భారత్, చైనాల (Indo-China) మధ్య తాజాగా జరిగిన 13వ రౌండ్ సైనిక చర్చల్లో (Army Talks) ఎలాంటి స్పష్టత రాలేదు. భారత్ సూచనలను చైనా సైన్యం (China Army) పట్టించుకోలేదని, ఆమోదయోగ్యమైన ప్రతిపాదనలను చైనా ప్రతిపాదించలేదని భారత సైన్యం (Indian Army) సోమవారం వెల్లడించింది. అయితే చర్చలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. ఆదివారం మాల్దోలో భారత్- చైనా మధ్య 13వ రౌండ్ కార్ప్ కమాండర్-స్థాయి చర్చలు దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు కొనసాగాయి. తూర్పు లద్దాఖ్ సెక్టార్‌లోని (Ladak Sector) రెండు దేశాల మధ్య సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయి.
తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న అస్థిర పరిస్థితులను చక్కదిద్దడమే లక్ష్యంగా ఉన్నత స్థాయి సైనిక చర్చలు జరగనున్నాయని ప్రభుత్వ వర్గాలు ఇంతకుముందు న్యూస్-18కి తెలిపాయి. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్ద.. చైనా వైపున ఉన్న మాల్దో బోర్డర్ పాయింట్ వద్ద ఈ చర్చలు జరిగాయి.
‘తూర్పు లద్దాఖ్‌లోని LAC వద్ద నెలకొన్న సమస్యల పరిష్కారంపై ఇరుపక్షాలు ఈ సమావేశంలో దృష్టి సారించాయి. LAC వద్ద యధాతథ స్థితిని, ద్వైపాక్షిక ఒప్పందాలను చైనా ఏకపక్షంగా ఉల్లంఘించడం వల్ల ప్రస్తుత సమస్య ఏర్పడింది. పశ్చిమ ప్రాంతంలో (Western Sector) LAC వద్ద శాంతి, ప్రశాంతతను పునరుద్ధరించడానికి చైనా బలగాలు వెనక్కు వెళ్లాల్సిందే. ఇటీవల ఇరు దేశాల విదేశాంగ శాఖ మంత్రుల సమావేశంలో ప్రతిపాదించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ ముందుకు సాగాలి. అక్కడ నెలకొన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని వారు గతంలో అంగీకరించారు. ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతి సాధించాలంటే మిగిలిన ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి చైనా చర్యలు తీసుకోవాలి’ అని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి నిర్మాణాత్మక సూచనలు చేసినట్లు భారత సైన్యం చెప్పింది. "చైనా ఈ సూచనలను పట్టించుకోవట్లేదు. సమస్య పరిష్కారానికి ఎలాంటి ఆమోదయోగ్యమైన ప్రతిపాదనలు చేయలేదు. ఈ సమావేశంలో మిగిలిన ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఘర్షణ వాతావరణం నెలకొన్న ప్రాంతాల్లో స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు, చర్చలు కొనసాగించేందుకు ఇరు పక్షాలు ఆమోదం తెలిపాయి. ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్‌కు చైనా కట్టుబడి ఉంటూ మిగిలిన సమస్యల ప్రారంభ పరిష్కారానికి కృషి చేస్తుందని ఆశిస్తున్నాం” అని భారత సైన్యం వెల్లడించింది.
మరోవైపు ప్రస్తుత ప్రతిష్టంభనకు చైనా భారతదేశాన్ని నిందించింది. ‘చైనా- ఇండియా మధ్య ఆదివారం 13వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. ఇందులో అసమంజసమైన, అవాస్తవమైన డిమాండ్లపై భారత్ పట్టుబడుతోంది’ చైనా అధికార వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ నివేదించింది.
చైనా సైన్యం ఇటీవల రెండుసార్లు అతిక్రమణలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఆదివారం 13వ రౌండ్ చర్చలు జరిగాయి. ఉత్తరాఖండ్ బారాహోటి సెక్టార్, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ పరిధిలోకి చైనా సైన్యం చొచ్చుకువచ్చింది. గత వారం అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్‌సే సమీపంలో భారత్- చైనా సైనికుల మధ్య భౌతిక ఘర్షణ జరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. సంబంధిత ప్రోటోకాల్స్ ప్రకారం ఇరుపక్షాల కమాండర్ల మధ్య చర్చలు జరిగిన తర్వాత కొన్ని గంటల్లోనే సమస్యను పరిష్కరించుకున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, India-China, Indian Army