వలసదారులకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో పనిచేస్తోన్న వసలదారులు.. ప్రత్యేకించి లక్షల మంది భారతీయులకు ఇది శుభవార్త. గడువు ముగిసిన కొన్ని రకాల వలసదారుల వర్క్ పర్మిట్ల చెల్లుబాటును ఏకంగా మరో ఏడాదిన్నరకు పొడిగించింది బైడెన్ సర్కారు. (US Work Permit Extension)
ప్రస్తుతం వర్క్ పర్మిట్ల చెల్లుబాటు గడువు 180 రోజులుకాగా, తాజా పెంపుతో ఇది 540 రోజులకు చేరుకుంటుంది. ఈ మేరకు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ మంగళవారం నాడే ఉత్తర్వులు జారీ చేయగా, అవి బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. వివరాలివి..
భారత్ నుంచి వచ్చేవారితో సహా వలసదారులకు భారీ ఊరటనిచ్చేలా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వలసదారుల వర్క్ పర్మిట్‌ను 18 నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో వేలాది మంది భారతీయులకు ప్రయోజనం చేకూరనుంది.
గ్రీన్‌కార్డులు ఆశించేవారితో పాటు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్లు (ఈఏడీ) పొందిన హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములతో సహా నిర్దిష్ట వర్గాలకు గడువు ముగిసిన వర్క్ పర్మిట్లను పొడిగిస్తున్నట్లు బైడెన్ సర్కారు తాజాగా వెల్లడించింది.
వర్క్ పర్మిట్ల చెల్లుబాటు గడువు పెంపునకు సంబంధించి హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం మంగళవారం ప్రకటించిన ఈ నిర్ణయం మే 4 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుత ఈఏడీల్లో పేర్కొన్న గడువు తేదీ నుంచి 180 రోజుల పొడిగింపు వ్యవధిని ఆటోమేటిక్‌గా 540 రోజులకు పెంచుతున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో దాదాపు 4.2 లక్షల మంది వలసదారులకు లబ్ధి కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ నేత అజయ్ జైన్ భుటోరియా తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: H1B Visa, Indian, IT Employees, USA, Work