Shrina Kurani: అమెరికా ప్రతినిధుల సభ ఎన్నికల బరిలో భారతీయ అమెరికన్.. మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేయనున్న శ్రినా కురానీ

శ్రినా కురానీ

భార‌త మూలాలున్న మరో మహిళ అమెరికా చట్లసభల్లో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్రరాజ్యంలో మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు భారత సంత‌తికి చెందిన పారిశ్రామికవేత్త శ్రినా కురానీ.

  • Share this:
భార‌త మూలాలున్న మరో మహిళ అమెరికా చట్లసభల్లో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్రరాజ్యంలో మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు భారత సంత‌తికి చెందిన పారిశ్రామికవేత్త శ్రినా కురానీ. కాలిఫోర్నియా నుంచి హౌజ్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్‌ లేదా ప్రతినిధుల సభకు డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేయ‌నున్నట్లు ఆమె ప్రకటించారు. వచ్చే ఏడాది నవంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న మ‌ధ్యంతర ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ నేత కెన్ కాల్వ‌ర్ట్‌పై ఆమె పోటీ చేయనున్నారు. గతంలో 15 సార్లు ఈ స్థానం నుంచి గెలిచిన కెన్ కాల్వ‌ర్ట్.. 30 ఏళ్ల నుంచి ప‌ద‌విలో ఉంటున్నారు. కానీ ఆ ప్రాంతానికి ఆయ‌న చేసిందేమీ లేదని శ్రినా విమర్శిస్తున్నారు.

శ్రినా కాలిఫోర్నియాలోని రివర్‌సైడ్‌లో పుట్టి పెరిగారు. ఆమె తల్లిదండ్రులు భారత్‌ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. రివర్‌సైడ్‌లో వ్యాపారాలు ప్రారంభించిన శ్రినా తల్లిదండ్రులు విజయవంతమయ్యారు. వారికి వివిధ రకాల వ్యాపారాలు ఉన్నాయి. తాను ఒక ఎంట్రప్రెన్యూర్, ఇంజినీర్, వాస్తవిక సమస్యల పరిష్కారిణి అని శ్రినా తన వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి వాస్తవిక దృక్పథంతో ఆలోచించే నాయకులు కావాలని ఆమె చెబుతున్నారు. కాలిఫోర్నియాలోని 42వ డిస్ట్రిక్ (సీఏ-42) నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ, యూఎస్ కాంగ్రెస్‌లో అగుడు పెట్టడానికి పోటీ పడుతున్నట్లు శ్రినా తెలిపారు.

కెన్ కాల్వర్ట్ వంటి రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత వృద్ధికి, వారి రాజకీయ పార్టీలకు, వారికి మద్దతిచ్చే కార్పొరేట్ దాతలకు సహాయం చేయడంపై మాత్రమే దృష్టి సారిస్తున్నారని శ్రినా విమర్శిస్తున్నారు. అలాంటి వారిపై మొదటి తరం అమెరికన్ అయిన తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

శ్రినా.. లా సియెర్రా హై స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తరువాత రివర్‌సైడ్‌లోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం స్వీడన్‌లో సస్టైనబిలిటీ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ కూడా చేశారు. అమెరికా ప్రతినిధుల సభలో ప్రస్తుతం నలుగురు భారతీయ అమెరికన్లు ఉన్నారు. డాక్టర్ అమీ బెరా, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి, ప్రమీల జయపాల్.. నలుగురూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వీరి సరసన శ్రినా చేరుతుందో లేదో తెలియాలంటే ఇంకొన్ని నెలలు వేచి చూడాల్సిందే.
Published by:Sambasiva Reddy
First published: