Home /News /international /

IRAN SAYS IT WONT HAND OVER BLACK BOXES OF CRASHED UKRAINIAN BOEING JET TO AMERICANS SK

ఆ విమానం కూలిపోయిందా..? క్షిపణితో కూల్చేశారా..?

ఇరాన్‌లో విమాన ప్రమాద దృశ్యాలు

ఇరాన్‌లో విమాన ప్రమాద దృశ్యాలు

విమానం కూలిన తర్వాత మంటలు చెలరేగి కాలిపోయిందని ఇరాన్ ప్రభుత్వం చెప్పింది. కానీ వీడియోలో మాత్రం విమానం కాలిపోతూనే కింద పడిపోయింది. గాల్లో ఉన్న సమయంలోనే మంటలు అంటుకున్నట్లు స్పష్టమవుతోంది.

    ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇరుదేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై బుధవారం ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. అది జరిగిన కాసేపటికే ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ 737 విమానం కుప్పకూలింది. ఆ ప్రమాదంలో 176 మంది చనిపోయారు. సాంకేతిక కారణంతోనే విమాన ప్రమాదం జరిగిందని.. ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయిందని మొదట వార్తలు వచ్చాయి. ఐతే ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో విమాన ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక లోపంతోనే కూలిపోయిందా? లేదంటే ఇరాన్ దళాలు పొరపాటున క్షిపణితో కూల్చేశాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

    ఎందుకంటే..?
    విమానం కూలిపోయిన ప్రాంతంలో రెండు బ్లాక్ బాక్స్‌లను ఇరాన్ రెస్క్యూ బృందం సేకరించింది. ఐతే ఆ బ్లాక్ బాక్స్‌లను అమెరికాకు గానీ, బోయింగ్ సంస్థకు గానీ ఇచ్చే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దర్యాప్తు కోసం బ్లాక్ బాక్స్‌ను ఏ దేశానికి పంపిచాలని ఇంకా నిర్ణయించలేదని ఇరాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్, ఇరాన్‌తో పాటు బోయింగ్ సంస్థ అమెరికాకు చెందినందున ఆ దేశం కూడా దర్యాప్తులో పాలుపంచుకోనుంది. ఐతే ప్రమాదం ఇరాన్ భూభాగంలో జరిగినందున తమ దేశం నేతృత్వంలోనే దర్యాప్తు ప్రక్రియ జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

    మరోవైపు ఇంజిన్‌ వైఫల్యం కారణంగానే విమానం కూలిందని మొదట ఉక్రెయిన్ చెప్పింది. ప్రమాదం వెనుక ఎలాంటి ఉగ్రకోణం లేదని.. క్షిపణి దాడి జరగలేదని పేర్కొంది. అనంతరం మరో ప్రకటన విడుదల చేసింది. అందులో ఇంజిన్‌ వైఫల్యం అనే పదాన్ని ఉక్రెయిన్ తొలగించింది. విమాన ప్రమాదానికి గల కారణాన్ని ఇప్పుడే చెప్పలేమని, దర్యాప్తు తర్వాతే అంచనాకు రాగలమని ఆ ప్రధాని చెప్పారు. మొదట విడుదల చేసిన ప్రకటన అధికారమైనది కాదని తెలిపారు.

    అటు బోయింగ్ సంస్థ సైతం విమాన ప్రమాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విమానం కండిషన్‌లోనే ఉందని.. జనవరి 6నే టెక్నికల్ మెయింటెనెన్స్ నిర్వహించామని వెల్లడించింది. అప్పుడు ఎలాంటి సమస్యలు లేవని..అంతా బాగానే ఉందని తెలిపింది. ఉక్రెయిన్ ప్రకటన, బోయింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో విమాన ప్రమాదంపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

    అంతేకాదు ప్రమాదం జరిగిన తర్వాత ఇరాన్ చేసిన వ్యాఖ్యలకు, ఆ తర్వాత బయటకొచ్చిన వీడియోకు పొంతన లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విమానం కూలిన తర్వాత మంటలు చెలరేగి కాలిపోయిందని ఇరాన్ ప్రభుత్వం చెప్పింది. కానీ వీడియోలో మాత్రం విమానం కాలిపోతూనే కింద పడిపోయింది. గాల్లో ఉన్న సమయంలోనే మంటలు అంటుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా సేనలపై దాడులు చేసే క్రమంలో ఇరాన్ ప్రభుత్వమే.. పొరపాటున విమానాన్ని కూల్చివేసి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి వాస్తవమేంటన్నది పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాతే తెలుస్తుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Iran, Plane Crash, Ukrain

    తదుపరి వార్తలు