Afghanistan Crisis: తాలిబన్లు సంచలన ప్రకటన.. ఆపద్ధర్మ అధ్యక్షుడ్ని నేనే అంటూ అమ్రుల్లా ట్వీట్..

తాలిబన్ల కీలక ప్రకటన

ఆప్ఘనిస్థాన్ లో ఏం జరుగుతోంది. ఫ్యూచర్ ఏంటని భయ పడుతూ జనం దేశం దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. మహిళలు అయితే తమ ప్రాణాలు అరచేత పెట్టుకుంటున్నారు.. ఇలాంటి సమయంలో అనూహ్యంగా తాలిబన్లు కీలక ప్రకటన చేశారు..

 • Share this:
  అప్ఘనిస్థాన్ అల్లకల్లోలంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుంతో తెలియక అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అఫ్గానిస్తాన్‌ ప్రజలందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్లు తాలిబన్లు సంచలన ప్రకటన చేశారు. దేశ ప్రజల్లో తమపై ఏర్పడిన భయాందోళనలు తొలగించే యత్నాల్లో భాగంగా మహిళలు ప్రభుత్వంలో చేరాలని అనూహ్యంగా పిలుపునిచ్చారు. గతంతో పోలిస్తే తాము మారిపోయామని చెప్పడానికి తాలిబన్లు యత్నిస్తున్నా, అఫ్గాన్‌ ప్రజలు మాత్రం ఉలిక్కిపడుతూనే ఉన్నారు. ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదించామని తాలిబన్‌ ప్రతినిధి ఎనాముల్లా సమాంగని టీవీలో చెప్పారు. ప్రజలంతా సాధారణ, రోజువారీ కార్యకలాపాలు కొనసాగించుకోవాలని, ప్రభుత్వ అధికారులంతా విధులకు హాజరుకావాలని ప్రకటించారు. దేశాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఎలా ఉండబోతున్నదీ తాలిబన్లు తమ కల్చరల్‌ కమిషన్‌లో సభ్యుడైన ఎనాముల్లా ప్రకటనతో స్పష్టం చేశారు. గతంలో తమను వ్యతిరేకించిన వారు, విదేశీయులకు మద్దతునిచ్చిన వారితో సహా అందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్లు ఎనాముల్లా చెప్పారు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టలేదని.. పాత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో తాలిబన్‌ ప్రతినిధుల చర్చలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. పౌర ప్రభుత్వాలతో, విదేశీ సేనలతో కలిసి పనిచేసిన వారిపై తాము ప్రతీకారం తీర్చుకోమని తాలిబన్‌ నేతలు చెబుతున్నారు. కానీ ఇప్పటికే తమకు వ్యతిరేకంగా పనిచేసినవారి జాబితాను తాలిబన్లు తయారు చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

  ఇదే సమయంలో అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ దేశం విడిచి పారిపోవడంతో ఆపద్ధర్మ అధ్యక్షుడిని తానేనంటూ ఆ దేశ తొలి ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ ప్రకటించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. అఫ్గాన్‌ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించనున్నట్టు వెల్లడించారు. తాను ప్రస్తుతం దేశంలో లోపలే ఉన్నానన్నారు. అఫ్గాన్‌ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు లేనప్పుడు ఉపాధ్యక్షుడే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. అందువల్ల ప్రస్తుతం తానే అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు. ఏకాభిప్రాయం, మద్దతు కూడగట్టేందుకు నేతలందరినీ కలుస్తానని ఆయన ట్విటర్‌లో వివరించారు.

  గతంలో స్త్రీల హక్కులకు తీవ్రభంగం కలిగించిన తాలిబన్లు ఈ దఫా ఆశ్చర్యకరంగా మహిళలపై సానుభూతి చూపుతున్నారు. అఫ్గాన్‌లో 40 ఏళ్లుగా కొనసాగుతున్న సంక్షోభంలో మహిళలే ప్రధాన బాధితులని తాలిబన్‌ ప్రతినిధి ఎనాముల్లా తెలిపారు. ఇకపై తమ పాలనలో మహిళా బాధితులుండరన్నారు. మహిళా విద్య, ఉద్యోగాలకు తగిన వాతావరణం కల్పిస్తామని, ఇస్లామిక్‌ చట్టం ప్రకారం వివిధ ప్రభుత్వ విభాగాల్లో మహిళలను నియమిస్తామని చెప్పారు. స్త్రీలపై తమ వైఖరి మారిందనేందుకు సాక్ష్యం కోసం తాలిబన్‌ నేత ఒకరు మహిళా విలేకరికి ఇంటర్వ్యూ ఇచ్చారు. మరోవైపు ప్రజా జీవనం నుంచి స్త్రీలను దూరం చేయవద్దంటూ కాబూల్‌లో పలువురు మహిళలు హిజాబ్‌ ధరించి ప్రదర్శన చేశారు.

  2021లో అఫ్గాన్‌ అభివృద్దికి కేటాయించిన 25 కోట్ల యూరోల సాయాన్ని నిలిపివేస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది. అయితే మానవతా సాయం, రక్షణ సేవలకు అందించే సాయాన్ని మాత్రం కొనసాగిస్తామని తెలిపింది. అఫ్గాన్‌కు అందించే సాయాన్నితగ్గిస్తామని స్వీడన్‌ మంత్రి పర్‌ ఆల్సన్‌ ఫ్రిడ్‌ చెప్పారు. సైనికుల తరలింపు కోసం అఫ్గాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరలా తెరిచారు. అఫ్గాన్‌లో ఉన్న అమెరికన్లు స్వదేశం వచ్చేందుకు ఆన్‌లైన్‌లో తమ పేర్లను రిజిస్టర్‌ చేయించుకోవాలని యూఎస్‌ ఎంబసీ సూచించింది. దేశమంతా వేలాదిమంది గాయాల పాలైనట్లు రెడ్‌క్రాస్‌ తెలిపింది.

  అఫ్గాన్‌ తాలిబన్ల వశమైన దగ్గర్నుంచి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మళ్లీ వారి అరాచక పాలనను భరించే ఓపిక లేని ప్రజలు వేలాది మంది వేరే దేశాలకు వెళ్లిపోవడానికి కాబూల్‌ విమానాశ్రయంలోనే ఉన్నారు. విమానాల కోసం పడిగాపులు కాస్తున్నారు. ప్రజలందరికీ ఎలాంటి హాని తలబెట్టబోమని తాలిబన్లు హామీ ఇచ్చినప్పటికీ ప్రజలు విశ్వసించడం లేదు. కాబూల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో పరిస్థితిపై తాజాగా మక్సార్‌ టెక్నాలజీ ఉపగ్రహ ఛాయా చిత్రాలను విడుదల చేసింది. ఈ చిత్రాల్లో తాలిబన్ల నుంచి దూరంగా పారిపోవాలని నిస్సహాయ స్థితిలో ఎదురు చూపులే కనిపిస్తున్నాయి. అయితే కాబూల్‌ విమానాశ్రయానికి విపరీతంగా జనం వచ్చి పడిపోతూ ఉండడంతో అమెరికా బలగాలు గాల్లోకి కాల్పులు జరుపుతూ వారిని చెదరగొడుతున్నాయి. రన్‌వేలపై ఉన్న విమానాలను అదేదో బస్సుల మాదిరిగా కదులుతుంటే కూడా ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published: