UNESCO: అత్యాచార కేసుల్లో భారత మీడియా రిపోర్టింగ్‌పై యునెస్కో షాకింగ్​ నివేదిక

ప్రతీకాత్మక చిత్రం

UNESCO Study: యునెస్కో నుంచి ఇలాంటి రిపోర్ట్ వస్తుందని ఎవరూ ఊహంచలేదు. ఇది ఇండియాని ఉలిక్కి పడేలా చేసింది. అసలు ఆ రిపోర్టులో ఏముంది? భారత మీడియా రేప్ కేసులను ఎలా చూస్తోంది?

  • Share this:
UNESCO Study: లైంగిక వేధింపుల ఘటనల విషయంలో భారత మీడియా రిపోర్టింగ్‌పై ఐక్యరాజ్యసమితి విద్యా, సాంకేతిక, సాంస్కృతిక సంస్థ - యునెస్కో షాకింగ్ విషయాలు తెలిపింది. తాజాగా పరిశోధనా పత్రంలో మీడియా వైఖరిపై విమర్శలు చేసింది. ‘సెక్సువల్​వయలెన్స్​అండ్ న్యూస్ మీడియా: ఛాలెంజెస్ అండ్ గైడ్​లెన్స్​ఫర్ జర్నలిస్ట్స్ ఇన్ ఇండియా’ పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. లైంగిక వేధింపుల కేసులను రిపోర్ట్ చేసేటప్పుడు పాటించాల్సిన మార్గదర్శకాలను ఇందులో సూచించింది. అలాగే ప్రస్తుత పరిస్థితిపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.

అధిక క్రూరత్వం, తీవ్రమైన హింస జరిగిన లైంగిక వేధింపుల కేసులపైనే భారతీయ మీడియా ఎక్కువ దృష్టి సారిస్తోందని పరిశోధనలో తెలిపింది. దీని ద్వారా సాధారణంగా జరిగే లైంగిక వేధింపులు ఎలా జరుగుతున్నాయన్న విషయం మరుగున పడుతోందని చెప్పింది. తద్వారా మొత్తంగా లైంగిక వేధింపుల సమస్యే పక్కదారి పడుతోందని అభిప్రాయపడింది. బాధితులు లేదా నేరస్తులు సమాజంలో ప్రముఖులైతే భారతీయ మీడియా వారిని చాలా ఎక్కువగా కవర్ చేస్తోందని తమ అధ్యయనంలో తేలిందని, తమ పరిశోధనలో 20 శాతానికి పైగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఆ నివేదికలో చెప్పింది. దీని ద్వారా సాధారణ కేసులు మరుగున పడుతున్నాయని చెప్పింది.

లైంగిక వేధింపుల గురించి పోలీసులు, అధికార యంత్రాంగం ప్రకటిస్తున్న విషయాలను 16.7 శాతం రిపోర్టు చేస్తున్న మీడియా... నేరం తీవ్రతను బట్టి 14 శాతం రేప్​కేసులను కవర్ చేస్తోందని నివేదిక చెప్పింది. పట్టణాల్లో జరుగుతున్న లైంగిక వేధింపుల ఘటనలు 44 శాతం న్యూస్​పేపర్లలో కవర్ అవుతుండగా... గ్రామాల్లో వేధింపుల ఘటనలు మరుగున పడిపోతున్నాయని చెప్పింది. గ్రామాల్లో జరుగుతున్న వేధింపుల్లో 22 శాతం ఘటనలు మాత్రమే మీడియా కవర్ చేయగలుగుతోందని తెలిపింది.

ఇది కూడా చదవండి: Okinawa ipraise plus: ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ.2,000తో బుక్ చేసుకోండి.

అత్యాచార వార్తలు కవర్ చేస్తున్న సందర్భంలో ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను విశ్లేషించకుండా ఘటనకు సంబంధించిన దాని గురించే చాలాసార్లు రిపోర్ట్ చేస్తున్నట్టు నివేదిక చెప్పింది. అత్యాచార ఘటనలు జరిగిన సమయంలో సమాజంలో మార్పు తీసుకురావడం తమ బాధ్యత అని 78 శాతం జర్నలిస్టులు భావిస్తున్నారని రిపోర్టు చెప్పింది. అయితే కేవలం 7శాతం స్టోరీలు మాత్రమే వేధింపుల సమస్య అంతమయ్యే పరిష్కారాలేంటన్న విషయంపై దృష్టి సారించేలా ఉన్నాయని నివేదిక చెప్పింది.

భారత దేశంలోని 6 భాషలకు చెందిన 10 దినపత్రికలను పరిశోధన చేసిన యునెస్కో ఈ నివేదికను రూపొందించింది. అలాగే 14 భాషలకు చెందిన ప్రింట్, రేడియో, ఆన్​లైన్ మీడియాకు చెందిన 257 మంది జర్నలిస్టులను సైతం ఇంటర్వ్యూలు చేసింది.

లైంగిక వేధింపుల కేసుల రిపోర్టింగ్ విషయంలో జర్నలిస్టులకు ఈ నివేదిక కొన్ని సూచనలు చేసింది. ఈ విషయంలో ఎంతో సున్నితంగా రిపోర్టింగ్ ఉండాలని, మీడియా యాజమాన్యాలు పూర్తి జవాబుదారీతనంతో ఉండాలని చెప్పింది. ఎవరూ మానసికంగా కుంగిపోకుండా ఉండేలా వార్తలు ఉండాలని చెప్పింది. ఇలాంటి కేసులను రిపోర్టింగ్ చేసే సమయంలో వినియోగించే భాష కూడా సున్నితమైన పదాలను ఎంచుకోవాలని చెప్పింది. ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలించడం సహా కచ్చితమైన నిజాలు బయటికి వచ్చాకే వివరాలను బయటకు చెప్పాలని సూచించింది. అలాగే వేధింపుల సమస్య ఎలా పరిష్కారమవుతుందనే విశ్లేషణతో కూడిన కథనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.

ఇది కూడా చదవండి: Video: అద్భుతం. రైల్లోకి దూద్‌సాగర్ జలపాతం. చూసి తీరాల్సిందే!

సమాజంలో లైంగిక వేధింపులు తగ్గేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై అన్ని సంస్థల ఎడిటోరియల్ విభాగాలు చర్చించుకోవాలనీ, ఇందుకు ఏవైనా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందా అని విశ్లేషణ చేసుకోవాలని నివేదిక కోరింది. సమాజంలో మార్పు వచ్చేందుకు జర్నలిస్టులందరూ దృష్టి సారించాలని యునెస్కో నివేదిక సూచించింది.
Published by:Krishna Kumar N
First published: