. తన కొడుకుకు రావలసిన వాటా గురించి.. వాళ్లిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకుంటున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అమెరికాకు చెందిన ఒక పత్రికా కథనం ప్రకారం.. అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ నిష్క్రమించిన మరుక్షణమే ఆమె కూడా ఆయన జీవితం నుంచి తప్పుకోనున్నట్టు ఆ వార్తా సారాంశం.
దీనిపై ట్రంప్ రాజకీయ సహాయకుడు ఒమరొస మానిగుల్ట్ స్పందిస్తూ.. ‘శ్వేత సౌధం నుంచి ఆయన వెళ్లిపోయే క్షణం గురించి ఆమె ప్రతి నిమిషాన్ని కౌంట్ చేస్తున్నారు. ఆయన నిష్క్రమించిన మరుక్షణమే ఆమె కూడా విడాకుల కోసం కోర్టులో దావా వేయవచ్చు..’ అని తెలిపారు. ఇదే విషయమై మెలానియా సహాయకులు స్టీఫెన్ ఓల్కాఫ్ స్పందిస్తూ... ‘వారిద్దరూ ఇప్పటికే వైట్ హౌస్ లో వేర్వేరుగా ఉంటున్నారు. వారి పదిహేనేళ్ల వివాహం ఒక లావాదేవి వంటిది మాత్రమే..’ అని తెలపడం గమనార్హం. విడాకుల తర్వాత మెలానియా, ఆమె కొడుకుకు రావలసిన దానిపై ఆమె కోర్టులో దావా వేసే అవకాశం ఉందని ఆమె సహాయకులు అంటున్నారు. చాలాకాలంగా వారిద్దరి మధ్య సఖ్యత కరువైందని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.
ఏదెలా ఉన్నా.. ఇప్పటికే అమెరికన్లు ఇచ్చిన తీర్పుతో ట్రంప్ కు దిమ్మతిరిగి బొమ్మ కనబుతుండగా.. ఇది మరో తలనొప్పి కానుండటం ఖాయంగా కనిపిస్తున్నది. మరి ఈ విడాకుల వార్తల్లో నిజమెంతో తెలియాలంటే జనవరి 20 దాకా ఆగాల్సిందే (అంతకంటే ముందే తెలిసిన ఆశ్చర్యపోవాల్సిన పన్లేదు). ఎందుకంటే కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారం.. మాజీ అధ్యక్షుడి పదవి విరమణ అదే రోజు కదా మరి.
Published by:
Srinivas Munigala
First published:
November 9, 2020, 6:10 AM IST