Indian-American Cop: భారత సంతతి వ్యక్తికి అరుదైన ఘనత.. అమెరికాలో పోలీస్ చీఫ్‌గా నియామకం 

ప్రతీకాత్మకచిత్రం

అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తి అరుదైన ఘనత సాధించనున్నారు. పోలీస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న తొలి శ్వేత వర్ణేతర వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోనున్నారు కేరళ మూలాలు ఉన్న మైఖేల్ కురువిల్లా అనే వ్యక్తి.

  • Share this:
అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తి అరుదైన ఘనత సాధించనున్నారు. పోలీస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న తొలి శ్వేత వర్ణేతర వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోనున్నారు కేరళ మూలాలు ఉన్న మైఖేల్ కురువిల్లా అనే వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే.. ఇండో-అమెరికన్ పోలీసు మైఖేల్ కురువిల్లా అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్ర శివారు ప్రాంతమైన బ్రూక్ ఫీల్డ్ తదుపరి పోలీసు చీఫ్‌గా అవకాశం దక్కించుకున్నారు. ఆయన కుటుంబం కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్లింది. ఈ అత్యున్నత ఉద్యోగానికి మైఖేల్‌ను సిఫార్సు చేశారు యాక్టింగ్ పోలీస్ చీఫ్ ఎడ్వర్డ్ పెట్రాక్. ఆయన సిఫార్సును బ్రూక్ ఫీల్డ్ విలేజ్ మేనేజర్ తిమోతీ వైబెర్గ్ ఆమోదించారు. దీంతో జులై 12న ఎడ్వర్డ్ పెట్రాక్ నుంచి పోలీసు చీఫ్ పదవిని మైఖేల్ చేపట్టనున్నారు.

ప్రస్తుతం డిప్యూటీ చీఫ్ హోదాలో ఉన్న 37 ఏళ్ల మైఖేల్ కురువిల్లా.. 2006లో బ్రూక్ ఫీల్డ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. ఈ పదవి చేపట్టిన మొదటి భారతీయ-అమెరికన్ కూడా మైఖేలే కావడం విశేషం. ఆయన చికాగోలోని ఇల్లానియిస్ విశ్వవిద్యాలయం నుంచి సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. పోలీసు అవ్వడానికి ముందే 2006లో పౌర సంక్షోభ కార్మికుడిగా పనిచేశాడు. మైఖేల్ చీఫ్‌గా ఉండటానికి అన్ని నైపుణ్యాలు, తెలివితేటలు కలిగి ఉన్నాడని ఎడ్వర్డ్ స్థానిక మీడియాతో తెలిపారు. ఓ విభాగాన్ని నడపడానికి ఆయనకు 15 ఏళ్ల అనుభవం ఉందన్నారు. మైఖేల్ ప్రతి స్థాయిలో విజయవంతమయ్యాడని ఎడ్వర్డ్ స్పష్టం చేశారు.

ఇక్కడ వరకు వస్తానని ఊహించలేదు..
"వలస కుటుంబం నుంచి ఇందులోకి వచ్చాను. పోలీసు బాధ్యతలు సాధారణ విషయం కాదు. లా అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో నాకు ఎవరూ తెలియదు. నా వంతు కృషి చేయడం వల్లే నేను ఇక్కడి వరకు వచ్చాను. అయితే ఈ పదవి చేపడతానని అనుకోలేదు. ఈ పని పట్ల నాకున్న అభిరుచితోనే ఈ స్థాయికి చేరుకున్నాను" అని మైఖేల్ కురువిల్లా తెలిపారు. 2020 సెప్టెంబరులో మైఖేల్ 40 అండర్ 40 అనే అవార్టును అందుకున్నాడు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్ (ISP) అనే సంస్థ.. ఈ పురస్కారాన్ని అందజేసింది. ఇది ప్రొఫెషనల్ పోలీసులకు అందజేసే ప్రపంచంలోనే ప్రభావవంతమైన, అతిపెద్ద పురస్కారం.
Published by:Krishna Adithya
First published: